ఉన్నావ్ రేప్ బాధితురాలు మంటల్లో కాలుతూనే.. కిలోమీటరు పరుగు

ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు అదుపు లేకుండా పోతోంది. ఓ 20 ఏళ్ల యువతి తనపై రేప్ జరిగిందని కేసు పెట్టినందుకు.. కిరాతకంగా ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టారు ఐదుగురు రాక్షసులు. యూపీలోని ఉన్నావ్‌లో ఈ దారుణం జరిగింది. 90 శాతం కాలిన గాయాలతో లక్నోలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ‘హెలికాప్టర్‌ (ఎయిర్ అంబులెన్స్‌)’లో ఢిల్లీకి తరలించారు. ఓ వైపు హైదరాబాద్‌లో దిశ ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలని దేశమంతా ఆందోళనలు జరుగుతున్న సమయంలోనే ఈ దారుణం జరిగింది.

బెయిల్‌పై వచ్చి దారుణం

2018 డిసెంబరులో యూపీలోని ఉన్నావ్ జిల్లా సిందుపూర్ గ్రామానికి చెందిన ఓ యువతిని ఇద్దరు దుర్మార్గులు రేప్ చేశారు. తనను శివం, శుభం త్రివేది అనే ఇద్దరు కిరాతకులు కిడ్నాప్ చేసి రేప్ చేసినట్లు బీహార్ ఏరియా పోలీస్ స్టేషన్‌లో ఆమె కేసు పెట్టింది. దీనిపై ఈ ఏడాది మార్చిలో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ ఇద్దరిని అరెస్టు చేసి.. జైలుకి పంపారు. ఇటీవల బెయిల్‌పై విడుదలైన వీళ్లు ఆ యువతిపై పగ పెంచుకున్నారు. తమను జైలుకు పంపిన ఆమెపై కక్ష తీర్చుకోవాలని మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ప్లాన్ వేశారు.

మంటల్లో అల్లాడుతూనే సాయం కోసం పరుగు

గురువారం ఉదయం ఆ యువతి రాయబరేలిలో కోర్టుకు హాజరయ్యేందుకు తన గ్రామం నుంచి వెళ్తుండగా ఈ దుర్మార్గులు అడ్డగించారు. ఆమెను తీవ్రంగా కొట్టి.. కత్తితో పొడిచారు. ప్రాణాలతో ఉండగానే పెట్రోల్ పోసి నిప్పు పెట్టి.. పారిపోయారు. ఆ మంటల్లో కాలుతూ ప్రాణం పోతున్నంత బాధలో సాయం కోసం కేకలు వేసిందా యువతి. దగ్గరలో ఎవరూ లేకపోవడంతో ఊరివైపు పరుగు తీసింది. ఆ మంటల్లో కాలుతూనే దాదాపు కిలోమీటరు దూరం వెళ్లి ఓ ఇంటి బయట పనిచేసుకుంటున్న వ్యక్తిని సాయం చేయాలని కోరింది. ఊరిలోకి వచ్చేటప్పటికి కూడా ఆమె శరీరంపై మంటలు ఆరలేదు. అక్కడి వాళ్లు నీళ్లు పోసి మంటలు ఆర్పారు. ఆ తర్వాత వాళ్లు ఫోన్ ఇస్తే ఆమే 112కు ఫోన్ చేయాల్సి వచ్చింది. కొంత సమయానికి పోలీసులు అంబులెన్స్‌తో అక్కడికి చేరుకున్నారు.

పరిస్థితి విషమం.. ఢిల్లీకి తరలింపు

ఆమెను లక్నోలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆ యువతికి వైద్యం అందించారు. అయితే ఆమె శరీరం 90 శాతం కాలిపోయిందని, బాధితురాలి పరిస్థితి చాలా విషమంగా ఉందని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశుతోష్ దుబే తెలిపారు. ఆమెకు మరింత మెరుగైన చికిత్స అందించడం కోసం హెలికాప్టర్ అంబులెన్స్‌లో ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్ ఆస్పత్రికి తరలించారు అధికారులు.

MORE NEWS:

స్త్రీని భోగవస్తువుగా చూడొద్దు.. మగవాడు కట్టుబాట్లు పాటించాలి

ఆ నలుగురే కాదు: వీళ్లు ముసుగేసుకున్న మృగాలు

ఒకే రోజు 6 రేప్ ఘటనలా? పోలీసులు ఏం చేస్తున్నారు?

సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్

ఈ ఘటనపై విచారణకు యూపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. అయితే యువతిపై జరిగిన ఈ దారుణాన్ని సుమోటో కేసుగా స్వీకరించింది జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ). కోర్టుకు వెళ్తున్న యువతిపై ఇంతటి దారుణం జరగడం ఘోరమని అన్నారు ఎన్సీడబ్ల్యూ చైర్‌పర్సన్ రేఖా శర్మ. రేప్ చేసిన దుర్మార్గులు బెయిల్‌పై విడుదలైనా ఆమెకు కనీసం పోలీసులు భద్రత కల్పించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై యూపీ డీజీపీకి తాను లేఖ రాసినట్లు చెప్పారామె.

Latest Updates