లాడెన్ సన్నాఫ్ మోడీ: యూపీ ఓటర్ లిస్ట్ లో తప్పుల తడక

ఒకే పేరు వేర్వేరు వ్యక్తులకు ఉండడం కామన్. ఇంత పెద్ద ప్రపంచంలో ఒబామా, లాడెన్, నరేంద్ర మోడీ, సోనమ్ కపూర్ లాంటి పేరు పాపులర్ అయిన ఆ వ్యక్తులకే ఉండాలనేం లేదు. అవే పేర్లు వేర్వేరు వ్యక్తులు పెట్టుకుని కూడా ఉండొచ్చు. కానీ ఈ పేర్లన్నీ ఉత్తర ప్రదేశ్ లోని ఒకే గ్రామానికి చెందిన ఓటర్ లిస్టులో ఉన్నాయి. ఆ పేర్లు మొత్తం ఒకే ఊరిలో ఉండడమే ఒక వింత అయితే లాడెన్ సన్నాఫ్ నరేంద్ర మోడీ అని ఉండడం చూసి లోకల్ అధికారి షాక్ అయ్యారు.

ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది మొదట్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన పనులు చూస్తున్న అధికారులు ఓటర్ లిస్టులపై రివ్యూ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా భైసహియా అనే గ్రామ ఓటర్ల జాబితాను పరిశీలిస్తున్న బూత్ లెవల్ ఆఫీసర్ ప్రమీలా దేవి షాక్ తగిలినంత పనైంది. లాడెన్ తండ్రి నరేంద్ర మోడీ అంటూ లిస్టులో ఉన్న పేరు ఓటర్ లిస్టులో చూసిన ఆమె అలాంటి వాళ్లు నిజంగానే ఉన్నారేమో అని ఊరిలో ఎంక్వైరీ చేశారు. అయితే ఆ పేరుతో ఎవరూ లేరని తేలడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. భైసహియా గ్రామ ఓటర్ లిస్టులో లాడెన్, బారక్ ఒబామా, నరేంద్ర మోడీ, సోనమ్ కపూర్, హేమా మాలిని, అమితాబ్, కత్రినా కపూర్ వంటి పేర్లు ఉన్నాయని తెలిపారు. వీటిని సరిదిద్దాలని కోరారు. అలాగే ఇలాంటి తప్పుడు పేర్లను ఓటర్ లిస్టులోకి ఎవరు ఎక్కించారన్న దానిపై విచారణ చేయించి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.  గతంలో 2015 పంచాయతీ ఎన్నికలకు ముందు ఓటర్ లిస్టు రివైజ్ చేశామని, మళ్లీ ఇప్పుడు దాని  పరిశీలిస్తుండగా ఈ తప్పులు బయటపడ్డాయని చెప్పారు ప్రమీలా దేవి. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి తప్పుడు పేర్లను ఓటర్ లిస్టులోకి ఎక్కించారని అనుమానిస్తున్నట్లు తెలిపారు.

Latest Updates