ఈ డెబిట్/క్రెడిట్ కార్డులు 16లోపు వాడండి: లేదంటే సర్వీసులు బ్లాక్

భీమ్, ఫోన్ పే, గూగుల్ పే లాంటి యూపీఐ యాప్స్ వచ్చాక డెబిట్ కార్డులను నేరుగా వాడేవాళ్లు చాలా వరకు తగ్గిపోయారు. అంతా యాప్‌తో స్కాన్ చేసి పేమెంట్లు చేసేస్తున్నారు. అయితే ఇలా అలవాటు పడిపోయి.. మీరు డెబిట్ కార్డును అసలు వాడకుంటే ఉంటే ఇబ్బందులు తప్పవు. మీరు కార్డును కొనసాగించాలంటే ఈ నెల 16వ తేదీలోపు కాంటాక్ట్ లెస్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ తప్పనిసరిగా చేయాలి. లేదంటే శాశ్వతంగా మీ కార్డులో ఆ సేవలు పర్మినెంట్‌గా బ్లాక్ అయిపోతాయి. ఆ తర్వాత ఏటీఎం సెంటర్లు, స్వైపింగ్ ద్వారా మాత్రమే వాడుకునే వీలుంటుంది. కార్డుల సెక్యూరిటీ దృష్ట్యా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ నిర్ణయం తీసుకంది. ఈ ఏడాది జనవరి 15న దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది.

ఆన్‌లైన్/కాంటాక్స్ లెస్ ట్రాన్సాక్షన్స్ తప్పనిసరి

ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం డెబిట్ కార్డులతో పాటు క్రెడిట్ కార్డులకు కూడా ఆన్‌లైన్, కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్ చేయడం తప్పనిసరి. క్రెడిట్ కార్డు తీసుకుని ఇంత వరకు ఒక్కసారి కూడా ఆన్‌లైన్, కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్ చేయకుంటే మార్చి 16 లోపు అది పని చేయదు. ఈ రెండు సర్వీసులను ఆ తర్వాత కూడా వాడుకోవాలనుకుంటే ఒక్కసారైనా వాటిని వినియోగించి తీరాలి. లేదంటే మీ కార్డుపై ఆ సర్వీసులు డీఫాల్ట్‌గా బ్లాక్ అయిపోతాయి. ఆ తర్వాత మీ కార్డుతో ఆన్‌లైన్, కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్ చేయాలంటే మళ్లీ కొత్త డెబిట్/క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకుని, తీసుకోవాల్సి వస్తుంది. సెక్యూరిటీ దృష్ట్యా అన్ని క్రెడిట్/డెబిట్ కార్డు ఇష్యూయర్, బ్యాంకులకు ఈ ఆదేశాలను జారీ చేసింది ఆర్బీఐ. అలాగే ఈ ట్రాన్సాక్షన్లు చేస్తున్నప్పటికీ ఏవైనా కార్డులను రిస్కు ఆధారంగా నేరుగా బ్యాంకులే బ్లాక్ చేసేందుకు వీలు కల్పిస్తూ జనవరిలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో వాటికి సూచన చేసింది. అయితే ఇలా బ్లాక్ చేసేట్లయితే యూజర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇవ్వాలని పేర్కొంది. కార్డు యూజర్లు వాటి లిమిట్ లాక్ పెట్టుకోవడం, కార్డులను సొంతంగా బ్లాక్ చేసుకోవడం వంటి ఆప్షన్లను వారికి కల్పించాలని బ్యాంకులకు సూచించింది. 24/7 బేసిస్‌లో ఐవీఆర్, ఎస్ఎంఎస్, మొబైల్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి మార్గాల్లో ఈ ఆప్షన్లను వాడుకునే వీలుండాలని పేర్కొంది. పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007లోని సెక్షన్ 10(2) ప్రకారం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది ఆర్బీఐ.

కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్ అంటే

ఇటీవల డెబిట్, క్రెడిట్ కార్డులు వైఫై సింబల్‌తో వస్తున్నాయి. ఈ స్మార్ట్ కార్డులను స్వైపింగ్ మెషీన్లలో గీకాల్సిన పని లేదు. జస్ట్ పైన పెట్టి స్కాన్ చేస్తే రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా పేమెంట్ పూర్తవుతుంది. లేదా కొన్ని చోట్ల క్యూఆర్ స్కాన్ లాంటి మెషీన్‌తో కూడా ట్రాన్సాక్షన్ చేసే వీలుంటుంది. వీటినే కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్స్ అంటారు.

Latest Updates