సీఏఏతో నష్టమని నిరూపిస్తే మార్చేందుకు రెడీ

మన దేశంలో మైనార్టీలకే మెజార్టీ హక్కులున్నాయ్​

చాలా గ్రామాల్లో టాయిలెట్లే లేవు

రాజకీయాలు మాని ముందు అభివృద్ధిపై దృష్టి పెట్టండి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి

 60వేల కోట్ల అప్పును 3 లక్షల కోట్లకు పెంచిన ఘనత కేసీఆర్​దే.. మాజీ ఎంపీ వివేక్ విమర్శ

‘ఫిస్కల్ ఫెడరలిజం ఇన్ ది ఎరా ఆఫ్ మోడీనోమిక్స్’ బుక్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు: సీఏఏతో దేశంలోని ఏ ఒక్క పౌరుడికి నష్టం లేదని, అలా ఉన్నట్లు ఎవరైనా నిరూపిస్తే చట్టాన్ని మార్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సీఏఏ వల్ల మైనార్టీలకు నష్టం జరుగుతుందనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని, నిరాధారమని చెప్పారు. దేశంలో మెజార్టీ హక్కులు మైనార్టీలకే ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలన్నారు. అదే పాకిస్తాన్ లోని మైనార్టీలకు అలాంటి హక్కులు లేవన్నారు.  బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రాసిన ‘ఫిస్కల్ ఫెడరలిజం ఇన్ ది ఎరా ఆఫ్ మోడీనోమిక్స్’ పుస్తకాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఆబిడ్స్ లోని ఓ హోటల్ లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గోపాలకృష్ణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు.

40% ఫండ్స్ కూడా కేటాయించని రాష్ర్ట సర్కార్: మాజీ ఎంపీ వివేక్

రూ.60 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పును 3 లక్షల కోట్లకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కనీసం 40 శాతం నిధులు కూడా కేటాయించలేని పరిస్థితుల్లో టీఆర్ఎస్ సర్కార్ ఉందని విమర్శించారు. జీఎస్టీని వ్యతిరేకించిన పార్టీలు, ఇప్పుడు దాని వల్ల నష్టం లేదని తెలుసుకున్నాయని చెప్పారు. వచ్చే బడ్జెట్ లో జీఎస్టీని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. మంచి పుస్తకాలు సమాజ చైతన్యానికి ఉపయోగపడుతాయని, ఇలాంటి బుక్స్ రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రధాని నిత్యం దేశం కోసం ఆలోచిస్తారని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది దేశానికి, సమాజానికి మేలు చేసేదిగానే ఉంటుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గోపాలకృష్ణ అగర్వాల్ అన్నారు. కేంద్రం రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాల అభివృద్ధికి సహకరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర సహకారం తీసుకోవాలని సూచించారు.

సీఏఏతో దేశంలోని ఏ ఒక్క పౌరుడికీ నష్టం లేదు. అలా ఉన్నట్టు ఎవరైనా నిరూపిస్తే చట్టాన్ని మార్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. సీఏఏ వల్ల మైనార్టీలకు నష్టమన్న ప్రచారం అవాస్తవం, నిరాధారం. మోడీ తీసుకునే ప్రతి నిర్ణయం దేశానికి మేలు చేసేదే. ప్రతిపక్షాలకు రాజకీయం తప్ప అభివృద్ధి పట్టదు.

– కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

వెలుగు వార్తలకోసం క్లిక్ చేయండి