పేదలందరికీ ఇండ్లు కట్టిస్తే కేసీఆర్ కు నేనే ఎర్ర తివాచీ వేస్త

  • కేంద్రమిచ్చిన నిధులపై చర్చకు రెడీనా?
  • రాష్ట్రంలో ఎన్ని ఇండ్లు కట్టించారో చెప్పాలి
  • పేదలందరికీ కట్టిస్తే కేసీఆర్​కు నేనే ఎర్రతివాచీ వేస్త
  • సెక్రటేరియట్  లేని ఏకైక రాష్ట్రం తెలంగాణనే
  • సలావుద్దీన్ , కేసీఆర్ కుటుంబాల చేతిలో రాష్ట్రం బందీ
  • ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు:

కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని మంత్రి కేటీఆర్​కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి సవాల్​ విసిరారు. బీజేపీ తరఫున చర్చకు ఎమ్మెల్సీ రాంచందర్ రావు రెడీగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్న కేటీఆర్​ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని తెలిపారు. యూపీఏ పాలనలో, ఐదేండ్ల ఎన్డీయే పాలనలో రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయో చర్చిద్దామా అని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించకుండా టీఆర్ ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నదని విమర్శించారు. తనకు ఎర్రతివాచీ అవసరం లేదని, పేదలందరికీ ఇండ్లు కట్టిస్తే తానే సీఎం కేసీఆర్ కు ఎర్ర తివాచీ వేస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న పేదలకు ఎన్ని ఇండ్లు కట్టించారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో సెక్రటేరియట్ లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని విమర్శించారు.  మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రగతినగర్, నిజాంపేట, గుండ్ల పోచంపల్లిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రం ఇచ్చిన 2లక్షల ఇండ్లే ఇంత వరకు రాష్ట్ర సర్కార్​ కట్టలేదన్నారు. డబుల్ బెడ్​రూమ్​ ఇండ్ల లబ్ధిదారుల పేర్లు కేంద్రానికి ఇవ్వలేదని, దేశంలో ఇలా పేర్లు ఇవ్వని రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. రాష్ట్రం బంగారు తెలంగాణ కాలేదు కానీ కల్వకుంట్ల కుటుంబం మాత్రం బంగారు కుటుంబం అయిందన్నారు. హైదరాబాద్​ను విశ్వనగరం కాకుండా విషాదనగరంగా మార్చారని దుయ్యబట్టారు. మున్సిపోల్స్​లో టీఆర్ ఎస్ కు ఓటు ఎందుకు వేయకూడదో చెప్పటానికి ఎన్నో కారణాలు ఉన్నాయన్నారు. ఆ పార్టీ మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు మాత్రం ప్రగతిభవన్ దాటడం లేదని విమర్శించారు. టీఆర్​ఎస్​ నేతలకు బీజేపీ అంటే భయం లేకపోతే తమ అభ్యర్థులను ఎందుకు లాక్కుంటున్నారని కిషన్​రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థులను బెదిరిస్తూ లొంగదీసుకుంటున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

మళ్లీ రజాకార్ల రాజ్యమా?

కేసీఆర్, కేటీఆర్.. అసదుద్దీన్ ,అక్బరుద్దీన్ ను చెరో భుజాన ఎత్తుకుని తిరుగుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ ఎస్, ఎంఐఎం పార్టీలు  మళ్లీ రజాకార్ల రాజ్యం తీసుకురావాలనుకుంటున్నాయని అన్నారు. సలావుద్దీన్ , కేసీఆర్ కుటుంబాల చేతిలో రాష్ట్రం బందీ అయిందని తెలిపారు. మున్సిపల్​ ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని, డబ్బు, ఎంఐఎం మీదే టీఆర్ ఎస్ ఆధారపడిందని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. దారుసలాం నిర్ణయిస్తే తమకు ఓట్లు పడవని, రాష్ట్ర ప్రజలే తమకు ఓట్లు వేస్తారని ఆయన అన్నారు. టీఆర్ ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని, రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Union Minister Kishan Reddy threw a challenge to Minister KTR.

Latest Updates