కొత్త మున్సిపల్ చట్టం: 75 గజాల స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవచ్చు

కొత్త మున్సిపల్ చట్టం పారదర్శకతతో పాటు ప్రజలకు హక్కును కల్పించిందన్నారు మంత్రి హరీష్ రావు. 75 గజాల స్థలం ఉంటే… దరఖాస్తు చేసుకుని ఇల్లు కట్టుకోవచ్చన్నారు. అధికారులు, చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు తప్పు చేస్తే సహించేది లేదన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతిని ప్రారంభించిన మంత్రి.. కాలనీలలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు.

వరంగల్ జిల్లాలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లికి నిరసన ఎదురైంది. వరంగల్ దేశాయిపేటలో జరిగిన కార్యక్రమంలో అభివృద్ది జరగలేదంటూ మంత్రిని నిలదీశారు స్థానిక నాయకులు. ఏ పనులు కావడం లేదని మంత్రిని ప్రశ్నించాడు ఓ నేత. సమస్యలపై చర్చించాలని పట్టుబట్టాడు. దీంతో ఆనేతపై మండిపడ్డారు ఎర్రబెల్లి. పిచ్చోడిలా ఉన్నాడనీ.. అక్కడినుంచి అతన్ని తీసుకెళ్లాలంటూ పోలీసులకు సూచించారు.

హుజూరాబాద్ పట్టణ ప్రగతిలో అధికారుల తీరుపై మండిపడ్డారు మంత్రి ఈటల రాజేందర్. రోడ్లు సరిగా లేవని,పారిశుద్య సమస్యలున్నాయంటూ స్థానికులు మంత్రికి ఫిర్యాదు చేయడంతో…అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. హుజురాబాద్ అభివృద్ధికి 40 కోట్లు ఇచ్చినా… ఎందుకు సద్వినియోగం చేయలేదని మున్సిపల్ అధికారులపై ఫైరయ్యారు. పట్టణ ప్రగతితో నగరాలు, పట్టణాల రూపురేఖలు మారుతాయని చెప్పారు.

స్మశాన వాటికలకు స్థలం లేనిచోట అటవీ భూమిని కేటాయిస్తామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కొమ్రంభీం ఆసీఫాబాద్ లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. పల్లె ప్రగతి స్పూర్తితో పట్టణ ప్రగతిని ప్రారంభించామన్నారు మంత్రి. సర్పంచులు, అధికారులు అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.

రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సమస్యలపై ప్రశ్నించారు మహిళలు. మంచినీటితో పాటు, డ్రైనేజీ ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తాము ఇబ్బందులు పడుతున్నా అధికారులు, నేతలు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. మంత్రి సర్దిచెప్పినా..మహిళలు వినిపించుకోలేదు.  ఖమ్మం పట్టణంలో మంత్రి పువ్వాడ అజయ్, సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి, కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక వీధుల్లో తిరుగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతొక్కరు విధిగా మొక్కలు నాటాలన్నారు మంత్రులు.

దవాఖానాకు వెళ్తే మందులు ఉండవు… డాక్టర్లు సరిగా చూడరు అంటూ సీఎస్ సోమేష్ కుమార్ కు కంప్లయింట్ చేశారు ఇబ్రహీంపట్నం వాసులు. ఇబ్రహీంపట్నంలో పట్టణ ప్రగతిని ప్రారంభించిన సందర్భంగా స్థానిక సమస్యలను తెలుసుకున్నారు సోమేష్ కుమార్. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై హుస్నాబాద్ లో ఎమ్మెల్యే సతీష్ ను నిలదీశారు జనం.

Latest Updates