‘నిర్భయ’ దోషులను వదలేది లేదన్న కిషన్ రెడ్డి

తెలంగాణలో బతుకమ్మ, దసరా, బోనాల పండుగలకు దేవతల్ని పూజిస్తామని, మహిళలను గౌరవించే గొప్ప కల్చర్ మనదని కేంద్ర హోంశాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. మిలిటరీ పరేడ్ కు కూడా మహిళలు సారథ్యం వహిస్తున్నారని, సరిహద్దుల్లో మైనస్10 డిగ్రీల వాతావరణంలోనూ డ్యూటీ చేస్తున్నారని కొనియాడారు. చట్టాలలోని లొసుగులను పూడుస్తామని, నిర్భయ దోషులు తప్పించుకోకుండా చూస్తామన్నారు. సుప్రీంకోర్టు తన తీర్పులను తానే అమలు చేసేలా మార్పులు తెస్తామన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో జరిగిన ‘మహిళా సాధకుల అవార్డుల’ కార్యక్రమానికి ఆయన చీఫ్​గెస్ట్ గా హాజరయ్యారు. మహిళా సాధికారత పురస్కారాల్లో భాగంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 20 విభాగాల్లో ఎంపికైన 30 మంది మహిళా సాధకులకు మంత్రి అవార్డులను అందజేశారు. అవార్డ్ గ్రహీతల్లో పాతబస్తీకి చెందిన ఉమెన్ పైలెట్ ఫాతిమా, మై విలేజ్ షో యూట్యూబ్ చానల్ ఫేం గంగవ్వ, మల్టిపుల్ డిజెబిలిటీ ఉన్నా, టాపర్ గా నిలిచిన స్రవంతి, సాహిత్యరంగంలో విశేష కృషి చేసిన ఐనంపూడి శ్రీలక్ష్మి, స్వయంకృషి సంస్థ వ్యవస్థాపకురాలు మంజులా కల్యాణ్, సింగర్ మంగ్లీ, తదితరులు ఉన్నారు.

షీ టీమ్స్ మంచిగ పనిచేస్తున్నయ్..

కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మనదేశంలోనే మహిళల్ని గౌరవించుకొనే సంస్కృతి ఉందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని మంచి చట్టాలు తీసుకొస్తామని చెప్పారు. హైదరాబాద్ లో షీ టీమ్స్ బాగా పని చేస్తున్నాయన్నారు. రాష్ట్ర గిరిజన, మహిళా- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. మహిళలను గౌరవించేందుకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం2014 నుంచి నిర్వహిస్తోందన్నారు. ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంలో మహిళే కేంద్ర బిందువని, అన్నీ ఆమె పేరు మీదే చేస్తున్నామన్నారు. పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్లతో వారి ప్రాతినిధ్యం పెరిగిందని, అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారని అన్నారు. కార్యక్రమంలో మహిళా- శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, కమిషనర్ దివ్య, మీర్​పేట్​, సంగారెడ్డి మేయర్లు  దుర్గా దీప చౌహాన్, మంజుశ్రీ
తదితరులు పాల్గొన్నారు.

Latest Updates