‘కరోనా వైరస్‌ని చైనాలో వదిలింది అమెరికా మిలటరీనే’

కొత్త కరోనా వైరస్ ఎక్కడ మొదలైంది? కొవిడ్–19 మహమ్మారి ఎక్కడి నుంచి ప్రపంచమంతటా పాకింది? ఇంకెక్కడ.. చైనాలోని వుహాన్ నుంచే కదా.. అంటారా! అయితే, ఇది నిజం కానే కాదని చైనా అంటోంది. వైరస్ వాస్తవానికి అమెరికాలోనే పుట్టిందని, దానిని ఆ దేశ ఆర్మీయే వుహాన్‌‌‌‌‌‌‌‌కు తీసుకొచ్చిందని వాదిస్తోంది. దీనిపై అమెరికా కూడా అంతే ఘాటుగా స్పందించింది. అది కచ్చితంగా ‘వుహాన్ వైరసే’ అని స్పష్టం చేస్తోంది. దీంతో రెండు అగ్రదేశాల మధ్య కరోనాపై మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.

కరోనా పుట్టింది వుహాన్ లో కాదు..

‘‘అమెరికా ఆర్మీయే ఈ మహమ్మారిని వుహాన్‌‌‌‌‌‌‌‌కు తీసుకొచ్చి ఉండవచ్చు” అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ గురువారం రాత్రి ట్వీట్ చేశారు. గత ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో వుహాన్‌‌‌‌‌‌‌‌లో మిలిటరీ వరల్డ్ గేమ్స్ జరిగాయని, అందులో వందలాది మంది యూఎస్ మిలిటరీ అథ్లెట్లు కూడా పాల్గొన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆయన శుక్రవారం కూడా దీనిపై స్పందిస్తూ.. 9/11 టెర్రర్ అటాక్స్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన కాన్‌‌‌‌‌‌‌‌స్పైరసీ థియరీలను పబ్లిష్​చేసే ఓ వెబ్ సైట్ లింకును షేర్ చేశారు. అమెరికాలో కొన్నాళ్ల క్రితం 3.4 కోట్ల మందికి ఇన్ ఫ్లుయెంజా వచ్చి, 20 వేల మంది చనిపోయిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వాస్తవానికి ఫ్లూతో చనిపోయినవారిలో కొందరి చావులకు ‘కొవిడ్–19’ వ్యాధే కారణమని తేలినట్లు అమెరికాకు చెందిన సీడీసీ ప్రతినిధి రాబర్ట్ రెడ్ ఫీల్డ్ స్వయంగా ప్రతినిధుల సభకు వెల్లడించారనీ లిజియాన్ పేర్కొన్నారు. ‘దయచేసి చెప్పండి.. కొవిడ్–19తో ఎంత మంది చనిపోయారు?’ అని కూడా ఆయన అమెరికాను ప్రశ్నించారు.

సోషల్ మీడియాకు గేట్లెత్తిండ్రు..

మామూలుగా అయితే చైనాలో సోషల్ మీడియాపై అధికారులు నిరంతరం నిఘా పెడతారు. ఎలాంటి రూమర్లూ వ్యాపించకుండా చర్యలు తీసుకుంటుంటారు. కానీ కరోనా వైరస్ వెనక అమెరికాయే ఉందన్న విషయం ప్రచారం చేసేందుకు సోషల్ మీడియాపై ఆంక్షలను సైతం చైనా ఎత్తేసిందని చెప్తున్నారు. ఫ్లూ వల్ల చనిపోయిన కొందరికి కొవిడ్–19 ఉన్నట్లు కన్ఫమ్ అయిందని అమెరికా హెల్త్ ఆఫీసర్ ఒకరు చెప్తున్నట్లు ఉన్న వీడియో ‘వీబో’ (చైనాలో ట్విట్టర్ లాంటిది) ద్వారా నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు. కరోనా వైరస్ అమెరికాలోనే పుట్టిందనేందుకు ఇదే ఆధారం అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే, యూనివర్సిటీ ఆఫ్​షికాగో ప్రొఫెసర్ డాలీ యాంగ్ మాట్లాడుతూ.. ఝావో లిజియాంగ్ తన ‘అధికారిక హోదా’ ప్రకారమే ట్వీట్లు చేస్తున్నారని అన్నారు.

వుహాన్ లోనే పుట్టిందా?

వుహాన్ లోని సీఫుడ్ మార్కెట్ లోనే కొత్త కరోనా వైరస్ పుటిందా? ఈ మార్కెట్లోనే జంతువు నుంచి మనిషికి ఇది వ్యాపించిందా? అన్నదానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో ‘‘ఈ మహమ్మారి మొదట కనిపించింది చైనాలోనే కావచ్చు. కానీ ఇది కచ్చితంగా చైనాలో మాత్రం పుట్టలేదు”అని చైనా హెల్త్ కమిషన్ ఆఫీసర్లు అంటున్నారు.  కొవిడ్–19 వుహాన్ లో వెలుగు చూసిందని, కానీ అది ఎక్కడి నుంచి పాకిందన్న విషయంలో స్పష్టత లేదని డబ్ల్యూహెచ్ఓ కూడా వెల్లడించింది. దీనిని ఏదో ఒక జాతికి ముడిపెట్టి, వివక్ష చూపేలా పేర్లు పెట్టరాదని సూచించింది. కానీ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కు చెందిన అన్ని శాంపిల్స్ లో తేలిన జన్యుపరమైన వివరాల ప్రకారం చూస్తే.. అన్నింటికీ వుహాన్ కరోనా వైరసే మూలంగా కన్పిస్తోందని ఇంపీరియల్ కాలేజ్ లండన్ ప్రొఫెసర్ క్రిసిల్ డానెల్లీ అంటున్నారు.

Latest Updates