ఉల్లి ధర పెరుగుదలపై కేంద్ర మంత్రి పాశ్వాన్ ప్రకటన

వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ అధికారులతో సమీక్ష

వరదల వల్ల పంట దెబ్బతినడంతోనే భారీగా ధరల పెరుగుదల

రూ.80 నుంచి 120 దాకా ఉన్న ఉల్లిపాయల రేటు

నవంబరు చివరికల్లా అంతా సర్దుకుంటుందన్న కేంద్ర మంత్రి

ఉల్లి ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. కోయడం మాట అటుంచితే కొనడానికి మార్కెట్‌కు వెళ్తేనే కన్నీళ్లు తెప్పిస్తోంది ఉల్లి రేటు ఘాటు. పలు రాష్ట్రాల్లో కిలో ఉల్లి ధర రూ.80 నుంచి 100 వరకు ఉంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో రూ.100 వరకు చేరింది. దిగుమతి తగ్గడంతో ధరలు ఇంకా పెరిగే అవకాశముందంటున్నారు వ్యాపారులు. ఏకంగా రూ.40 పెరిగి  రూ.120 వరకు చేరినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. ఉల్లి లేనిదే ఏ వంటా జరగదు.. అయినా ఈ రేట్లు చూసి జనం వీలైనంతగా ఉల్లి వాడకం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.

దిగుమతి పెంచే చాన్స్

ఈ నేపథ్యంలో ఉల్లి ధరలు, సరఫరాలో సమస్యలపై కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ రివ్యూ నిర్వహించారు. కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి రవికాంత్, వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి ఏకే శ్రీవాస్తవ సహా పలువురు ఉన్నతాధికారులతో బుధవారం న్యూఢిల్లీలో సమావేశం అయ్యారు. డిమాండ్‌కు తగ్గట్టుగా పొరుగు దేశాల నుంచి ఉల్లిపాయల దిగుమతిని పెంచే అవకాశాలపై ఈ భేటీలో చర్చించారు. ఇందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ఉల్లి పంట దెబ్బతినిందని అన్నారు. పంట దిగుమతికి డిమాండ్‌కు మధ్య భారీ తేడా ఉందని చెప్పారు. ఇందువల్లనే ధరలు భారీగా పెరిగాయని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ఉన్న అన్నిమార్గాలను పరిశీలిస్తామని తెలిపారు పాశ్వాన్. సరఫరాలో ఎక్కడా సమస్యలు లేకుండా, అక్రమ నిల్వలు పెట్టుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నవంబరు చివరికల్లా సమస్య పూర్తిగా సర్దుకుంటుందని ఆయన చెప్పారు.

Latest Updates