27 కోట్ల మంది పేదోళ్లు పైకొచ్చారు!

పేదోళ్లు ఎప్పుడూ పేదోళ్లలాగే ఉంటున్నారు.. వాళ్లు కూడా బాగుపడే రోజు ఎప్పుడొస్తుందో.. దేశంలోని చాలా మందిలో చాలా కాలంగా ఉన్న ఫీలింగ్​ ఇది. కానీ.. ఇండియాలో పదేళ్ల కాలంలో 27 కోట్ల మందికిపైగా బడుగులు దారిద్ర్య రేఖ దాటేసినట్లు ఐక్య రాజ్య సమితి గుర్తించింది. అయితే, వందకుపైగా దేశాల్లో 130 కోట్ల మంది నేటికీ గరీబోళ్లుగానే మిగిలిపోయారని తెలిపింది. పది అంశాల ఆధారంగా మనతోపాటు పది దేశాల్లో పేదలు బాగుపడ్డ తీరుని వివరించింది. 101 దేశాల్లో స్టడీ చేసి రూపొందించిన రిపోర్ట్​ను రీసెంట్​గా రిలీజ్​ చేసింది.

పేదరికం అంటే డబ్బు లేకపోవటమే కాదు. ఆరోగ్యం సరిగా ఉండకపోవటం, చేయటా నికి సరైన పని దొరక్కపోవటం, వయొలెన్స్​ లేకుండా ప్రశాంతంగా బతకగలమనే నమ్మకం లేకపోవటాన్నీ బీదరికంగానే భావించాలి.దీన్నే ‘మల్టీ డైమెన్షనల్లీ పూర్’ అంటారు. కొద్దో గొప్పో ఆస్తులు, కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్టలు, శుభ్రమైన ఇల్లు, దానికి కరెంట్ సదుపాయం​, తాగటానికి పరిశుభ్రమైన నీళ్లు, ఇంట్లో హాయిగా వంట చేసుకొని తినే సౌకర్యం, ఆడవాళ్లకు పండంటి పిల్లలు పుట్టడం, వాళ్లు ఏ రోగాల బారినా పడకుండా ఎదగటం, చదువుకోవటం.. ఈ పదింటిలో ఏ లోటూ లేనివాళ్లనే యూఎన్​ఓ ‘పైకొచ్చినోళ్లు’గా పరిగణనలోకి తీసుకుంది.

అయితే.. ప్రపంచవ్యాప్తంగా 101 దేశాల్లో 130 కోట్ల మందికి ఈ సౌకర్యాలు ఇప్పటికీ అందట్లేదు. ఈ 101లో తక్కువ ఆదాయ దేశాలు 31, మిడిల్​ ఇన్​కం కంట్రీస్​ 68, ఎక్కువ ఆదాయం ఉన్నవి 2 దేశాలు. 2006–16 మధ్య కాలంలో యూఎన్​ఓ ఈ దేశాల్లో స్టడీ చేసింది. ఇందులో పది దేశాలు మాత్రం ఎక్కడా, ఏ దశలోనూ పేదరికం లేని విధంగా ‘సస్టెయినబుల్​ డెవలప్​మెంట్​ గోల్​–1’ని చేరే దిశలో ఉన్నట్లు చెప్పింది. ఆ దేశాలు.. ఇండియా, బంగ్లాదేశ్​, కాంబోడియా, కాంగో, ఇథియోపియా, హైతి, నైజీరియా, పాకిస్థాన్​, పెరు, వియత్నాం.

పట్టణాల కన్నా పల్లెలే పూర్

ఈ పది దేశాల్లో అర్బన్​ ఏరియాల కన్నా రూరల్​ ప్రాంతాల్లోనే పేదరికం ఉన్నట్లు యూఎన్​ఓ తేల్చింది. ఇండియా, కాంబోడియా, హైతి, పెరు దేశాల్లో పట్టణాల కన్నా గ్రామీణ ప్రాంతాలే వేగంగా డెవలప్​ అయ్యాయి. బంగ్లాదేశ్​, కాంగోల్లో మాత్రం రూరల్, అర్బన్​ ఏరియాల్లో పేదరికం ఒకే రీతిలో తగ్గాయి. జార్ఖండ్​లో మల్టీ డైమెన్షనల్​ పావర్టీ ఈ పది సంవత్సరాల్లో 74.9 శాతం నుంచి 46.5 శాతానికి తగ్గటం విశేషం.

యువతీయువకులు, పిల్లలే ఎక్కువ..

వివిధ దేశాల్లో యువత కన్నా పిల్లలే ఎక్కువగా పేదరికంలో మగ్గుతున్నారు. ఈ పది ఇండికేటర్లలో బాలలే బాగా వెనకబడ్డారు. చిన్నారులకు క్లీన్​ వాటర్, శానిటేషన్​, న్యూట్రిషన్​, ప్రైమరీ ఎడ్యుకేషన్​ ఫెసిలిటీస్​ అందుబాటులో లేవు. ఇండియా, బంగ్లాదేశ్​, కాంబోడియా, హైతి, పెరూల్లో పిల్లల పేదరికం వేగంగా తగ్గింది. ఇథియోపియాలో బాలలు అభివృద్ధికి ఇంకా కాస్త దూరంలోనే ఉన్నారు. కాంగో, పాకిస్థాన్​లలో యూత్​ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది.

పాపం పసివాళ్లు

మొత్తం 130 కోట్ల మంది పేదల్లో రెండొంతుల (88.6 కోట్ల) మందికిపైగా మిడిల్​ ఇన్​కం దేశా ల్లోనే నివసిస్తున్నారు. మరో 44 కోట్ల మంది తక్కువ ఆదాయ దేశాలవారు. ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు, ప్రతి ఆరుగురు యువతీ యువకుల్లో ఒకరు కడు బీదరకంలో కాలం వెళ్లదీస్తున్నారు. అంటే మొత్తం పేదల్లో సగం (66.3 కోట్ల) మంది చైల్డ్​, యూత్​ దారిద్య్ర రేఖకు దిగువన మగ్గిపోతున్నారు. వీరిలో 85 శాతం మంది సౌతేసియా, సబ్​–సహారన్​ ఆఫ్రికాకు చెందినవారే.

నిజమైన పేదలను గుర్తించాలి

ప్రస్తుతం ఫాలో అవుతున్న పేదరికం కాన్సెప్ట్​కి కాలం చెల్లిందని యూఎన్​ఓ అభిప్రాయపడింది. అసలు పేదలను గుర్తించటానికి సరైన ఇండికేటర్లను రూపొందించాలని సూచించింది. పేదరికంపై పోరాటంలో గెలవాలంటే నిజమైన గరీబోళ్లు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడికే వెళ్లి వాళ్లకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించాలని చెప్పింది. యూఎన్​ డెవలప్​మెంట్​ ప్రోగ్రాం, ఆక్స్​ఫర్డ్​ పావర్టీ అండ్​ హ్యూమన్​ డెవలప్​మెంట్​ ఇనీషియేటివ్​ సంయుక్తంగా ‘ది 2019 గ్లోబల్ మల్టీ డైమెన్షనల్​ పావర్టీ ఇండెక్స్​’ పేరిట రిపోర్ట్​ విడుదల చేశాయి.

 

Latest Updates