రేప్ బాధితురాలి తండ్రి హత్య కేసు: కులదీప్ సెంగార్‌కు పదేళ్ల జైలు

ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలి తండ్రి హత్య కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కులదీప్ సెంగార్‌కు ఢిల్లీ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే రూ.10 లక్షల జరిమానా కూడా కట్టాలని ఆదేశించింది. అతడితో పాటు ఈ కేసులో దోషులుగా తేలిన ఇద్దరు పోలీసులు సహా మొత్తం ఏడుగురికి పదేళ్ల పాటు జైలు శిక్ష విధించింది కోర్టు. 2017లో యూపీలోని ఉన్నావ్ జిల్లా మఖీ గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు కులదీప్ సెంగార్. ఈ కేసులో ఇప్పటికే యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు.

ఉన్నావ్ బాలిక రేప్‌ కేసులో మొదట పోలీసులు అలసత్వం వహించడంతో బాధితురాలు దర్నా చేసి.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దృష్టికి తీసుకెళ్లింది. ఆయన ఆదేశాలతో కేసులో కదలిక వచ్చింది. దర్యాప్తు వేగవంతం కావడంతో సాక్ష్యాధారాలు లేకుండా చేయాలని కులదీప్ సెంగార్ ఆ కుటుంబాన్ని హత్య చేయాలని కుట్ర చేశాడు. లాయర్‌తో కలిసి కారులో వెళ్తుండగా లారీతో యాక్సిడెంట్ చేయించాడు. ఆ సమయంలో బాధితురాలు గాయాలతో బయటపడగా.. ఇద్దరు బంధువులు మరణించారు. ఆ తర్వాత ఆమె తండ్రిని ఓ అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేయించాడు. స్టేషన్‌లోనే పోలీసుల చేత దారుణంగా కొట్టించి హత్యకు పాల్పడ్డాడు. 2018 ఏప్రిల్‌లో బాధితురాలి తండ్రి మరణించాడు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ హత్యకు సెంగార్ కుట్ర చేసి, ఎప్పటికప్పుడు పోలీసులతో మాట్లాడుతూ కథ నడిపించాడని పక్కా సాక్షాలను కోర్టు ముందుంచారు సీబీఐ అధికారులు. దీంతో అతడితో పాటు ఇద్దరు పోలీసులు, సెంగార్ తమ్ముడు సహా మొత్తం ఏడుగురిని దోషులుగా తేలుస్తూ గత వారంలో కోర్టు తీర్పు చెప్పింది. వాళ్లకు శిక్ష ఖరారు చేయడంపై నిన్న వాదనలు విన్న కోర్టు తీర్పు శుక్రవారానికి వాయిదా వేసింది. దోషులందరికీ పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఇవాళ తీర్పు ఇచ్చింది.

More News:

బెంగళూరులో గూగుల్ ఉద్యోగికి కరోనా..

తప్పు చేసుంటే నా కళ్లలో యాసిడ్‌ పోయండి: రేప్ కేసులో తానే వాదించుకున్న దోషి

రిషికేష్ యోగా సెంటర్‌లో మద్యం తాగించి.. అమెరికా యువతిపై రేప్

Latest Updates