రోజుకో మాట మాట్లాడే పార్టీ కాదు మాది

అవకాశవాద రాజకీయాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా CAA, NRC మీద రాహుల్, సోనియా నాయకత్వంలో కాంగ్రెస్ పోరాటం చేస్తోందన్నారు. తెలంగాణలో కూడా తాము పోరాటం చేస్తున్నామని,  సెక్యూలర్ దేశం కోసం పోరాడతామని ఉత్తమ్ తెలిపారు.

మతతత్వ పార్టీలతో కలిసి పనిచేస్తోన్న టిఆర్ఎస్ ఇప్పటి వరకు సీఏఏ పై స్పందించలేదని అన్నారు ఉత్తమ్. జీఎస్టీ, నోట్ల రద్దుకు మొదట మద్దతు తెలిపింది కేసీఆరేనని, మోదీని విమర్శించ వద్దని వితండ వాదం చేసిన వ్యక్తి కూడా కేసీఆరేనని ఆయన అన్నారు.

రాష్ట్రపతి ఎన్నికలప్పుడు దళిత దిగ్గజం జగ్జీవన్ రాం కూతురు మీరా కుమార్ కు మద్దతివ్వకుండా.. హిందూత్వవాది రామ్ నాథ్ కోవింద్ కు మద్దతు తెలిపిన వ్యక్తి కేసీఆర్ అని ఉత్తమ్ అన్నారు. ట్రిపుల్ తలాక్ విషయంలో కూడా కేసీఆర్ బీజేపీ కి మద్దతు ఇచ్చారన్నారు. వీటన్నింటినీ తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలని,  కేసీఆర్ చేస్తున్న అవకాశ రాజకీయాలను గమనించాలని ఉత్తమ్ కోరారు. రాజకీయంగా లబ్ది జరిగినా, నష్టం జరిగినా తమ పార్టీ రోజుకో మాట మాట్లాడదని ఆయన అన్నారు. 28న మేము నిర్వహించ తలపెట్టిన ర్యాలీ కి ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదని ఉత్తమ్ ఈ సందర్భంగా అన్నారు.

Latest Updates