నీళ్లలో సెల్ఫీ స్పాట్.. పెరిగిన ఆదాయం

సెల్ఫీ తీసుకోవడం.. దాన్ని సోషల్‌‌ మీడియాలో అప్‌‌లోడ్‌‌ చేయడం ఈ రోజుల్లో కామన్‌‌. సెల్ఫీ ఎవరితో తీసుకుంటున్నామనే  దానితోపాటు.. ఎక్కడ తీసుకుంటున్నామనేదానిపైనే లైకులు, కామెంట్లు ఆధారపడి ఉంటాయి. మంచి రెస్పాన్స్‌‌ రావాలంటే సెల్ఫీ తీసుకునే ప్రదేశం కొత్తగా, సమ్​థింగ్‌‌ స్పెషల్‌‌గా ఉండాలి. ఇండోనేసియాలోని అండర్‌‌‌‌వాటర్‌‌‌‌ సెల్ఫీ స్పాట్‌‌ అలాంటిదే. స్థానికులంతా కలిసి కొన్నేళ్లక్రితం తీర్చిదిద్దిన ఒక చిన్న కొలను ఇప్పుడా ఊరికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అండర్‌‌‌‌వాటర్‌‌‌‌ సెల్ఫీ/ఫొటో స్పాట్‌‌గా మారి, అందరికీ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది.

పేదరికాన్ని దాటి

ఇండోనేసియాలోని సెంట్రల్‌‌ జావాకు దగ్గర్లో ఉంది ఉంబుల్‌‌ పాంగాక్‌‌ అనే చిన్న ఊరు. ఆ ఊరి పరిధిలోనే ఉన్న చిన్న కొలను పాంగాక్‌‌. పదిహేనేళ్లక్రితం ఊళ్లో అంతా పేదరికమే. పెద్దవాళ్లకు సరైన పని, పిల్లలకు చదువు ఉండేది కాదు. దేశంలో ఉన్న పేద గ్రామాల్లో అదీ ఒకటి. పాంగాక్‌‌ కొలనులో ప్రజలు బట్టలు ఉతకడం, స్నానాలు చేయడం వంటి పనులు చేసేవాళ్లు. దీంతో కొలనులోని నీరు ఎప్పుడూ మురికిగా, చెత్తతో నిండి ఉండేది. ఈ పరిస్థితిలో మార్పు రావడానికి కారణం గ్రామపెద్ద జునేది ముల్యునో. 2006లో ఆయన చేసిన పనుల వల్ల ఊరు బాగు పడటంతోపాటు, అందరికీ ఉపాధి దొరికింది. ఒకప్పుడు మురికిగా ఉన్న పాంగాక్‌‌ కొలను ఇప్పుడు అట్రాక్టివ్‌‌ టూరిస్ట్‌‌ స్పాట్‌‌గా మారింది.

విద్యార్థుల చొరవతో..

పదిహేనేళ్లలో ఊరు ఇంతగా మారడానికి జునేది ఆలోచనా విధానమే కారణం. ఒక మంచి నాయకుడు ఉంటే ప్రజల జీవితాలు ఎలా మారిపోతాయో, పేదరికం నుంచి ఎలా బయట పడాలో నిరూపించాడు జునేది. ఊళ్లో పేదరికం, మిగతా సమస్యలపై అవగాహన ఉన్న జునేది దగ్గర్లో ఉన్న ఒక యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడాడు. ఊరి జనాభా, వనరులు, సమస్యలపై అధ్యయనం చేసి, మార్పు తీసుకురావడానికి తగిన సూచనలిమ్మన్నాడు. దీంతో స్టూడెంట్స్​ కొంతకాలం స్టడీ చేసి ‘తిర్తా మందిరి’ అనే ఒక విలేజ్‌‌ బేస్డ్‌‌ బిజినెస్‌‌ మోడల్‌‌ను రూపొందించారు.

అందరూ కలిసి..

‘తిర్తా మందిరి’ ప్రకారం ఊళ్లోని కుటుంబాలన్నీ కలిసి కొంత డబ్బును దీనిలో పెట్టుబడిగా పెట్టాలి. ఇది టూరిజం డెవలప్‌‌మెంట్‌‌ ఐడియా. అయితే ఊళ్లో 700 కుటుంబాలు ఉంటే 430 కుటుంబాలే  పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి. అందరూ కలిసి ఆ డబ్బుతో పాంగాక్‌‌ కొలనును క్లీన్‌‌ చేశారు. మిగతా చుట్టుపక్కల ప్రాంతాలను కూడా టూరిస్టు ప్లేసెస్‌‌గా అభివృద్ధి చేశారు. పాంగాక్‌‌ కొలనులో బట్టలుతకడం, స్నానాలు చేయడం వంటి పనులు మానేశారు. క్రమంగా మంచి నీటి కొలనుగా మార్చారు. కొద్దికాలంలోనే మురికి నీళ్లు పోయి, స్వచ్ఛమైన నీళ్లొచ్చాయి. ఎప్పటికప్పుడు నీటిని తోడేస్తూ ఫ్రెష్‌‌ వాటర్‌‌‌‌తో నింపేస్తున్నారు. ఇవి ఎంత క్లియర్​గా ఉంటాయంటే అడుగున ఉన్న నేల కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కొలను వల్లే ఊరి ప్రజల జీవితాలు మారిపోయాయి.

పెరిగిన ఆదాయం

ఊళ్లోవాళ్ల కృషితో పాంగాక్‌‌ కొలనుకు మంచి గుర్తింపొచ్చింది. దీన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు రావడం మొదలుపెట్టారు. దీంతో టూరిజం బాగా అభివృద్ధి చెందింది.
టూరిస్టుల రాకతో ప్రజలకు ఉపాధి దొరికి, ఆదాయం పెరిగింది. మెల్లిగా ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకున్నారు. ఇప్పుడు ఊరు ఎంతలా బాగుపడిందంటే ఒకప్పుడు పేద ఊరుగా ఉన్న ఉంబుల్‌‌ పాంగాక్‌‌ ఇప్పుడు దేశంలోనే టాప్‌‌ 10 రిచెస్ట్‌‌ విలేజెస్‌‌లో ఒకటిగా నిలిచింది. ఈ ఊరిని చూసేందుకు దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు. ఇక్కడి ప్రజల ఆదాయం కొన్ని వేల రెట్లు పెరిగింది. గ్రామస్తుల జీవితాలు ఎంతో మారిపోయాయి. నిరుద్యోగం, పేదరికం కనిపించవు. పిల్లలకు మంచి చదువు అందుతోంది. వనరులను సద్వినియోగం చేసుకోగలిగితే ఎంతటి మార్పైనా సాధ్యమే అనేందుకు ఈ ఊరొక ఉదాహరణ.

టూరిస్ట్‌‌ స్పాట్‌‌

ఉంబుల్‌‌ పాంగాక్‌‌కు స్పెషల్‌‌ అట్రాక్షన్‌‌గా నిలిచింది మాత్రం పాంగాక్‌‌ కొలను. ఒకప్పుడు మురికి నీళ్లతో ఉన్న ఈ కొలను ఇప్పుడు ఫ్రెష్‌‌ వాటర్‌‌‌‌ కొలనుగా మారింది. దీన్ని ఊళ్లో వాళ్లు కొన్నేళ్లుగా కాపాడుతున్నారు. ఈ కొలనులో నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే నీళ్లలో చేపలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. నీటి లోపల సెల్ఫీ/ఫొటో స్పాట్‌‌ను ఏర్పాటు చేశారు. టూరిస్టులు నీళ్లలోకి వెళ్లి ఫొటోలు తీసుకోవచ్చు. నీటిలోపల బెంచీలు, రకరకాల బైకులు, కుర్చీలు, టేబుళ్లు వంటివి ఏర్పాటు చేశారు. టూరిస్టులు నీళ్లలోకి దిగి, వాటిపై కూర్చుని ఫొటోలు తీయించుకోవచ్చు.
ఇది దేశంలోనే మోస్ట్‌‌ ఫేమస్‌‌ అండర్‌‌‌‌వాటర్‌‌‌‌ సెల్ఫీ స్పాట్‌‌గా గుర్తింపు పొందింది. ఎంతోమంది టూరిస్టులు అండర్‌‌‌‌వాటర్‌‌‌‌
సెల్ఫీ కోసమే ఇక్కడికొస్తున్నారు.

Latest Updates