ఒక గదిలో పిల్లలుండగా.. మరో గదిలో తల్లి దారుణ హత్య

ఒక గదిలో పిల్లలుండగా.. మరో గదిలో ఆ పిల్లల తల్లి దారుణంగా హత్య చేయబడింది. ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో శుక్రవారం ఈ దారుణ ఘటన జరిగింది. స్థానికంగా నివసించే నిషా సింఘాల్ దంత వైద్యురాలు. ఆమె భర్త అజయ్ సింఘాల్ జనరల్ సర్జన్. వీరికి ఎనిమిది మరియు నాలుగు సంవత్సరాల వయసు గల ఇద్దరు పిల్లలున్నారు. శుక్రవారం అజయ్ డ్యూటీలో భాగంగా ఆస్పత్రికి వెళ్లాడు. నిషా మాత్రం తన పిల్లలతో ఇంట్లోనే ఉంది. కాగా.. శుక్రవారం మధ్యాహ్నం సెట్ టాప్ బాక్స్ రీఛార్జ్ చేయాలంటూ ఒక వ్యక్తి నిషా ఇంటికి వచ్చాడు. అతడు ఇంట్లోకి వచ్చిన తర్వాత కత్తితో నిషా మీద దాడిచేశాడు. ఆ తర్వాత నిషా గొంతు కోసి చంపాడు. నిషాను చంపిన తర్వాత నిందితుడు గంటకు పైగా ఆ ఇంట్లోనే ఉన్నాడు. ఆ సమయంలో పిల్లలను చూసి వారి మీద కూడా దాడి చేసి.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పిల్లల అరుపులతో చుట్టుపక్కల వాళ్లు ఇంట్లోకి వచ్చి చూడగా.. నిషా రక్తపు మడుగులో పడి ఉంది. పిల్లలకు కూడా గాయాలయ్యాయి. దాంతో వెంటనే నిషా భర్త అజయ్‌కు ఫోన్ చేశారు. హుటాహుటిన ఇంటికి చేరుకున్న అజయ్.. నిషాను, పిల్లలను ఆస్పత్రికి తరలించాడు. కానీ అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో నిషా చనిపోయింది. అజయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా దాడి చేసింది శుభం పాథక్ అని గుర్తించారు. పోలీసులు నిందితుడిని శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. కేబుల్ టీవీ టెక్నీషియన్‌గా సింఘాల్ ఇంట్లోకి వచ్చిన పాథక్.. ఇంటిని దోచుకోవాలని ఈ పని చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ షాకింగ్ సంఘటనపై యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆగ్రాలో బిజీగా ఉండే నివాస ప్రాంతంలో ఒక మహిళను గొంతు కోసి చంపడం దిగ్భ్రాంతికి గురిచేసింది. బీజేపీ ప్రభుత్వం అవినీతి అధికారులను కాపాడటం మరియు ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెట్టడంలో బిజీగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అడ్వర్టైజ్‌మెంట్లపై కాకుండా.. నేరాలను తగ్గించడంపై దృష్టి పెట్టాలి’అని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ ట్వీట్ చేశారు.

For More News..

శశికళకు చుక్కెదురు.. ముందస్తు విడుదల అసాధ్యం!

ప్రముఖ కవి, జర్నలిస్ట్ దేవీప్రియ మృతి

దుబ్బాక పాయే.. జీహెచ్ఎంసీ వచ్చే.. అయినా పీఆర్సీ రాకపాయే

ఫోన్ వాడొద్దన్నందుకు.. ఉరి వేసుకుంది

Latest Updates