సీఏఏలో మార్పులుండవ్.. ముస్లింలకు వ్యతిరేకం కాదు

    దేశమంతా కచ్చితంగా అమలు చేస్తాం: కేంద్ర మంత్రి​ నఖ్వీ

హైదరాబాద్​, వెలుగు: దేశమంతటా సిటిజన్​షిప్​ అమెండ్​మెంట్​ యాక్ట్​(సీఏఏ)ను కచ్చితంగా అమలుచేసి తీరుతామని, చట్టంలో ఎలాంటి మార్పులు ఉండబోవని కేంద్ర మంత్రి ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ తేల్చి చెప్పారు. చట్టాన్ని అమలుచేయబోమంటూ కొన్ని రాష్ట్రా లు అంటున్నాయని, అది రాజ్యాగం విరుద్ధమని అన్నారు. ఆదివారం హైదరాబాద్​లోని పీపుల్స్​ ప్లాజా వద్ద లూనార్​హాట్​ పేరుతో మైనారిటీలు తయారు చేసిన హస్తకళలు, చేనేత వస్తువుల స్టాల్స్​ను రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన పరిశీలించారు. చట్టాన్ని వ్యతిరేకిస్తున్న బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ ముందుగా చరిత్ర, రాజ్యాంగాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. ఎన్నార్సీని ఇప్పుడు కొత్తగా ఏం తీసుకురావట్లేదని, గతంలోనూ ఉందని గుర్తు చేశారు. ఎన్నార్సీ, సీఏఏపై కొంతమంది, కొన్ని పార్టీలు దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. ముస్లింలకు సీఏఏ వ్యతిరేకం కాదని, ఎన్నార్సీ వల్ల వాళ్లకు ఎలాంటి ఇబ్బందులుండవని అన్నారు.  సిటిజన్​షిప్​ అమెండ్​మెంట్​ బిల్లును పార్లమెంటులో పెట్టినప్పుడు అన్ని పార్టీల వాళ్లూ సెలెక్ట్​ కమిటీలో ఉన్నారని గుర్తు చేశారు. పార్లమెంట్​లో సీఏఏకి మద్దతు ఇచ్చిన పార్టీలూ, రాజకీయం చేస్తూ ఆందోళనలు చేస్తున్నాయన్నారు. పాక్​, ఆఫ్గాన్, బంగ్లాదేశ్​ నుంచి అక్రమంగా దేశంలోకి వచ్చే ముస్లింలకు మాత్రమే చట్టం వ్యతిరేకమన్నారు. సీఏబీ, సీఏఏ, ఎన్నార్సీ అంటే ఏంటో ముందు తెలుసుకోవాలని ఆందోళనకారులకు మంత్రి సూచించారు.

Latest Updates