సోమాలియాలో US ఎయిర్ స్ట్రైక్ : 26 మంది మిలిటెంట్లు హతం

సోమాలియా: అమెరికా మిలటరీ బలగాలు సెంట్రల్ సోమాలియాలో భారీ ఎయిర్ స్ట్రైక్ నిర్వహించాయి. ఈ వైమానిక దాడుల్లో 26 మంది అల్ షబాబ్ ఉగ్రవాదులు హతమయ్యారని యూఎస్ ఆఫ్రికా కమాండ్ (ఆఫ్రికోమ్) ప్రకటించింది. హిరాన్ ప్రాంతంలో నిర్వహించిన ఈ వైమానిక దాడుల్లో పౌరులకు ఎటువంటి నష్టం జరగలేదని ఆఫ్రికోమ్ వివరించింది.

అల్ ఖైదా కు అనుబంధ ఉగ్రవాద సంస్థ అల్ షబాబ్. ఈ ఉగ్రవాద సంస్థ… తూర్పు, మధ్య సోమాలియా ప్రాంతాలను తమ అదుపులోకి తీసుకునేందుకు బాంబు దాడులతో పేట్రేగిపోతోంది. హిరాన్ ప్రాంతంలో కొంతకాలంగా టెర్రరిస్టులు భారీస్థాయిలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.

టెర్రర్ నెట్ వర్క్ ను దెబ్బతీసేందుకు సోమాలియా ప్రభుత్వం తనవంతు ప్రయత్నిస్తోంది. ఐతే.. ఉగ్రవాద సంస్థల్లో నియామకాలు… వారి కార్యకలాపాలు ఆగలేదు. దీంతో… సోమాలి నేషనల్ ఆర్మీకి మద్దతుగా.. యూఎస్, ఆఫ్రికా కమాండ్ దళాలు ఈ వైమానిక దాడులు జరిపాయి.

మొగదిషు నగరంలోని మక్కా అల్ ముకరమ్హా హోటల్ దగ్గర గురువారం భీకరమైన ఉగ్రదాడి జరిగింది. 36 మంది పౌరులు చనిపోయారు. 60 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. ఈ దుర్ఘటన జరిగిన కొద్ది గంటలకే… అల్ షబాబ్ టెర్రర్ బేస్ లపై యూఎస్ ఆఫ్రికా కమాండ్ బలగాలు ఎయిర్ స్ట్రైక్ చేశాయి. 26 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.

2019 ఏడాదిలో గడిచిన రెండు నెలల్లోనే 22 సార్లు ఎయిర్ స్ట్రైక్స్ చేశాయి బలగాలు. 180 మంది ఉగ్రవాదులను చంపేశాయి.

Latest Updates