ఇండ్లు కొన్న 30 వేల మందికి ఊరట…

యూనిటెక్‌‌.. రియల్టీ కంపెనీ కేంద్రం చేతికి

సుప్రీం కోర్టు ఆర్డర్​తో టేకోవర్‌‌ చేస్తున్నట్టు ప్రకటన  

ఇన్వెస్టర్లకు కూడా మేలు

న్యూఢిల్లీమోసాల వల్ల దివాలా తీసిన రియల్టీ కంపెనీ యూనిటెక్‌‌లో ఇన్వెస్ట్‌‌ చేసిన వారిని ఆదుకోవడానికి ఈ కంపెనీని టేకోవర్‌‌ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా 30 వేల మంది ఇన్వెస్టర్లకు మేలు కలుగుతుంది. ప్రభుత్వం టేకోవర్‌‌ చేయడం వల్ల మేనేజ్‌‌మెంట్‌‌ మార్పులు చేయడంతోపాటు కంపెనీ ప్రాజెక్టులను తిరిగి చేపట్టే అవకాశాలు ఉంటాయి. యూనిటెక్‌‌లో వ్యక్తిగత ఇన్వెస్టర్లు, ఆర్థిక సంస్థలు ఇన్వెస్ట్ చేసిన డబ్బులో సగాన్ని మేనేజ్‌‌మెంట్‌‌ సభ్యులు సొంతానికి వాడుకున్నట్టు ఫోరెన్సిక్‌‌ స్టడీలో తేలింది. యూనిటెక్‌‌ గ్రూపుతోపాటు డైరెక్టర్లు డబ్బును దుర్వినియోగం చేశారని స్పష్టం చేసింది. ఐటీ కంపెనీ సత్యమ్ కంప్యూటర్స్‌‌ను 2009లో స్వాధీనం చేసుకున్న తరువాత మరో భారీ సంస్థను ప్రభుత్వం టేకోవర్‌‌ చేయడం ఇది రెండోసారి. కంపెనీలో రూ.ఏడు వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని, ఇందుకోసం ఖాతాపుస్తకాలను తారుమారు చేశామని సత్యమ్‌‌ చైర్మన్‌‌ రామలింగరాజు ఒప్పుకున్నారు. దీంతో కోర్టు ఆయనకు జైలుశిక్ష విధించగా, ఈ కంపెనీ తదనంతరం మహీంద్రా గ్రూపు చేతికి వెళ్లింది.

సీఎండీగా యుధ్‌‌వీర్‌‌ సింగ్‌‌..

యూనిటెక్‌‌ నుంచి ఇళ్లను బుక్‌‌ చేసుకున్న వారి, అందులోని ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడటానికి తగిన చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై మోడీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కంపెనీ సీఎండీగా రిటైర్డ్‌‌ ఐఏఎస్‌‌ యధ్‌‌వీర్‌‌ సింగ్‌‌ మాలిక్‌‌ను నియమించాలని ప్రతిపాదించింది. ఎబీసీసీ సీఎండీ వంటి మరో ఆరుగురు ఆఫీసర్ల పేర్లను డైరెక్టర్ల పదవులకు సిఫార్సు చేసింది. దీనివల్ల కంపెనీ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయని, హౌజింగ్‌‌ ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతాయని తెలిపింది. కంపెనీ ప్రమోటర్లు, డైరెక్టర్లు రూ.వేల కోట్లు వెనకేసుకున్నారని, ఇప్పుడున్న హౌజింగ్‌‌ ప్రాజెక్టులను పూర్తి చేయడం సాధ్యం కాదని ఫోరెన్సిక్‌‌ రిపోర్టు స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు యూనిటెక్‌‌ను టేకోవర్‌‌ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే యూనిటెక్‌‌ కోసం తాము నిధులు మాత్రం కేటాయించలేమని స్పష్టం చేసింది. ప్రతిపాదిత బోర్డు ఆఫ్‌‌ డైరెక్టర్లు తయారు చేసిన కొత్త రిజల్యూషన్‌‌ ఫ్రేమ్‌‌వర్క్‌‌ను పర్యవేక్షించడానికి రిటైర్డ్‌‌ సుప్రీంకోర్టు జడ్జిని నియమించాలని కోరింది. ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిధులు సమీకరించే అధికారాన్ని బోర్డుకు ఇవ్వాలని విన్నవించింది. ‘‘నిర్మాణం పూర్తయిన, ఎవరూ తీసుకోని ఇళ్లను అమ్మడం ద్వారా నిధులు సేకరించి మిగిలిన ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. కంపెనీ ఆస్తులను అమ్మడానికి కూడా అనుమతి కావాలి. కంపెనీ, దాని మేనేజ్‌‌మెంట్‌‌కు చెందిన నిధులను కూడా సుప్రీంకోర్టు మాకు బదిలీ చేయాలి’’ అని ప్రభుత్వం అఫిడవిట్‌‌ ద్వారా కోరింది. అయితే కంపెనీని టేకోవర్‌‌ చేయడానికి 11 షరతులు కూడా పెట్టింది. కంపెనీని లిక్విడేషన్‌‌కు, ఐబీసీప్రకారం కోర్టు బయట పరిష్కారానికి ఒప్పుకోవడం వంటివి ఇందులో ఉన్నాయి.  ఇదిలా ఉంటే యూనిటెక్​ హైదరాబాద్​లోనూ రూ.తొమ్మిది వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపడతామని ప్రకటించినా, అవి కార్యరూపం దాల్చలేదని ఇన్వెస్టర్లు తెలిపారు.

ముఖ్యాంశాలు:
కంపెనీలో దాదాపు 30 వేల మంది ఇన్వెస్ట్ చేసి డబ్బులో సగాన్ని ప్రమోటర్లు సొంతానికి వాడుకున్నారని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది.
యూనిటెక్ గ్రూప్ దేశవ్యాప్తంగా 74 హౌజింగ్ ప్రాజెక్టులను చేపట్టగా, వీటిలో 29,800 మంది ఇన్వెస్ట్ చేశారు.
సంస్థలో ఫైనాన్షియల్ క్రైసిస్ రావడంతో ప్రాజెక్టులు మూలనపడ్డాయి. దీంతో పోలీసులు ప్రమోటర్లు అజయ్, సంజయ్ చంద్రలను అరెస్టు చేశారు. బెయిల్ ఇవ్వడానికి కోర్టు రిజిస్ట్రీలో రూ.750 కోట్లు డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు 2017లో షరతు విధించింది.
అయితే వాళ్లు ఇంత మొత్తం చెల్లించలేక జైళ్లలోనే మగ్గుతున్నారు. యూనిటెక్కు 250 సబ్సిడరీలు, 32 ఫారిన్ సబ్సిడరీలు ఉన్నాయని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
సత్యమ్ కంప్యూటర్స్ తరువాత అంతటి హైప్రొఫైల్ కంపెనీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఇది రెండోసారి.

Latest Updates