రేపటి ఆఫీసర్లు మీరే.. కశ్మీర్ విద్యార్థులతో సీఎం యోగీ

ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులతో తన ఆఫీస్ లో భేటీ అయ్యారు సీఎం యోగీ ఆదిత్యనాథ్. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ సహా.. పలు విశ్వవిద్యాలయాల నుంచి వంద మంది వరకు విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కశ్మీర్ లో ఆర్టికల్ 370  రద్దు తర్వాత ఆ రాష్ట్రంలోని యువతీయువకులకు దేశమంతటా ఉద్యోగాలు, ఇతర రంగాల్లో అవకాశాలు మెరుగయ్యాయని యూపీ సీఎం యోగీ వివరించారు. కొద్దిరోజులుగా వారిలో ఉన్న అభద్రతను తొలగించేందుకే.. సీఎం ఈ సమావేశం నిర్వహించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో తాజా పరిస్థితులు, భవిష్యత్తు అవకాశాలపై విద్యార్థులతో చర్చించారు యోగీ. “ఈరోజు మీరు ఇక్కడ విద్యార్థులుగా ఉన్నారు. రేపు ఉత్తర్ ప్రదేశ్ పరిపాలనలో భాగమయ్యే అధికారులు మీరే కావచ్చు. ప్రజాస్వామ్యంలో భిన్న వర్గాలు ఒకరినొకరు సంప్రదించుకోవడం, ప్రేమ, ఆప్యాయత పంచుకోవడం చాలా అవసరం” అని వారితో యోగీ చెప్పారు.

“నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, అలీగఢ్ ఏరియాల్లో ఉంటున్న జమ్ముకశ్మీర్ యువతతో నేను మాట్లాడాను. వారిలో భవిష్యత్తుపై నమ్మకం పెంచే ప్రయత్నం చేశాను. ఓ సీఎంగా నేనే వారికి ఇక్కడ సంరక్షుడిని. వారి బాధలు, అభిప్రాయాలు తెల్సుకోవడం నా బాధ్యత” అని చెప్పారు యోగీ.

Latest Updates