ఒవైసీ మెప్పు కోసం కేసీఆర్ మత రాజకీయం

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం బాధాకరమని అన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. పార్లమెంటు చేసిన చట్టాలను రాష్ట్రాలు అమలు చేయకుండా వ్యతిరేకించడం కుదరదని, ఇది భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే ప్రయత్నమని అన్నారు. మంగళవారం హైదరాబాద్ వచ్చిన పీయూష్ గోయల్ చర్లపల్లి రైల్వే శాటిలైట్ టెర్మినల్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మెప్పు కోసం సీఎం కేసీఆర్ మత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారాయన. శరణార్థులకు భారతదేశంలో ఆశ్రయం కల్పిస్తే తప్పేంటని ఈ సందర్భంగా ప్రశ్నించారు. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ ఇస్లామిక్ రాజ్యాలని, అక్కడ మత హింసకు గురవుతున్న వారికి ఆశ్రయమిచ్చేందుకు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తెచ్చామని తెలిపారు. కానీ, ప్రతిపక్షాలు అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని కేంద్ర మంత్రి అన్నారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

కవితను ఓడించి టీఆర్ఎస్‌కు గట్టి మెసేజ్ ఇచ్చారు

తెలంగాణలో బీజేపీ వేగంగా పుంజుకుంటోందని అన్నారు కేంద్రమంత్రి పియూష్ గోయల్. లోక్‌సభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కుమార్తె కవితను ఓడించటం ద్వారా టీఆర్ఎస్‌కు ప్రజలు గట్టి మెసేజ్ ఇచ్చారని చెప్పారాయన. మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ మంచి ఫలితాలను సాధించిందన్నారు. బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, బండి సంజయ్, సోయం బాపురావు తెలంగాణ కోసం అడిగినవన్నీ చేస్తున్నామని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం మంచి సహకారం అందిస్తోందని చెప్పారు. అవగాహన లోపంతోనే కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని  అన్నారు. ఇవాళ లోక్‌సభలో తెలంగాణ బిల్లు పాసైన రోజని గుర్తు చేశారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. గత ఐదేళ్లుగా తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సహకారమే కారణమని చెప్పారు. ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.2,602 కోట్లు కేటాయించామన్నారు. బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.

Latest Updates