జూరాల వద్ద యురేనియం సర్వే

ప్రాజెక్టు సమీపంలో
యూసీఐఎల్‌‌ అన్వేషణ
ఆందోళనలో స్థానికులు

ఆత్మకూర్, వెలుగునల్లమలలో యురేనియం వెలికితీతపై వివాదం సాగుతుండగానే అధికారులు జూరాల ప్రాజెక్టు చుట్టుపక్కల కూడా సర్వే చేస్తున్నారు. వనపర్తి జిల్లాలోని జూరాల జలాశయం సమీపంలోని మస్తీపూర్ గ్రామంలో యురేనియం కార్పొరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా లిమిటెడ్‌‌(యూసీఐఎల్‌‌) డ్రిల్లింగ్‌‌ చేస్తూ శాంపుల్స్‌‌ సేకరిస్తున్నారు. కృష్ణానది,  మస్తీపూర్‌‌ చుట్టూ ఏడు చదరపు కి.మీ. పరిధిలో నాలుగు బ్లాకులలో యురేనియం సర్వే, వెలికితీతకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

3 వేల ఫీట్ల లోతు నుంచి శాంపుల్స్‌‌

రెండేండ్లుగా మస్తీపూర్ చుట్టూ యురేనియం నిల్వలను గుర్తించేందుకు 350 చోట్లకు పైగా మూడు వేల ఫీట్ల లోతుకు డ్రిల్లింగ్ చేపడుతున్నారు. ఇక్కడ సుమారు 23.44 మిలియన్‌‌ టన్నుల ముడి ఖనిజం ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎంత భూభాగంలో యురేనియం ఉంది. నాణ్యత ఎంత అని తెలుసుకునేందుకు డ్రిల్లింగ్ చేస్తూ మట్టి శాంపుల్స్‌‌ సేకరిస్తున్నారు. శాంపుల్స్‌‌ ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌‌లోని ల్యాబ్‌‌లకు పంపుతున్నారు. రిపోర్టులు వచ్చాక తవ్వకాలపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాలేవి బయకు తెలియనివ్వడం లేదు.

సమాచారం కోసం అధికారులను అడిగితే హైదరాబాద్‌‌లోని తమ సంస్థ ఆఫీస్‌‌లో సంప్రదించాలని చెబుతున్నారు. యురేనియం కోసం బోర్లు వేయడం, తవ్వకాలు చేపడతారనే ప్రచారాలతో మస్తీపూర్‌‌, జురాల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల వారు ఆందోళన చెందుతున్నారు. సేవ్ జూరాల ప్రాజెక్ట్ పేరుతో ఉద్యమానికి రెడీ అవుతున్నారు. అలాగే యురేనియం తవ్వకాల వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు సీపీఎం, జనవిజ్ఞాన వేదిక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నాయి.

Latest Updates