కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి  అంతంతే! 

  • తెలంగాణకు కేటాయించింది రూ. 32,632 కోట్లే
  • రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు రూ. 43,418.34  కోట్లు
  • రూ. 10,785 కోట్ల మేర కోత

హైదరాబాద్​, వెలుగు: కేంద్ర బడ్జెట్‌‌లో రాష్ట్రానికి అంతంత మాత్రంగానే కేటాయింపులు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతోపాటు  మిషన్‌‌ కాకతీయ, మిషన్‌‌ భగీరథ పథకాలకు ఆర్థిక సాయం అందుతుందని ఆశించిన రాష్ట్ర ప్రభుత్వానికి వరుసగా మూడో ఏడాది కూడా నిరాశే ఎదురైంది. రెండోసారి రాష్ట్రంలో అధికారం చేపట్టిన టీఆర్​ఎస్​ ప్రభుత్వం ఈసారి కేంద్ర బడ్జెట్​పై భారీ అంచనాలే వేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం మార్చిలో తాత్కాలిక బడ్జెట్​ను ప్రవేశపెట్టింది. అందులో కేంద్రం నుంచి రూ. 43418.34  కోట్లు వస్తాయని అంచనా వేసింది. కానీ తాజా బడ్జెట్​లో కేంద్రం మన రాష్ట్రానికి  రూ. 32632 కోట్లు మాత్రమే కేటాయించింది. దీంతో రూ. 10785 కోట్ల మేరకు రాష్ట్ర అంచనాలకు గండిపడ్డట్లయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి మొత్తం రూ. 32632 కోట్లు  వస్తాయని రాష్ట్ర ఆర్థిక శాఖ విశ్లేషిస్తోంది. నిరుటి బడ్జెట్​లో కేంద్ర ప్రభుత్వం పన్నుల వాటా, గ్రాంట్ల ద్వారా రాష్ట్రానికి రూ. 30308 కోట్లు కేటాయించింది. ఆశించినంత ఆదాయం రాలేదని సవరించిన బడ్జెట్​లో వెయ్యి కోట్లు కోత పెట్టింది. నిరుటి కేటాయింపులతో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రానికి అదనంగా దక్కింది రూ.2324 కోట్లే.

పన్నుల వాటాపై జీఎస్టీ ఎఫెక్ట్

ప్రత్యేకంగా వరాలేమీ లేకపోయినా.. కేంద్రం విధిగా రాష్ట్రాలకు విడుదల చేసే నిధులే పెద్ద దిక్కుగా మారనున్నాయి. ఆర్థిక సంఘం సిఫారసుల 42 శాతం ఆదాయం రాష్ట్రాలకు పంపిణీ అవుతుంది. ఇందులో భాగంగా తెలంగాణకు ఈసారి రూ. 19718 కోట్ల వాటా వస్తుంది. ఈ నిధులు  ఏ నెలకానెల విడుదలవుతాయి. గత ఏడాది కేటాయింపులతో పోలిస్తే పన్నుల వాటా రూ.511 కోట్ల మేరకు పెరిగింది. నిరుడు రాష్ట్రానికి రూ. 19207 కోట్లు వస్తాయని అంచనా వేసిన కేంద్రం.. చివరకు రూ.18560 కోట్లకు సవరించింది. జీఎస్​టీ ద్వారా ఆశించినంత ఆదాయం రాకపోవటంతో రూ.647 కోట్లు కోత పెట్టింది.ఇక రాష్ట్రంలో అమల్లో ఉన్న కేంద్ర ప్రాయోజిత పథకాలకు గత ఏడాది కేంద్రం రూ. 8333 కోట్లు కేటాయించగా.. ఈసారి బడ్జెట్​ అంచనాల్లో రూ. 9948 కోట్లు పొందుపరిచింది.

లెక్కతేలిన ఆర్థిక సంఘం నిధులు

రాష్ట్రానికి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు ముందే డిసైడయ్యాయి. 2015 నుంచి అమల్లో ఉన్న ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఈసారి రాష్ట్రానికి రూ. 2965 కోట్లు విడుదలవుతాయి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు బేసిక్​ గ్రాంట్లతో పాటు పర్​ఫార్మెన్స్​ గ్రాంట్లు ఇందులో ఉంటాయి. వీటితో పాటు విపత్తుల నిర్వహణ నిధుల కింద రూ. 300 కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్​గా రిలీజవుతాయి. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం  కేంద్రం రెండేండ్ల కిందట రూ. 450 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను విడుదల చేయాలని గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఇప్పటికీ నిధులు రాలేదు. బడ్జెట్​లోనూ వీటి ప్రస్తావన లేకపోవటం గమనార్హం.

ప్రాజెక్టుల ఊసేలేదు

గోదావరి నుంచి సాగునీటిని అందించేందుకు భారీ ఎత్తున నిర్మించిన  కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, రూ.10 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇంటింటికీ తాగునీటిని అందించే మిషన్‌‌ భగీరథకు రూ.19 వేల కోట్లు,  చెరువుల పునరుద్ధరణకు రూ. 5 వేల కోట్లు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేసింది. ఈ రెండు పథకాలకు తగినంత ఆర్థిక సాయం అందించాలని నీతి ఆయోగ్‌‌ కూడా సిఫారసు చేసింది. వీటితో పాటు బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్‌‌ ఫ్యాక్టరీ, ఎయిమ్స్‌‌కు నిధులేమీ లేకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వ ఆశలూ అడియాసలయ్యాయి.

త్వరలో రాష్ట్ర బడ్జెట్

కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర బడ్జెట్​ను ప్రభావితం చేయనున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది పూర్తిస్థాయి బడ్జెట్​ ఇంకా ప్రవేశపెట్టలేదు. మార్చిలో సీఎం కేసీఆర్​ ఆర్థిక మంత్రి హోదాలో రూ.1.82 కోట్లతో ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​ ప్రవేశపెట్టారు. కేంద్రంలో కొత్త సర్కారు వచ్చి బడ్జెట్ పెట్టాక.. అందులో రాష్ట్రానికి చేసే కేటాయింపుల మేరకు  పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్ రూపొందించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్రం పూర్తి బడ్జెట్​పెట్టడంతో రాష్ట్రానికొచ్చే నిధులపై స్పష్టత వచ్చింది. ఆ కేటాయింపులకు అనుగుణంగా రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్​ పెట్టాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఈ నెల చివర్లో లేదా ఆగస్టు మొదటి వారంలో పూర్తి బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు.

కేంద్ర పన్నుల్లో మన వాటా(రూ.కోట్లలో)

‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెంట్రల్‌ జీఎస్టీ     5,369.67

కార్పొరేట్‌ ట్యాక్స్‌  6,718.49

ఆదాయ పన్ను   5,135.90

కస్టమ్స్‌ ట్యాక్స్‌    1,419.41

ఎక్సైజ్‌ డ్యూటీ     1,075.28

మొత్తం              19,718.75

Latest Updates