బీజేపీ మంత్రికి క‌రోనా పాజిటివ్: ఆయ‌న ఫ్యామిలీ.. స్టాఫ్ స‌హా 22 మందికి..

క‌రోనా వైర‌స్ చిన్నా పెద్దా.. రాజు పేద‌ అన్న తేదా లేకుండా అందరికీ అంటుకుంటోంది. ఉత్త‌రాఖండ్ రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి స‌త్పాల్ మ‌హ‌రాజ్ కు క‌రోనా పాజ‌టివ్ వ‌చ్చింది. బీజేపీకి చెందిన ఆ సీనియ‌ర్ మంత్రి స‌హా ఆయ‌న భార్య అమృతా రావ‌త్‌, కుబుంబ‌స‌భ్యులు, సిబ్బంది క‌లిపి మొత్తం 22 మందికి వైర‌స్ సోకింది. వీరంద‌రినీ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స చేస్తున్న‌ట్లు ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వ చీఫ్ సెక్రెట‌రీ ఉత్ప‌ల్ కుమార్ సింగ్ తెలిపారు.

ఉత్తరాఖండ్ పర్యాట‌క‌ శాఖ మంత్రి సత్పాల్‌ మహరాజ్‌ భార్య అమృత రావత్‌కు కరోనా సోకిన‌ట్లు నిన్న‌నే నిర్ధారించారు వైద్యులు. నాలుగు రోజులుగా జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న ఆమెకు ప‌రీక్ష‌లు చేయ‌గా పాజ‌టివ్ వ‌చ్చింది. దీంతో మంత్రి స‌హా కుటుంబ‌స‌భ్యులు, ఆయ‌న సిబ్బంది, వారిని క‌లిసిన వారు క‌లిపి మొత్తం 41 మంది హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. వీరి శాంపిల్స్ సేక‌రించి టెస్టులు చేయ‌గా.. 21 మందికి పాజిటివ్ వ‌చ్చింద‌ని ఆదివారం అధికారులు ప్ర‌క‌టించారు. కాగా, మంత్రి స‌త్పాల్ మ‌హ‌రాజ్ శుక్రవారం ప‌లు అధికారిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ఆయ‌న‌ను క‌లిసిన వారంతా క్వారంటైన్ లోకి వెళ్లాల‌ని అధికారులు సూచించారు. ఉత్తరాఖండ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 649 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అందులో ఐదుగురు మ‌ర‌ణించ‌గా.. 102 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం 642 మంది చికిత్స పొందుతున్నారు.

Latest Updates