కరోనా కాటుతో జాబ్స్ కు కోట్ల మంది దూరం

27 శాతానికి పెరిగిన నిరుద్యోగ రేటు
ఇది మ‌రింత పెరిగే చాన్స్-సీఐఎంఈ

న్యూఢిల్లీ: కరోనా లాక్‌‌డౌన్ కోట్లాది మంది ఉద్యోగులను రోడ్డున పడేస్తోంది. వ్యాపారాలు కుదేలయ్యాయి. ఉద్యోగులు నిరుద్యోగులయ్యారు. గత నెలలో ఇండియాలో 12.2 కోట్ల మంది ప్రజలు నిరుద్యోగులుగా మారారని తాజా రిపోర్ట్‌‌ లు చెబుతున్నాయి. ఈ నెల మూడో తేదీ నాటికి నిరుద్యోగ రేటు 27.1 శాతానికి పెరిగినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఐఎంఈ) డేటా సర్వేలో వెల్లడైంది. లాక్‌‌డౌన్‌‌ కారణంగా వ్యాపారాలు మూత పడ్డాయని, ఎంప్లాయిమెంట్ దెబ్బతిందని పేర్కొంది.

రోజువారీ కూలీలకు, చిన్న వ్యాపార సంస్థల్లో పనిచేసే వారిపై లాక్‌‌డౌన్ ప్రభావం ఎక్కువగా ఉందని సీఐఎంఈ సర్వే తెలిపింది. వీరిలో రోడ్డు పక్కన చిన్న వ్యాపారాలు నిర్వహించుకునే వారు, నిర్మాణ రంగంలో పనిచేసే వారు ఎక్కువగా ఉన్నారని పేర్కోంది. ఇది చాలా బాధాకరమైన విషయమని సీఎంఐఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మషేశ్ వ్యాస్ అన్నారు. ఇండియాలో ఉద్యోగాలు పోయిన వారి సంఖ్య, అమెరికాలో నిరుద్యోగ భృతికి అప్లయి చేసిన వారికంటే నాలుగు రెట్లు అధికంగా ఉందని పేర్కొన్నారు. అమెరికాలో నిరుద్యోగ భృతి కోసం 3 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు.

అన్ని రకాల జాబ్స్‌‌ పోతాయ్‌‌…

చాలా ఏరియాల్లో లాక్‌‌డౌన్ పొడిగించడంతో, నిరుద్యోగుల సంఖ్య ఇంకా పెరుగుతుందని సీఐఎంఈ హెచ్చరించింది. లాక్‌‌డౌన్ తొలుత అనార్గనైజ్డ్‌‌ సెక్టర్‌‌లో పనిచేసే వారిపై పడిందని వ్యాస్ తెలిపారు. ఆ తర్వాత సెక్యూర్ జాబ్స్‌‌ పై కూడా ప్రభావం చూపుతుందన్నారు. స్టార్టప్‌‌లు, ఇతర ఇండస్ట్రీ అసోసియేషన్లు కూడా ఉద్యోగులను తీసేస్తున్నారని చెప్పారు. చాలా మంది ఇప్పుడు కొత్త జాబ్ కోసం చూస్తున్నారని, ఈ రేటు 36.2 శాతం పెరిగిందని వ్యాస్ అన్నారు.

Latest Updates