డిగ్రీతో డిఫెన్స్​ సర్వీస్​కు

కేంద్ర సర్వీసుల్లో లెఫ్టి​నెంట్, సబ్​ లెఫ్టి​నెంట్​, ఫ్లైయింగ్​ ఆఫీసర్​ పోస్టులకు నిర్వహించే కంబైన్డ్​ డిఫెన్స్​ సర్వీస్​ ఎగ్జామ్​–2021కు యూపీఎస్సీ నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. 345 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో నవంబర్​ 17 లోపు అప్లై చేసుకోవాలి.

అర్హతలు: ఆర్మీకి దరఖాస్తు చేసేవారు కనీసం 157.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. నేవీకి 157, ఎయిర్​ఫోర్స్​కు 162.5, ఆఫీసర్స్​ ఉమెన్​ కు 152 సెం.మీ. ఎత్తు తప్పనిసరి. శ్వాస పీల్చినప్పుడు ఛాతి 5 సెం.మీ విస్తరించాలి. ఎయిర్​ఫోర్స్​, నేవీకి దరఖాస్తు చేసినవారికి పైలట్​ ఆప్టిట్యూడ్​ బ్యాటరీ టెస్ట్​ (పీఏబీటీ) నిర్వహిస్తారు. ఈ టెస్టులో ఫెయిలైనవారు, కళ్లద్దాలు ధరించే అలవాటున్న అభ్యర్థులు ఎయిర్​ఫోర్స్​కు అనర్హులు.

సెలెక్షన్​ ప్రాసెస్​

రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్​ టెస్ట్​ల ఆధారంగా ఎంపిక చేస్తారు. స్టేజ్-1లో మూడు పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్/హిందీ మాధ్యమాల్లో ముద్రిస్తారు. ఇందులో క్వాలిఫై అయిన వారికి స్టేజ్‍-2 లో సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ కండక్ట్‌ చేస్తుంది. నెగెటివ్​ మార్కులున్నాయి. 0.33 శాతం కోత విధిస్తారు. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్​లో పదోతరగతి స్థాయిలో ప్రశ్నలిస్తుండగా మిగిలిన సబ్జెక్టుల్లో డిగ్రీ లెవెల్‌ క్వశ్చన్స్‌ వస్తాయి.

ట్రైనింగ్ ప్రాసెస్

సెలెక్టయిన అభ్యర్థులు దేశ విదేశాల్లో ఎక్కడైనా జాయిన్​ అవ్వాల్సి ఉంటుంది. వారి ప్రాధాన్యతను బట్టి డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ, గోవాలోని నావల్ అకాడమీ, హైదరాబాద్​లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ, చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 18 నెలల పాటు (ఆఫీసర్స్​ ట్రైనింగ్ అకాడమీ వారికి 11 నెలలు) శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో ఫిజికల్​ ఫిట్​నెస్​ కోసం రన్నింగ్​, పుషప్ప్​, సిటప్స్, జంపింగ్, స్కిప్పింగ్, ట్రెక్కింగ్, రోప్​ క్లైంబింగ్​, షూటింగ్​ వంటి అడ్వెంచర్​ ఎక్సర్​సైజ్​లతో పాటు శత్రు దాడిని ఎదుర్కోవడం, వ్యూహ ప్రతివ్యూహాలు రచించడం, నిరంతరం అప్రమత్తంగా ఉండటం వంటివి నేర్పిస్తారు. నిరంతరం అలర్ట్​గా ఉంటూ దేశ సేవకు పాటు పడాల్సిన కెరీర్ కాబట్టి ట్రైనింగ్ కఠినంగా ఉంటుంది. ఇందుకుగాను అభ్యర్థులు శారీరకంగా, మానసికంగా సిద్ధమై ఉండాలి. శిక్షణలోనే నెలకు రూ.56 వేలకు పైగా స్టైపెండ్​ ఉంటుంది.. విజయవంతంగా ట్రైనింగ్​ పూర్తిచేసుకున్నవారికి పర్మనెంట్​ కమీషన్‌ ద్వారా ఉద్యోగం ఇస్తారు. 2, 6, 13 సంవత్సరాల్లో కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్​ కల్నల్​ హోదాల్లో ప్రమోషన్ లభిస్తుంది. ఏడాదికి 60 యాన్యువల్​, 20 క్యాజువల్​ లీవ్స్‌ ఉంటాయి. మహిళలకు మెటర్నిటీ, చైల్డ్‌ కేర్, చైల్డ్‌ అడాప్షన్ లీవ్స్‌ అదనం.

నోటిఫికేషన్

అర్హత‌: ఐఎంఏ కు ఏదైనా బ్యాచిలర్​ డిగ్రీ, నేవల్​ అకాడమీకి ఇంజినీరింగ్/టెక్నాలజీ, ఎయిర్​ఫోర్స్​ అకాడమీకి ఇంటర్​లో మ్యాథ్స్​, ఫిజిక్స్​ సబ్జెక్టులు చదివి ఏదైనా డిగ్రీ లేదా ఇంజినీరింగ్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయసు: మిలిటరీ, నావల్​ అకాడమీకి 1998 జనవరి 2 నుంచి 2003 జనవరి 1 మధ్య జన్మించిన వారు అర్హులు. అంటే 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎయిర్‌‌ఫోర్స్‌ అకాడమీకి 1998 జనవరి 2 నుంచి 2002 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. అంటే 20 నుంచి 24 ఏళ్ల మధ్య  వయస్కులు. డీజీసీఏ అప్రూవ్డ్​ కమర్షియల్​ పైలట్​ లైసెన్స్ కలిగిన వారికి 26 ఏళ్ల వరకు అనుమతిస్తారు. ఆఫీసర్​ ట్రైనింగ్​ అకాడమీకి 1997 జనవరి 2 నుంచి 2003 జనవరి 1 మధ్య జన్మించిన పురుష, మహిళా అభ్యర్థులు అర్హులు.

నిబంధనలు: నిర్దేశిక శారీరక ప్రమాణాలు కలిగిన 25 ఏళ్లలోపున్న అవివాహిత పురుష అభ్యర్థులు అర్హులు. ఎంపికైన వారు ట్రైనింగ్‍లోనూ వివాహం చేసుకోకూడదు. మహిళా అభ్యర్థులు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఫీజు: రూ.200. ఎస్సీ/ఎస్టీ/మహిళలకు ఫీజు లేదు.

పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్​, తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై

దరఖాస్తు విధానం: వెబ్​సైట్‌లో పార్ట్​‌‌–I, పార్ట్​–II అనే రెండు దశల్లో దరఖాస్తు చేసుకోవాలి.

చివ‌రితేది: 17 నవంబర్​ 2020

ప‌రీక్షతేది: 7 ఫిబ్రవరి 2021

వెబ్​సైట్​: www.upsc.gov.in

సబ్జెక్ట్​ స్టడీ టిప్స్​

ఇంగ్లిష్ 

అభ్యర్థి బేసిక్ ఇంగ్లిష్ నాలెడ్జ్​ను పరీక్షిస్తారు. గ్రామర్‍, ఆంటోనిమ్స్, సిననిమ్స్, ఆర్టికల్స్, వాయిస్‍,  ప్రిపొజిషన్స్, టెన్సెస్, కాంప్రహెన్సన్, వంటి వాటి నుంచి డిగ్రీ స్టాండర్డ్​లో ప్రశ్నలిస్తారు. ఇంగ్లిష్ పేపర్ చదవడం, న్యూస్ వినడం వల్ల వొకాబులరీ పెంచుకోవచ్చు. డిక్షనరీ సాయంతో చదివితే త్వరగా నేర్చుకోవచ్చు. రెన్ అండ్ మార్టిన్ ఇంగ్లిష్ గ్రామర్ బుక్​ ఇందుకు బాగా యూజ్​ అవుతుంది.

పర్సనాలిటీ టెస్ట్

ఇందులో రెండు దశల్లో సైకోమెట్రిక్ టెస్టులు నిర్వహిస్తారు. మొదటి దశలో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్​ టెస్ట్స్, పిక్చర్ పర్సెప్షన్ డిస్ర్కిప్షన్ టెస్ట్ ఉంటుంది. వీటిలో క్వాలిఫై అయితే రెండోదశలో ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టింగ్​ ఆఫీసర్‌‌ టాస్క్స్, సైకాలజీ టెస్ట్స్‌ కండక్ట్‌ చేస్తారు. దాదాపు నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ టెస్టుల్లో ఏదైనా సందర్భానికి అభ్యర్థి స్పందన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుంటారు. ఇందుకుగాను భయం, జంకు లేకుండా ఎవరి ముందైనా మాట్లాడేలా సాధన చేయాలి. ఏదైనా టాపిక్​ను ప్రిపేరై సొంతంగా స్పీచ్​ ఇవ్వడం వల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్​ పెంచుకోవాలి. ఇంగ్లిష్​లో మాట్లాడటానికి ప్రయత్నించాలి. న్యూస్​, ఇతర చర్చలు వింటూ ఎప్పుడు, ఎలా మాట్లాడుతున్నారో గమనించాలి. వొకాబులరీ పెంచుకుంటూ సాధన చేస్తే సులువుగా నేర్చుకోవచ్చు. నిరంతరం మాట్లాడుతుండటం వల్ల  గ్రూప్​ డిస్కషన్‌ను​ కూడా ఎదుర్కోవచ్చు.

ఎలిమెంటరీ మ్యాథ్స్

మ్యాథ్స్​లో టెన్త్​ స్టాండర్డ్​ ప్రశ్నలు వస్తాయి. నంబర్‍ సిస్టమ్స్, ఇంటిజర్స్​, వోల్‍ నంబర్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, సంఖ్యల మధ్య సంబంధం, బేసిక్‍ ఆరిథ్‍మెటిక్‍ ఆపరేషన్స్, శాతాలు, నిష్పత్తులు, సరాసరి, వడ్డీ, లాభనష్టాలు, డిస్కౌంట్లు, టేబుల్స్, గ్రాఫ్‍లు, మెన్సురేషన్, కాలం- దూరం, నిష్పత్తి-కాలం, కాలం-–పని టాపిక్స్​ బాగా చూసుకోవాలి. ఆర్‍ఎస్‍ అగర్వాల్‍ క్వాంటిటేటివ్​ యాప్టిట్యూడ్​, ఆబ్జెక్టివ్ అర్థిమెటిక్, ఎన్​సీఈఆర్​టీ పుస్తకాల్లో ఉన్న మోడల్స్​ ప్రాక్టీస్​ చేయాలి. ప్రీవియస్‍ పేపర్లు సాధన చేయడం వల్ల క్వశ్చన్‍ ప్యాటర్న్ తెలిసి ప్రిపరేషన్​ సులువవుతుంది. ఎగ్జామ్​కు ముందు కొన్ని ఆన్​లైన్​ టెస్టులు రాసి ఫలితాలు విశ్లేషించుకుంటే మంచిది.

జనరల్నాలెడ్జ్

జీకే విభాగంలో కరెంట్​ అఫైర్స్​తో పాటు జాగ్రఫీ, చరిత్ర, పాలిటీ, ఎకానమీ, బయాలజీ, కెమిస్ర్టీ, ఫిజిక్స్, సైన్స్ అండ్‍ టెక్నాలజీ టాపిక్​ల నుంచి డిగ్రీ స్థాయిలో ప్రశ్నలిస్తారు. నిత్యజీవితానికి దగ్గరగా ఉన్నవి, నిత్యం గమనిస్తూ ఉన్న అంశాలే ప్రశ్నలవుతాయి. వీటికి అదనంగా స్టాండర్డ్​ జీకే టాపిక్స్.. దేశాల రాజధానులు, కరెన్సీలు వివిధ దేశాల అధిపతులు, దినోత్సవాలు, పదజాలాలు, నదీతీర నగరాలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు, ప్రధాన సరిహద్దు రేఖలు, వివిధ రంగాల్లో ప్రథములు, ప్రపంచంలో ఎత్తైనవి, పెద్దవి, పొడవైనవి, ప్రముఖుల బిరుదులు, మారుపేర్లు, జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల టాపిక్స్​ చదవాలి. ఖండాలు, సరస్సులు, నదులు, సముద్రాలు, గ్రహాలు, దేశాల సరిహద్దులు, ప్రాజెక్టులు వంటి వాటినీ వదలకూడదు. ప్రీవియస్‍ పేపర్ల సహాయంతో ఏ సబ్జెక్టు నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయో గుర్తించి క్షుణ్నంగా చదవగలిగితే ఇందులో మంచి మార్కులు పొందే అవకాశం ఉంది. ఇందుకు ఎన్‌సీఈఆర్‌టీ 8, 9, 10వ తరగతి పుస్తకాల్లో ఉండే చాప్టర్లు ఇంపార్టెంట్.

Latest Updates