నీవు అమ్మవేనా.. ఉప్పల్‌‌లో దారుణ ఘటన..తల్లితో సహా ఆరుగురి అరెస్ట్‌‌

నీవు అమ్మవేనా.. ఉప్పల్‌‌లో దారుణ ఘటన..తల్లితో సహా ఆరుగురి అరెస్ట్‌‌
  • మైనర్‌‌‌‌పై అత్యాచారం.. ఆపై అబార్షన్‌‌
  • కూతురిపై లైంగిక దాడికి సహకరించిన తల్లి 
  • కూతురు గదిలోకి పంపి గడియ పెట్టిన వైనం

ఉప్పల్‌‌, వెలుగు: కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ తల్లి ప్రియుడికి అప్పగించి దారుణానికి ఒడిగట్టింది. తనతో సన్నిహితంగా ఉంటున్న వ్యక్తి బిడ్డపైనా కన్నేయగా.. అతనికి బాలిక తల్లి సహకరించింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్​లోని ఉప్పల్‌‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. 

ఉప్పల్ సీఐ రామలింగారెడ్డి, బాధితురాలి వివరాల ప్రకారం.. ఆరేళ్ల కింద ఓ కుటుంబం హైదరాబాద్‌‌కు వలస వచ్చింది. బాధిత బాలికకు ఇద్దరు అక్కలు, ఒక సోదరుడు ఉన్నారు. ఇద్దరు అక్కలకు వివాహాలు కాగా, బాలిక తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఉప్పల్​ప్రశాంత్‌‌నగర్‌‌‌‌లో ఉంటున్నారు. 

బాలిక తల్లి జొన్న రొట్టెలు అమ్మేది. ఆమెకు రెండేళ్లుగా మేడిపల్లికి చెందిన మాలోత్‌‌ రవితో సన్నిహిత సంబంధం ఏర్పడింది. బాలిక తండ్రి, సోదరుడు ఇంట్లో లేని సమయంలో రవి తరచూ ఇంటికి వచ్చేవాడు. సుమారు ఎనిమిది నెలల క్రితం బాలికను రవితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని తల్లి ఒత్తిడి చేసింది. 

ఇంట్లోకి పంపి గడియ పెట్టిన తల్లి

8నెలల కింద ఓ రోజు రవి మందు తాగి బాధితురాలి ఇంటికి వచ్చాడు. బాలికను అతనితో ఇంట్లో ఉంచి, తల్లి బయట నుంచి తలుపు వేసి వెళ్లింది. ఆ సమయంలో రవి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. పలుమార్లు ఇదే విధంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈక్రమంలో ఆమె గర్భం దాల్చింది. దీంతో బాలిక తల్లి, బాబాయ్,​ నిందితుడు రవితో కలిసి ఆమెను మేడిపల్లిలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లి అబార్షన్‌‌ చేయించారు.

అక్కకు చెప్పడంతో వెలుగులోకి..

అబార్షన్‌‌ చేయించిన అనంతరం బాలికను ప్రశాంత్‌‌నగర్‌‌లోని ఇంటి నుంచి మరో ప్రాంతానికి తరలించారు. వారం కింద బాలిక ఉప్పల్‌‌ శ్రీనగర్‌‌ కాలనీలో నివసించే తన అక్క ఇంటికి వెళ్లింది. తనపై జరిగిన లైంగిక దాడి, అబార్షన్‌‌ విషయాలను ఆమె తన అక్కకు చెప్పడంతో ఆమె తండ్రికి సమాచారం ఇచ్చింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బాలిక ఫిర్యాదు మేరకు ఉప్పల్‌‌ పోలీసులు మాలోత్‌‌ రవి, బాలిక తల్లి, బాబాయ్, హాస్పిటల్ నిర్వాహకులు ముగ్గురిపై కేసు నమోదు చేసి గురువారం అరెస్ట్​ చేసినట్లు సీఐ తెలిపారు.