యురేనియం ముప్పు తొలగినట్టేనా

హైదరాబాద్, వెలుగు:

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై ప్రజల్లో ఏర్పడిన సందిగ్ధత ఇంకా పూర్తిగా వీడిపోలేదు. ఆ ప్రాంత ప్రజలు ఇప్పటికీ ఆందోళన చెందుతూనే ఉన్నారు. ఎవరైన కొత్త ఆఫీసర్లు వచ్చినా, అడవులపై తక్కువ ఎత్తులో తిరుగుతున్న జెట్ విమానాలను చూసినా సర్వే కోసం వచ్చారేమోనని భయపడుతున్నారు. మరోవైపు, యురేనియం నిక్షేపాల సర్వే కోసం అటామిక్ మినరల్స్‌‌ డైరెక్టరేట్ (ఏఎండీ) ఇచ్చిన ప్రతిపాదనలపై అటవీశాఖ ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ ప్రతిపాదనలు ఇంకా ఫారెస్ట్ ఆఫీసర్ల వద్దే పెండింగ్‌‌లో ఉన్నాయి. చట్ట ప్రకారం ఖనిజాల సర్వేకు ఏఎండీ ప్రతిపాదనలు ఇస్తే, అటవీశాఖ సాధ్యాసాధ్యాలు, సర్వే వల్ల జరి గే లాభ, నష్టాలను అంచనా వేసి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపై వైల్డ్‌‌ లైఫ్ బోర్డు చర్చించి, ప్రతిపాదనలపై తన అభిప్రాయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఏఎండీ ప్రతిపాదనలు ఇవ్వడంతో అటవీశాఖ అధికారులు నివేదిక తయారు చేసేందుకు సిద్ధమయ్యారు.

లేఖపై స్పందించని ఏఎండీ

ఏఎండీ ఫారెస్ట్ డిపార్ట్‌‌మెంట్‌‌కు పంపిన ప్రతిపాదనల్లో 4 వేల బోర్లు వేయడానికి అనుమతి కోరింది. కానీ, ఆ బోర్లు ఎక్కడ వేస్తారన్నదానిపై ప్రతిపాదనల్లో స్పష్టంగా పేర్కొనలేదు. దీంతో బోర్లు ఎక్కడెక్కడ వేస్తారో కచ్చితమైన పాయింట్లు చూపాలని అటవీశాఖ ఏఎండీకి ఓ లేఖ రాసింది. ఈ గ్యాప్‌‌లో యురేనియం సర్వేపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో సెప్టెంబర్‌‌‌‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో యురేనియం ‘తవ్వకాలను’వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. మరోవైపు, లేఖ రాసి3 నెలలు గడుస్తున్నా ఏఎండీ ఆఫీసర్లు నేటికీ స్పందించలేదు. చట్ట ప్రకారం ఏఎండీ ప్రతిపాదనలపై అటవీశాఖ తన అభిప్రాయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఓ వైపు తమ లేఖకు ఏఎండీ స్పందించకపోవడం, మరోవైపు అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేయడంతో అటవీశాఖ సందిగ్ధంలో పడింది. పరిస్థితిని వివరిస్తూ ప్రభుత్వానికి కూడా లేఖ రాసింది. ఏఎండీ బోర్‌‌‌‌ పాయింట్లు చూపెడితే, ఏం చేయాలన్నదానిపై ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి తాము నడుచుకుంటామని ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఓ నెల రోజులు వేచి చూసి, అప్పటికీ ఏఎండీ స్పందించకపోతే ప్రతిపాదనలను తిరస్కరిస్తామంటున్నారు.

Latest Updates