కొత్త ప్రాజెక్టుల డీపీఆర్ లు ఇచ్చేందుకు 2 రాష్ట్రాల సీఎంలు అంగీకరించారు

న్యూఢిల్లీ: కొత్త ప్రాజెక్టుల డీపీఆర్ ల సమర్పణకు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు అంగీకరించారని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత సమావేశ వివరాలను ఆయ‌న‌ మీడియాకు వివరించారు. రెండు గంటల పాటు సాగిన‌ ఈ సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

కృష్ణా, గోదావరిపై ఏ ప్రాజెక్టు కట్టాలన్నా వాటికి అనుమతి ఇచ్చే అధికారం అపెక్స్ కౌన్సిల్ దేనని షెకావత్ స్పష్టం చేశారు. ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చ జరిగింద‌ని, తాము నిర్మిస్తున్న ప్రాజెక్టుల డీపీఆర్ ల సమర్ఫణకు రెండు రాష్ట్రాల సీఎంలు అంగీకరించారని చెప్పారు. నీటి వాటాలపై ఇద్దరు సీఎంల మధ్య చర్చ జరిగిందని ఆయన తెలిపారు. కృష్ణా రివర్ బోర్డు ఏపీలో ఏర్పాటుకు ఈ సమావేశంలో ఆమోదం లభించిందన్నారు. ట్రిబ్యునల్ అవార్డులను నోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకొన్నామని ఆయన చెప్పారు. ఆరేళ్ల తర్వాత కూడ కృష్ణా, గోదావరి నదుల సరిహద్దులు ఇంకా నోటిఫై కాలేదని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

జలాల పంపిణీకి సంబంధించి సుప్రీంలో ఉన్న కేసును ఉపసంహరించుకునేందుకు కేసీఆర్ అంగీకరించారని షెకావత్ మీడియా ముఖంగా తెలిపారు. నదీ జలాల వాటాలకు సంబంధించిన నిర్ణయం సంబంధిత నదీ బోర్డులే తీసుకుంటాయని, విభజన చట్టం ప్రకారంగానే రెండు రాష్ట్రాలకు నీటి వాటాలను పంచుతామని ఆయన తెలిపారు. వివాదాల పరిష్కారం కోసం సహకరించిన ఇద్దరు సీఎంలకు కేంద్ర మంత్రి ధన్యవాదాలు తెలిపారు. చాలా అంశాలపై ఏకాభిప్రాయంతో పరిష్కారానికి వచ్చామన్నారు. ట్రిబ్యునల్ తీర్పు ప్రకారంగానే నీటి కేటాయింపులు చేయాలని తెలంగాణ సీఎం కోరినట్టుగా ఆయన వివరించారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని త్వరలో కేంద్రం నిర్ణయిస్తోందని ఆయన చెప్పారు.

Latest Updates