సైకాలజీ చదువుతున్న స్టూడెంట్.. సైకోలా మారి..

యూపీ: ఎం.ఏ సైకాలజీ చదువుతున్న ఓ వ్యక్తి సైకో లాగా ప్రవర్తించాడు. తన మీద పుకార్లు పుట్టిస్తున్నారన్న అనుమానంతో తనతోపాటు చదువుతున్న తోటి స్నేహితులపై కాల్పులు జరిపాడు. యూపీలోని ఝాన్సీలో జరిగిందీ దారుణం. వివరాల్లోకి వెళ్లితే.. బుందేల్ ఖండ్ లోని ఓ కాలేజీలో సైకాలజీ చదువుతున్న మంథన్ సింగ్ సెంగెర్(24) అనే విద్యార్థి కాలేజీకి వెళ్లి.. తుపాకీతో తరగతి గదిలోకి ప్రవేశించి అక్కడ తన స్నేహితుడు హుకుమేంద్ర సింగ్ గుర్జార్(22)ను కాల్చాడు. ఆ తర్వాత క్లాస్ రూమ్ లోని బోర్డు మీద ‘మంథన్ ఫినిష్డ్’ అని రాసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత సిప్రీ బజార్ ప్రాంతానికి వెళ్లి స్నేహితురాలు కృతికా త్రివేది(22) పై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో కృతికా త్రివేది అక్కడికక్కడే మరణించింది. కాల్పుల శబ్దం వినిపించగానే కృతికా కుటుంబ సభ్యులు మంథన్ సింగ్‌ను పట్టుకొని విద్యుత్‌ స్తంభానికి కట్టేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మంథన్‌ సింగ్‌ మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని నివారి జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. హుకుమేంద్ర, కృతికా, మంథన్ ముగ్గురూ 2016 నుంచి మంచి స్నేహితులని ఓ పోలీస్ అధికారి తెలిపారు.  కృతికా తో తనకున్న రిలేషన్ షిప్ గురించి హుక్మేంద్ర పుకార్లు వ్యాప్తి చేస్తున్నాడన్న అనుమానంతో మంథన్ వారిద్దర్నీ కాల్చినట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన  హుకుమేంద్ర సింగ్‌ ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో ఢిల్లీలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ కు తరలించారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

Latest Updates