స్పేస్ లోకి న్యూక్లియర్ థర్మల్ రాకెట్

స్పేస్ లోకి ‘డ్రాకో’ ఇంజన్

న్యూక్లియర్ థర్మల్ రాకెట్ తయారు చేస్తున్న అమెరికా

 చైనాను దాటి.. నెంబర్ వన్ గా నిలిచేలా కసరత్తు

 డ్రాకోతో ఉపగ్రహాలు, స్పేస్ క్రాఫ్ట్ ల తరలింపు ఈజీ

 మనుషులను చంద్రుడు, మార్స్ పైకి పంపేందుకూ ఉపయోగం

 స్పేస్ లో అణు విపత్తు మాటేమిటంటున్న నిపుణులు

అమెరికా ప్రెసిడెంట్ గా ఎవరున్నా.. ‘అమెరికా ఫస్ట్’ అనే పాలసీని తప్పకుండా పాటిస్తుంటరు. అట్లనే.. అంతరిక్ష రంగంలో కూడా ఎల్లప్పుడూ ‘అమెరికా ఆధిపత్యం’ కొనసాగేలా పోటాపోటీగా కోట్ల డాలర్లు కుమ్మరిస్తూ ప్రయోగాలు చేస్తుంటరు. తాజాగా.. అమెరికా రక్షణ శాఖకు చెందిన రీసెర్చ్ సంస్థ ‘డార్పా’ అలాంటి ఓ కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అదే న్యూక్లియర్ రాకెట్ ఇంజన్.. ‘డ్రాకో’ ప్రాజెక్టు. డార్పాను ఇంటర్నేషనల్ గా ‘మ్యాడ్ సైన్స్ డివిజన్’ అని కూడా పిలుస్తుంటారు. ఆ సంస్థ చేపట్టే రీసెర్చ్ లు కూడా అట్లనే ఉంటాయి. ఇటీవల అంతరిక్ష రంగంలో చైనా చాలా దూకుడును చూపుతోంది. మూన్ మిషన్ లలో ఆ దేశం అన్నింటికంటే ముందుకు దూసుకుపోయింది. అందుకే.. చైనా కంటే ఒకడుగు ముందుకు వేయాలని భావిస్తున్న అమెరికా ఇంతవరకూ ఏ దేశమూ చేయని సాహసానికి సిద్ధం అవుతోంది.

స్పేస్ లోకి న్యూక్లియర్ రాకెట్..

అంతరిక్ష ప్రయోగాల్లో రాకెట్లు, స్పేస్ క్రాఫ్ట్ లలో ఇంధనం బరువే చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత సాలిడ్, లిక్విడ్ కెమికల్ ఇంధనాల వల్ల టన్నుల కొద్దీ బరువును మోసుకెళ్లాల్సి వస్తోంది. అందుకే.. ఫ్యూయెల్స్ బరువును భారీ ఎత్తున తగ్గిస్తే.. ఎన్నో రకాలుగా లాభాలుంటాయని అమెరికా రక్షణ శాఖ భావిస్తోంది. ఇందుకోసం.. న్యూక్లియర్ ఎనర్జీని ఉపయోగించుకుని స్పేస్ లో పని చేసే రాకెట్ ఇంజన్లను తయారు చేయాలని నిర్ణయించింది. ‘డెమాన్‌‌‌‌ స్ట్రేషన్ రాకెట్ ఫర్ ఎజైల్ సిస్ లూనార్ ఆపరేషన్స్ (డ్రాకో)’ అనే ఈ న్యూక్లియర్ ఇంజన్ తయారీ పనిని డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ (డార్పా)కు అమెరికా రక్షణ శాఖ అప్పగించింది.

యురేనియంతో వేడి పుట్టించి..

డ్రాకో ఇంజన్ లో చిన్న న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుంది. ఇది యురేనియంను వాడుకుని వేడిని పుట్టిస్తది. ఈ వేడి లిక్విడ్ ప్రొపెల్లెంట్ కు ట్రాన్స్ ఫర్ అయి, దానిని గ్యాస్ గా మారుస్తది. ఆ గ్యాస్ ఇంజన్ చివరన నాజిల్ వద్ద మండిపోయి అత్యంత బలంగా బయటికి వెళ్తది. ఆ వేగానికి ఆపోజిట్ గా స్పేస్ క్రాఫ్ట్ ముందుకు దూసుకెళ్తది.

మస్త్ లాభాలుంటయ్..

మామూలు కెమికల్ ఇంజన్ తో పోలిస్తే న్యూక్లియర్ ఇంజన్ తో చాలా లాభాలుంటాయని చెప్తున్నారు. లో ఎర్త్ ఆర్బిట్ నుంచి చంద్రుడి మధ్య శాటిలైట్లను చాలా వేగంగా, ఎక్కడికి కావాలంటే అక్కడికి చాలా తక్కువ ఇంధనంతోనే తరలించొచ్చట. మామూలు ఇంజన్లతో ఈ పని చేయడం అంత ఈజీ కాదు. పైగా బోలెడు ఇంధనం మండించినా, శాటిలైట్లను వేగంగా తరలించలేం. చంద్రుడు, భూమికి సరిగ్గా మధ్యలో ఉండే పాయింట్ ను సిస్ లూనార్ స్పేస్ అంటారు. ఇక్కడికి స్పేస్ క్రాఫ్ట్ లను తరలించేందుకు కూడా డ్రాకో బాగా ఉపయోగపడ్తదని అంటున్నారు. అంతేకాదు.. చంద్రుడిపై నుంచి ఖనిజాలను తవ్వి భూమికి తరలించేందుకు కూడా దీనితో పని ఈజీ అయితదని పేర్కొంటున్నారు.

అణు విపత్తుపై నో క్లారిటీ..

భూమిపై న్యూక్లియర్ రియాక్టర్లు పేలిపోతే రేడియేషన్ ముప్పు ఎలా ఉంటుందో ఇప్పటికే పలు సార్లు తెలిసొచ్చింది. మరి.. స్పేస్ లో డ్రాకో ఇంజన్ ఇతర స్పేస్ క్రాఫ్ట్ లను లేదా గ్రహశకలాను ఢీకొడితే? లేదా పేలిపోతే.. పరిస్థితి ఏంటీ? అని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే స్పేస్ లో న్యూక్లియర్ డిజాస్టర్ పరిణామాలు ఎలా ఉంటాయి? తీసుకోవలసిన జాగ్రత్తలపై డార్పా నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.

2 నెలల్లోనే మార్స్ కు పోవొచ్చు

ప్రస్తుతం మార్స్ కు స్పేస్ క్రాఫ్ట్ లను పంపాలంటే.. కనీసం ఆరు నెలలు పడుతోంది. పెద్ద మొత్తంలో ఇంధనం కూడా ఖర్చు చేయాల్సి వస్తోంది. కానీ డ్రాకో ఇంజన్ అందుబాటులోకి వస్తే స్పేస్ క్రాఫ్ట్ ల వేగం చాలావరకూ పెరుగుతుందని, మానోవర్స్ కూడా ఈజీగా చేయొచ్చని అంటున్నారు. దాదాపుగా 60 రోజుల్లోనే మార్స్ కు మనుషులను పంపించొచ్చని చెప్తున్నారు. దీనివల్ల ఆస్ట్రోనాట్లకు రేడియేషన్ రిస్క్ తగ్గుతుంది. తక్కువకాలంలోనే స్పేస్ ట్రావెల్స్ పూర్తి చేయొచ్చు. ఖర్చు కూడా గణనీయంగా తగ్గిపోతుందని వివరిస్తున్నారు.

డ్రాకో ఇంజన్ పనిచేసేదిలా..

  1. యురేనియం కోర్ వేడిని ఉత్పత్తి చేస్తది
  2. లిక్విడ్ హైడ్రోజన్ బాగా వేడెక్కి
    గ్యాస్ గా మారుతది
  3. హైడ్రోజన్ గ్యాస్ నాజిల్ ద్వారా బయటికొస్తది
  4. గ్యాస్ వేగంగా బయటికెళ్లడంతో ఆ థ్రస్ట్ కు స్పేస్ క్రాఫ్ట్ ముందుకెళ్తది

Latest Updates