బీరు దొంగిలించిన దంపతుల అరెస్ట్.. పట్టించిన సీసీ కెమెరా

బీర్లు దొంగిలించడం.. చిల్ అవ్వడం ఆ జంటకు ఇదో సరదా. ఆ పని ఏదో ఒకసారి కాకుండా మళ్లీ మళ్లీ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఒకే స్టోర్‌లో పలుమార్లు రూ.73 వేల విలువైన బీరు కొట్టేసి.. జైలుపాలయ్యారు. అమెరికాలోని లూసియానాకు చెందిన దంపతులు గత నెల చివరిలో చేసిన ఈ పని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరా ఫుటేజీ వాళ్ల దొంగతనాన్ని పట్టించింది.
లూసియానా స్టేట్‌లోని ఈస్ట్ బాటన్ రోగ్ సిటీకి చెందిన మాథ్యూ (35), ఆస్లే (32) దంపతులను బీరు దొంగిలించిన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. బాటన్ రోగ్‌లోని టార్గెట్ స్టోర్‌లో ఫిబ్రవరి 24 నుంచి 29 మధ్య ఆరు సార్లు షాపింగ్ చేశారు. అక్కడికి వెళ్లిన ప్రతిసారీ భారీగా కేసుల కొద్దీ బీర్లు తీసుకెళ్లారు. అయితే వాటిలో చాలా వరకు బిల్లు కట్టకుండా వెళ్లిపోయారు. ఈ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఆ స్టోర్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా గత వారం దర్యాప్తు మొదలు పెట్టారు. ఆదివారం ఆ జంటను అరెస్టు చేశారు. ఆ దంపతులు మొత్తం రూ.73 వేలకు పైగా విలువ చేసే బీర్లు బిల్లు కట్టకుండా దొంగిలించుకుని వెళ్లారని ఈస్ట్ బాటన్ రోగ్ పోలీసులు తెలిపారు. వాళ్లపై గతంలోనూ ఇలాంటి కేసులు ఉన్నట్లు చెప్పారు. అలాగే వారిపై డ్రగ్స్ కేసులు కూడా ఉన్నాయన్నారు.

Latest Updates