న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో టాప్ సీడ్ ప్లేయర్లు మరో అడుగు ముందుకేశారు. శనివారం రాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ మూడో రౌండ్లో వరల్డ్ నంబర్‌వన్, టాప్‌సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) 6–2, 6–3, 4–6, 6–3తో 26వ సీడ్ డాన్ ఇవాన్స్ (బ్రిటన్)పై నెగ్గాడు. 3 గంటలా 11 నిమిషాల మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు ఈజీగా నెగ్గిన స్పెయిన్ ప్లేయర్‌కు మూడో సెట్లో ఊహించని ప్రతిఘటన ఎదురైంది. కీలక టైమ్‌లో రెండుసార్లు సర్వీస్‌ను కోల్పోయి సెట్‌ను చేజార్చుకున్నాడు. అయితే నాలుగో సెట్లో తన ట్రేడ్ మార్క్ షాట్లతో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. మ్యాచ్ మొత్తంలో అల్కరాజ్ 6, ఇవాన్స్ 8 ఏస్‌లు కొట్టారు. అయితే ఆరు బ్రేక్ పాయింట్లు కాచుకున్న అల్కరాజ్, 61 విన్నర్లు, 23 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్ చేశాడు.
2 బ్రేక్ పాయింట్లనే కాపాడుకున్న ఇవాన్స్ 24 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో మెద్వెదెవ్ (రష్యా) 6–2, 6–2, 7–6 (8/6)తో సెబాస్టియన్ బేజ్ (అర్జెంటీనా)పై, సినెర్ (ఇటలీ) 6–3, 6–2, 6–4, 6–2తో వావ్రింకా (స్విట్జర్లాండ్)పై, జ్వరెవ్ (జర్మనీ) 6–7 (2/7), 7–6 (10/8), 6–1, 6–1తో దిమిత్రోవ్ (బల్గేరియా)పై, రబ్లెవ్ (రష్యా) 3–6, 6–3, 6–1, 7–5తో రిండెర్కెంచ్ (ఫ్రాన్స్)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. ఇక విమెన్స్ సింగిల్స్‌లో సబలెంకా (రష్యా) 6–1, 6–1తో క్లారా బురెల్ (ఫ్రాన్స్)పై, జెసికా పెగులా (అమెరికా) 6–4, 4–6, 6–2తో స్వితోలినా (ఉక్రెయిన్)పై, జుబేర్ (ట్యూనీషియా) 5–7, 7–6 (7/5), 6–3తో బౌజుకోవా (చెక్)పై, మాడిసన్ కీస్ (అమెరికా) 5–7, 6–2, 6–2తో సమ్సనోవా (రష్యా)పై, వొండ్రుసోవా (చెక్) 6–2, 6–1తో అలెగ్జాండ్రోవా (రష్యా)పై నెగ్గి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టారు.