వాళ్లను ఉరి తీయడం చూడాలి.. ఉన్నావ్​ రేప్ బాధితురాలి చివరి మాటలు

అన్నా నన్ను బతికించు.. నాకు చావాలని లేదు..

ఉన్నావ్​ బాధితురాలి చివరి మాటలు

కాలిన గాయాలతో హాస్పిటల్లో కన్నుమూత

నిందితులను హైదరాబాద్​లో లాగానే కాల్చి చంపాలి : బాధితురాలి తండ్రి డిమాండ్​

బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్​గ్రేషియా

ఫాస్ట్​ట్రాక్​ కోర్టు ఏర్పాటు చేస్తాం: యూపీ సీఎం యోగి

దేశవ్యాప్తంగా నిరసనలు

‘అన్నా.. నన్ను బతికించు. నాకు చావాలని లేదు. నన్నిలా చేసిన వారిని ఉరితీయడం నేను చూడాలి’.. ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి నోటి వెంట వెలువడిన చివరిమాటలివి. ఢిల్లీలోని సఫ్దర్​జంగ్​ ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​ తీసుకుంటూ శుక్రవారం అర్ధరాత్రి ఆమె కన్నుమూసింది. చివరిసారిగా తన సోదరుడితో మాట్లాడిన ఆమె నిందితులను ఉరితీయాలని కోరింది. 90 శాతం కాలిపోవడంతో బాధితురాలి ఆరోగ్య పరిస్థితి సీరియస్​గా మారిందని, గాయాలకు ట్రీట్​మెంట్​ చేస్తుండగా కార్డియాక్​ అరెస్ట్​తో ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. పోస్టుమార్టం తర్వాత డెడ్​బాడీని అంబులెన్స్​లో సొంత గ్రామానికి తరలించారు.

హైదరాబాద్​లో అత్యాచార నిందితులను ఎన్​కౌంటర్​ చేసిన రోజే ఉన్నావ్​ బాధితురాలు చనిపోవడంతో.. ఆమెపై దారుణానికి తెగబడ్డ వారిని కూడా చంపేయాలని బాధితురాలి కుటుంబంతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, అత్యాచార బాధితురాలికి తగిన సెక్యూరిటీ కల్పించడంలో యోగి సర్కారు విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించాయి. ప్రతిపక్షాలతో పాటు అంతటా ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తంకావడంతో.. సీఎం యోగి ఆదిత్యనాథ్​ స్పందించారు. ఉన్నావ్​ బాధితురాలి మరణం విచారకరమని అన్నారు. ఈ కేసులో నిందితులందరినీ అరెస్ట్​ చేశామని చెప్పారు. ఫాస్ట్​ట్రాక్​ కోర్టులో విచారణ జరిపి, వీలైనంత తొందరగా బాధితురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని సీఎం చెప్పారు. అంతకుముందు, నిలువెల్లా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన ఉన్నావ్​ అత్యాచార బాధితురాలు శుక్రవారం అర్ధరాత్రి ప్రాంతంలో కన్నుమూసింది. దాదాపు 40 గంటలపాటు మృత్యువుతో పోరాడి, చివరకు అలిసి పోయింది. 90 శాతం కాలిపోవడంతో బాధితురాలి ఆరోగ్య పరిస్థితి సీరియస్​గా మారిందని, గాయాలకు చికిత్స చేస్తుండగా కార్డియాక్​ అరెస్ట్​తో ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. పోస్టుమార్టం తర్వాత డెడ్​బాడీని అంబులెన్స్​లో బాధితురాలి సొంత గ్రామానికి తరలించారు.

పోస్ట్​మార్టం రిపోర్ట్

తీవ్ర గాయాల వల్లే ఉన్నావ్​ అత్యాచార బాధితురాలు చనిపోయిందని  పోస్ట్​మార్టమ్​ రిపోర్ట్​లో వెల్లడైంది. సఫ్దర్​జంగ్​ హాస్పిటల్  సీనియర్​ డాక్టర్​ శనివారం  ఈవిషయం చెప్పారు. “బాధితురాలికి  ఊపిరాడకపోవడం లాంటివి జరగలేదు. ఆమెపై విషప్రయోగం కూడా జరగలేదని ఈ రోజు ఉదయం జరిపిన పోస్ట్​మార్టమ్​ రిపోర్ట్​లో తేలింది”అని డాక్టర్​ వివరించారు.

మంత్రులకు నిరసన సెగలు

ఉన్నావ్​ బాధిత కుటుంబాన్ని పరామర్శకు వెళ్లిన యూపీ మంత్రులకు నిరసన సెగలు ఎదురయ్యారు.  మంత్రులు స్వామి ప్రసాద్​ మౌర్య, కమల్​రాణి వరుణ్​తోపాటు  బీజేపీ లోకల్​ ఎంపీ సాక్షి మహారాజ్​లను ఆందోళనకారులు శనివారం అడ్డుకున్నారు. దీంతో పోలీసులు లాఠీ చార్జీ చేయడంతో కాంగ్రెస్​ నాయకులతో పాటు పలువురికి దెబ్బలు తగిలాయి. బాధితురాలి ఇంటి దగ్గర గుమిగూడిన జనం ‘గో బ్యాక్​’ అంటూ నినాదాలు చేశారు.  ప్రభుత్వానికి, సాక్షి మహరాజ్​కు వ్యతిరేకంగా స్లోగన్స్​ ఇచ్చారు. 15 నిముషాల సేపు అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు బందోబస్తు మధ్య మంత్రులు, ఎంపీ బాధితురాలి  ఇంటికి చేరుకోగలిగారు.

అసలేం జరిగింది..

కిందటి ఏడాది జనవరి 19న బాధితురాలు(23)ను శివం, శుభం త్రివేది కిడ్నాప్​ చేసి అత్యాచారం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉంటే పెళ్లి చేసుకుంటానని శుభం బాధితురాలిని నమ్మించాడు. తర్వాత కూడా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. గతేడాది డిసెంబర్​12 వరకూ ఈ దారుణం కొనసాగించారు. పెళ్లి చేసుకోవడానికి శుభం త్రివేది నిరాకరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఏడాది మార్చిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. పది రోజుల క్రితమే శుభం బెయిల్​పై బయటికి వచ్చాడు. అప్పటి నుంచి బాధితురాలిని వెంబడిస్తూ బెదిరింపులకు గురిచేశాడు. కేసు వాపస్​ తీసుకోకుంటే బాధితురాలి కుటుంబ సభ్యులను, బంధువులను కూడా చంపుతామని బెదిరించారు. దీనిపై బీహార్​స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కేసు విషయమై గురువారం లాయర్​ను కలిసి వచ్చేందుకు బయలుదేరిన బాధితురాలిని, మరో ముగ్గురి(హరిశంకర్ త్రివేది, రామ్​కిశోర్​ త్రివేది, ఉమేశ్​ బాజ్​పాయి)తో కలిసి శివం, శుభం కిడ్నాప్​ చేశారు. సింధూపూర్​ గ్రామ శివార్లలోని పంటపొలాల్లోకి తీసుకెళ్లి, కిరోసిన్​పోసి నిప్పంటించి పారిపోయారు. కాలిన గాయాలతో దాదాపు కిలోమీటరు దూరం పరిగెత్తి బాధితురాలు పోలీసులకు ఫోన్​ చేసింది. పోలీసులు అక్కడికి చేరుకుని తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని లక్నో ఆస్పత్రికి తరలించారు. శరీరం 90 శాతం కాలిపోవడంతో అక్కడి నుంచి సఫ్దర్​జంగ్​ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాధితురాలు శుక్రవారం చనిపోయింది.

Latest Updates