సెక్యులర్‌‌ దేశంలో ఇదేం బిల్లు?

  • మతప్రాతిపదికపై పౌరసత్వమా?
  • రాజ్యసభ కూడా ఓకే చేస్తే..అమిత్ షాపై ఆంక్షలు తప్పవ్
  • సిటిజన్ షిప్ బిల్లుపై యూఎస్ కమిషన్

వాషింగ్టన్కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘సిటిజన్​షిప్’ బిల్లుపై యూఎస్​కమిషన్​ ఫర్ ఇంటర్నేషనల్​ రిలీజియస్​ ఫ్రీడం(యూఎస్​సీఐఆర్ఎఫ్) ఆందోళన వ్యక్తంచేసింది. సెక్యులర్‌‌ దేశంలో  మతప్రాతిపదికగా తీసుకొచ్చిన ఈ బిల్లు ‘తప్పుడు మార్గంలో ప్రమాదకరమైన మలుపు’ అని కామెంట్​ చేసింది. లోక్​సభ దీనికి ఆమోదం తెలపడాన్ని తప్పుబట్టింది. ఈ బిల్లు రాజ్యసభ​ ఆమోదం కూడా పొందితే అమిత్​ షా తో పాటు ఇతర ప్రధాన నేతలపైనా ఆంక్షలు విధించాలని అమెరికా ప్రభుత్వానికి సూచించింది. ఈమేరకు యూఎస్ సీఐఆర్ఎఫ్ తన అధికారిక ట్విట్టర్​లో తెలిపింది. దీంతోపాటు కమిషన్​ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. సిటిజన్​షిప్​ ఎమెండ్‌మెంట్​ బిల్లు(సీఏబీ) మతప్రాతిపదికన రూపొందించిందని ఇందులో ఆరోపించింది. దేశ లౌకిక చరిత్రకు ఇది వ్యతిరేకమని, రాజ్యాంగ విలువలను, సమానత్వపు హక్కును కాలరాస్తుందని విమర్శించింది. అమెరికన్​ కాంగ్రెస్ ​కమిటీ కూడా ఈ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేసింది.

1998లో ఏర్పాటు..

యునైటెడ్​ స్టేట్స్ కమిషన్​ఫర్​ ఇంటర్నేషనల్​ రిలీజియస్​ ఫ్రీడమ్.. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు జరిపే స్వతంత్ర సంస్థ. 1998లో ఈ కమిషన్​ ఏర్పాటయింది. అంతర్జాతీయంగా మత స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారాలను ఇది పర్యవేక్షిస్తుంది. అమెరికా బయట మతస్వేచ్ఛకు వ్యతిరేకంగా జరిగే కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. ప్రెసిడెంట్​కు పాలసీ నిర్మాణంలో సలహాలు, సూచనలు అందజేస్తుంది.

మోడీ వీసా కోసం రికమెండేషన్

2002లో గుజరాత్​ అల్లర్ల సందర్భంగా అప్పటి సీఎం నరేంద్ర మోడీకి వీసా ఇవ్వకుండా అమెరికా ఆంక్షలు పెట్టింది. తర్వాత మూడేళ్లకు మోడీ వీసాపై ఆంక్షలను ఎత్తేయాలని యూఎస్​సీఐఆర్ఎఫ్​ అమెరికా సర్కారుకు సిఫార్సు చేసింది. దీంతో అమెరికా మోడీకి వీసా జారీ చేసింది.

పక్షపాత ధోరణితోనే ప్రకటన

సిటిజన్​షిప్​ బిల్లుపై యూఎస్​సీఐఆర్ఎఫ్ విడుదల చేసిన ప్రకటన పక్షపాతపూరితంగా ఉందని, దాని ప్రకటనను పట్టించుకోబోమని మన విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రావీష్​ కుమార్​ స్పష్టం చేశారు.  కమిషన్​ ప్రకటనవార్నింగ్​ కాదు.. సూచనాకూడా కాదన్నారు. గత పాలకుల హయాంలోనూ ఆ కమిషన్​ ప్రకటనల ను పక్కకు పెట్టిన చరిత్ర ఉందన్నారు. మతపరమైన ఆంక్షల వల్ల ఇండియాకు వలస వస్తున్న నాన్​ముస్లింల ఇబ్బందులను, వారి హక్కులను పరిగణలోకి తీసుకునే ఈ బిల్లును తెచ్చామన్నారు. నిజంగా మత స్వేచ్ఛకు కట్టుబడి ఉన్న వ్యక్తులు, సంస్థలు దీని వెనకున్న ఉద్దేశాన్ని గుర్తించి బిల్లును స్వాగతించాలని రావీష్​ కుమార్​
అన్నారు.

హిందూ రాజ్యం విస్తరణ కోసమే: పాక్‌‌

ఇస్లామాబాద్: మతం ఆధారంగా పొరుగు దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఇండియా చేస్తున్న ప్రయత్నాలను సిటిజన్​షిప్​ బిల్లు బయటపెట్టిందని పాకిస్తాన్​ఆరోపించింది. ఈ బిల్లు వివక్షాపూరితంగా ఉందని, సంబంధిత దేశాల్లో మైనార్టీల భద్రత, హక్కుల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. సోమవారం లోక్​సభ ఆమోదించిన సిటిజన్​షిప్​ ప్రకారం.. పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్​ నుంచి 2014 డిసెంబర్​ 31 లోపు ఇండియా వచ్చిన హిందూ, సిక్కు, బుద్దిస్ట్, జైన్, పార్సీ, క్రిస్టియన్​ మతాలకు చెందిన వారిని అక్రమ వలసదారులుగా చూడకుండా ఇండియన్ సిటిజన్​షిప్​ కల్పిస్తారు. ఈ బిల్లుపై ఇమ్రాన్​ఖాన్​ ట్విట్టర్​లో ఫైర్​ అయ్యారు. ఇంటర్నేషనల్ హ్యూమన్​ రైట్స్​ చట్టాల్లోని అన్ని నియమాలను, పాక్​తో ఒప్పందాలను ఈ బిల్లు ఉల్లంఘించిందన్నారు. హిందూ రాజ్యాన్ని విస్తరించాలన్న ఆర్ఎస్ఎస్​ సిద్దాంతాలకు అనుగుణంగానే ఈ డిజైన్​ ఉందని విమర్శించారు.

Latest Updates