తప్పు చేసుంటే నా కళ్లలో యాసిడ్‌ పోయండి: రేప్ కేసులో తానే వాదించుకున్న దోషి

‘నేను తప్పు చేసుంటే ఉరి తీయండి. కావాలంటే నా కళ్లలో యాసిడ్ పోసేయండి’ అంటూ వింత వాదనకు తెరలేపాడు బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే, ఉన్నావ్ రేప్ కేసు దోషి కులదీప్ సెంగార్. 2017లో ఉన్నావ్‌కు చెందిన ఓ బాలికపై అత్యాచారం చేసిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న అతడిని.. బాధితురాలి తండ్రి హత్య కేసులోనూ దోషిగా తేల్చింది ఢిల్లీ కోర్టు. మార్చి 4న ఈ కేసులో తీర్పు చెప్పిన న్యాయస్థానం శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. దీనిపై గురువారం వాదనలు జరిగాయి. దోషిగా తేలిన లాయర్ వద్దని చెప్పి.. కులదీప్ సెంగార్ తానే కోర్టు ముందు వాదనలు వినిపించాడు. రేప్ బాధితురాలి తండ్రి హత్య కేసులో తనకు సంబంధం లేదని, తాను ఏ తప్పు చేయలేదని, తను న్యాయం చేయాలని కోరాడు. తాను తప్పు చేసుంటే తనను వెంటనే ఉరి తీయొచ్చని, లేదా తన కళ్లలో యాసిడ్ పోయొచ్చని చెప్పాడు. అయితే న్యాయమూర్తి అతడి వాదనలను తోసిపుచ్చాడు. ఈ హత్య కేసులో అతడి ఇన్‌వాల్వ్‌మెంట్‌పై సీబీఐ స్పష్టమైన ఆధారాలను సేకరించిందన్నారు. కుట్ర చేసి పోలీసు కస్టడీలోనే బాధితురాలి తండ్రిని హత్య చేయించినట్లు కాల్ రికార్డుల ద్వారా పక్కాగా తేలిందని చెప్పారు. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన సీబీఐ లాయర్ ఈ కేసులో హత్య కుట్రదారుడు సెంగార్ అయితే దాన్ని అమలుపరడంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు పోలీసులను కూడా కఠినంగా శిక్షించాలని కోరారు. భాదితులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే దారుణంగా హత్య చేయడం ఘారమన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. రేపు శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది.

బాలికపై అత్యాచారం.. ఆమె తండ్రిని మర్డర్

యూపీలోని ఉన్నావ్ జిల్లా మఖీ గ్రామానికి చెందిన బాలికపై 2017లో అత్యాచారానికి పాల్పడ్డాడు కులదీప్ సెంగార్. అతడు నాడు బీజేపీ ఎమ్మెల్యే కావడంతో దీనిపై స్థానిక పోలీసులు తొలుత కంప్లైంట్ కూడా తీసుకోలేదు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కలగజేసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు దర్నాకు దిగింది. దీంతో కేసులో కదలిక వచ్చింది. అయితే తనపై కేసు పెట్టినందుకు కక్ష గట్టిన సెంగార్ బాధితురాలి తండ్రిని హత్య చేయించాడు.

రేప్ బాధితురాలి తండ్రి, అతడి తోటి ఉద్యోగులు 2018 ఏప్రిల్ 3న పని ముంగించుకుని ఇంటికి వెళ్తుండగా శశి ప్రతాప్ సింగ్ అనే అతడిని లిఫ్ట్ అడిగారు. అయితే కావాలని ప్లాన్ ప్రకారమే అక్కడికి వచ్చిన అతడు వారికి లిఫ్ట్ ఇవ్వడానికి నిరాకరించి.. ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగాడు. కులదీప్ సెంగార్ తమ్ముడు అతుల్ సెంగార్ సహా మరికొందరు అక్కడికి చేరుకుని శశి ప్రతాప్‌తో కలిసి వారిని దారుణంగా కొట్టారు. ఆ తర్వాత వారిపైనే కేసు పెట్టి అరెస్టు చేయించారు. పోలీసు కస్టడీలోనే ఏప్రిల్ 9న రేప్ బాధితురాలి తండ్రి మరణించాడు. పోలీసులతో మాట్లాడి కులదీప్ సెంగారే ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరోపించారు బాధితురాలి కుటుంబసభ్యులు. రేప్, మర్డర్ కేసులు రెండూ సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. కొన్నాళ్ల తర్వాత కేసు సీబీఐకి వెళ్లడంతో రేప్ కేసులో 2019 డిసెంబరు 20న సెంగార్‌ను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న అతడిని ఈ నెల 4న హత్య కేసులోనూ దోషిగా తేల్చింది. ఇద్దరు పోలీసులు, సెంగార్ తమ్ముడు, శిశి ప్రతాప్ సహా మొత్తం ఏడుగురిని దోషులుగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. అయితే శిక్ష ఖరారుపై గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సెంగార్ వింత వాదనలు చేయడంతో కోర్టు అతడిని తప్పుబట్టింది.

Latest Updates