మన నీళ్లు కృష్ణార్పణం

  • ఉన్న నీళ్లను కూడా వాడుకుంటలేం
  • దశాబ్దాలుగా కృష్ణా నీటిపై ఇదే కథ
  • ఇప్పటివరకు పది వేల టీఎంసీలు కోల్పోయినట్లు అంచనా
  • మనకున్న 37% వాటాలో గత ఐదేండ్లలో దక్కింది 30 శాతమే
  • 299 టీఎంసీల్లో 150 టీఎంసీలకు మించని వినియోగం
  • మనకన్నీ లిఫ్టులు.. ఏపీలో గ్రావిటీ వాడకం

రాష్ట్రంలో నదీ జలాల వాడకంపై చర్చ జరుగుతోంది. అటు ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం రావడంతో గోదావరి జలాలను కృష్ణానదికి మళ్లించి వాడుకోవాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనిపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ తర్వాత రెండు పక్షాల అధికారులు నీటిని ఎలా మళ్లించాలన్న ఆలోచనలు చేస్తున్నారు. ఇదే సమయంలో కృష్ణానది నీటి వాడకం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి అవగాహన ఉంటుందన్నది ఆసక్తి రేపుతోంది. నిజానికి రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు కూడా కృష్ణానదిపైనే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ నీటి వాటాలో అన్యాయం బలమైన అంశంగా పనిచేసింది. ఈ పరిస్థితిలో అసలు కృష్ణా నదిలో మన వాటా ఎంత? అందులో మనకు జరిగిన అన్యాయం ఏంటి? ఇప్పుడు మనం వాడుకుంటున్నది ఎంత? అన్న వివరాలతో ప్రత్యేక కథనం.

హైదరాబాద్, వెలుగు: కృష్ణానది నీటిలో మన రాష్ట్రం వాడుకున్న వాటా చాలా తక్కువ. మనకు కేటాయించిన నీటిలో ఇప్పటివరకు ఏ ప్రాజెక్టు కిందా పూర్తిస్థాయిలో వాడుకున్న దాఖలాలు లేవు. తెలంగాణలోనే కృష్ణా పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉన్నా ఆ స్థాయిలో నీటివాటా దక్కకపోగా, ఉన్న వాటానూ ఉపయోగించుకోలేని పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలోనూ, సొంత రాష్ట్రంలోనూ కొనసాగుతోంది. దీంతో కొన్ని దశాబ్దాలుగా తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటా దాదాపు 10 వేల టీఎంసీలను కోల్పోయినట్లు మన ఇరిగేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో కృష్ణా, దాని ఉపనదులపై ఉన్న రిజర్వాయర్లు, చిన్న, పెద్ద డ్యామ్ ల కింద సాగుభూమికి ఎప్పుడూ సరిపడా నీరు అందలేదు. ట్రిబ్యునల్ కేటాయింపుల్లోనే అన్యాయం జరిగితే, తర్వాత వచ్చిన నీటివాటా వాడకంలోనూ మరింత అన్యాయం జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఐదేండ్లలో పెద్దగా మారిందేం లేదు.

బేసిన్ ఎక్కువ… వాటా తక్కువ

కృష్ణా పరివాహక ప్రాంతం మన రాష్ట్రంలోనే ఎక్కువున్నా బచావత్ ట్రిబ్యునల్ తక్కువ కేటాయింపులు చేసింది. రాష్ట్రంలో కృష్ణా పరివాహక ప్రాంతం 20,167 చదరపు మైళ్లు. ఉమ్మడి రాష్ట్రంలో మూడు ప్రాంతాల వారీగా చూస్తే ఇది మొత్తం బేసిన్ లో 68.50 శాతం. రాయలసీమలో నది 5,414 చదరపు మైళ్లు ఆ ప్రాంతం వాటా18.30 శాతం. కోస్తాంధ్రలో 3,860 చదరపు మైళ్లు అంటే బేసిన్ లో 13.20 శాతంగా బచావత్ ట్రైబ్యునల్ అంచనా వేసింది. దీని ఆధారంగానే నీటిని కేటాయించారు. పరివాహక ప్రాంతం ఆధారంగా రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా 548 టీఎంసీలు. కానీ మనకు కేటాయించింది 299 టీఎంసీలు. ఇది మొత్తం జలాల్లో దాదాపు 37 శాతం మాత్రమే. రాయలసీమలో పరివాహక ప్రాంతం ఆధారంగా 146 టీఎంసీలు ఇవ్వాల్సి ఉండగా 133 టీఎంసీలు కేటాయించారు. కోస్తాంధ్రకు104 టీఎంసీలు ఇవ్వాల్సి ఉండగా.. భారీగా 388 టీఎంసీలు ఇచ్చారు. ట్రైబ్యునల్ కేటాయింపులతో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా రాలేదు. ఇలా 100 టీఎంసీలకుపైగా వాటాను మన రాష్ట్రం కోల్పోయింది.

8 లక్షల ఎకరాలకు మించని సాగు

1973లో బచావత్ ట్రైబ్యునల్ ఏర్పాటు నుంచి 2000 సంవత్సరం వరకు తెలంగాణ ఏటా 90 నుంచి 150 టీఎంసీలకు మించి వాడుకోలేదు. ట్రైబ్యునల్ కేటాయింపు వల్ల జరిగిన నష్టానికి తోడు, ఇచ్చిన వాటాను పూర్తిగా వాడుకోలేకపోవడం వల్ల ఇప్పటి వరకు10 వేల టీఎంసీలను నష్టపోయినట్లు అంచనా. కృష్ణానది నీటి ఆధారంగా రాష్ట్రంలో కట్టిన అన్ని రకాల ప్రాజెక్టుల కింద దాదాపు 18 లక్షల ఎకరాలున్నాయి. కానీ ఏనాడూ 6 లక్షల నుంచి 8 లక్షల ఎకరాలకు మించి సాగు జరగలేదు. కేటాయించిన నీటిలో సగం కూడా ఎప్పుడూ వాడుకోలేదు. ఇదే సమయంలో అటు కోస్తాంధ్రలో 388 టీఎంసీలతో 31 లక్షల ఎకరాలకు పైగా సాగైనట్లు 2004 వరకున్న ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. రాయలసీమలో 133 టీఎంసీలకు 6 లక్షల నుంచి 8 లక్షల ఎకరాల వరకు సాగైనట్లు అధికారిక లెక్కలున్నాయి. సాగు లెక్కల ప్రకారం చూస్తే నీటి వాటాకు మించి కోస్తాంధ్ర, రాయలసీమల్లో అదనంగా వాడకం జరిగింది. మన రాష్ట్రంలో 299 టీఎంసీల నికర జలాలు, 77 టీఎంసీల వరద జలాలు ఏవీ సరిగా వాడుకోలేని దుస్థితి.

పెద్ద ప్రాజెక్టుల్లో నీటి వినియోగం అంతంతే

కృష్ణా బేసిన్ లో ముఖ్య ప్రాజెక్టులైన నాగార్జున సాగర్, జూరాల, ఆర్డీఎస్ కింద ఆయకట్టుకు ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో నీరు అందలేదు. సాగర్ కింద మన రాష్ట్రంలో 6 లక్షల 38 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి 106 టీఎంసీలు కేటాయించారు. తెలంగాణ ఏర్పడే వరకు దీని కింద సాగైంది 3 లక్షల ఎకరాలలోపే. గత ఐదేండ్లలోనూ కృష్ణాకు రావాల్సినంత స్థాయిలో ప్రవాహం లేదు. జూరాల ప్రాజెక్టుకు17 టీఎంసీల నీటి కేటాయింపు ఉంటే దాని కింద లక్షా 2 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. కానీ 30 వేల నుంచి 50 వేల ఎకరాలే సాగవుతోంది. మూడు టీఎంసీలకు మించి వాడుకోలేని పరిస్థితి. తుంగభద్రపై నిర్మించిన ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్)కు 15 టీఎంసీల కేటాయింపు ఉంటే దాని కింద 87 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే 20 వేల ఎకరాలకు మించి సాగు కావడం లేదు. ఇక కృష్ణానదిపై నిర్మించిన అతి పెద్ద ప్రాజెక్టు శ్రీశైలం. దీన్ని నాగార్జునసాగర్ కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా ఉపయోగిస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 304 టీఎంసీలు ఉన్నా సిల్ట్ వల్ల 215 టీఎంసీలకు మించి నిల్వ ఉండే అవకాశం లేదు. నిజానికి ఇది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు ఉపయోగపడుతోంది. గతంలో పోతిరెడ్డిపాడు గేట్లను నాలుగు నుంచి 14కు పెంచడంతో గ్రావిటీ ద్వారా మరింత నీటిని సీమకు తరలిస్తున్నారు. దీని ద్వారా చెన్నైకి మంచినీటిని ఇవ్వడంతో పాటు వరద జలాలను సీమకు కేటాయించారు. దీని ఆధారంగానే రాయలసీమలో భారీ సంఖ్యలో రిజర్వాయర్లు నిర్మించారు. శ్రీశైలం నుంచి మన రాష్ట్రంలో కల్వకుర్తి, ఎలిమినేటి మాధవరెడ్డి వంటి లిఫ్టుల ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లాల ప్రాజెక్టులకు నీళ్లు తరలించడంతో పాటు హైదరాబాద్ కు 16 టీఎంసీల వరకు మంచినీళ్లు అందిస్తున్నారు.

పైన నిండాకే మనకు..

కృష్ణా, దాని ఉపనదుల్లో వరద వచ్చే రోజులు 90 నుంచి 30 రోజులకు తగ్గిపోయాయి. మరోవైపు కర్నాటకలో కృష్ణాపై భారీ ప్రాజెక్టులున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలు నిండాకే కిందికి వదులుతున్నారు. దీంతో గడిచిన ఐదేళ్లకాలంలో మన రిజర్వాయర్లు ఎప్పుడూ పూర్తిస్థాయిలో నిండలేదు. దీంతో మన వాటాను కూడా పూర్తిస్థాయిలో వాడుకోలేకపోతున్నాం.

కృష్ణా ఉపనదుల నీటి వాడకం ఇదీ..

గతంలోనే కృష్ణానది ఉపనదులపై అనేక చిన్న ప్రాజెక్టులను కట్టారు. వీటికి అర టీఎంసీ నుండి 10 టీఎంసీల వరకు నీటి కేటాయింపులు ఉన్నాయి. అయితే ఇవి ఏనాడూ నిండకపోవడంతో ఎక్కడా పూర్తిస్థాయి ఆయకట్టుకు నీళ్లు అందలేదు.

తుంగభద్రపై ఆర్డీఎస్:

రాజోలిబండ డైవర్షన్ స్కీం కింద 87,500 ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి 15.9 టీఎంసీల నీటి వాటా ఉంది. తెలంగాణ సరిహద్దుకు 40 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఇక్కడ బ్యారేజీ లేకుండా డైవర్షన్ కు మాత్రమే ఉపయోగిస్తుండడం వల్ల 5 నుంచి 6 టీఎంసీలు మాత్రమే వస్తోంది. దీని ఎత్తును 6 అంగుళాలు పెంచుదామని మన రాష్ట్రం అడిగినా ఏపీ ప్రభుత్వం ఒప్పుకోకపోవడం వల్ల సాధ్యం కాలేదు. ఇప్పుడు ఆర్డీఎస్ కింద మానవపాడు, అలంపూర్, గట్టు మండలాల్లో 25 వేల నుంచి 30వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరందుతోంది. తెలంగాణ వచ్చాక తుమ్మిళ్ల లిఫ్ట్ స్కీం వల్ల ఆర్డీఎస్ నష్టం కొంత వరకు భర్తీ అయ్యింది.

మూసీ నదిపై పాత ప్రాజెక్టు:

నల్గొండ జిల్లాలో మూసీ నదిపై కట్టిన ఆనకట్ట ఇది. ప్రాజెక్టుకు 9.4 టీఎంసీల కేటాయింపు ఉంది. దీనికింద సూర్యాపేట, చివ్వెంల, పెన్ పహాడ్, కేతేపల్లి, తిప్పర్తి, వేముపల్లి మండలాల్లో 30 వేల ఎకరాల ఆయకట్టు ఉంది.

కోయిల్ సాగర్ ప్రాజెక్ట్:

మహబూనగర్ జిల్లాలో పెద్దవాగుపై కోయిల్ సాగర్ ఉంది. దీనికి 3 టీఎంసీల నీటి కేటాయింపు ఉండగా.. దేవరకద్ర, ధన్వాడ, కోయిల్ కొండ మండలాల్లో 20 వేల ఎకరాల సాగు భూమి ఉంది.

2014 నుంచి 2019 వరకు శ్రీశైలం, సాగర్ లలో నీటి వాడకం (టీఎంసీల్లో)

(రాష్ట్ర ఇరిగేషన్ విభాగం లెక్కల ప్రకారం)

ఏడాది                   తెలంగాణ     ఆంధ్రప్రదేశ్    37% వాటాలో మనకు దక్కింది

2014-15           180.935        448.128        28.76%

2015-16           43.390          68.330          38.84%

2016-17           101.405        306.009        24.89%

2017-18           118.704        306.339        27.93%

2018-19            49.980        359.341         29.45%