తెలంగాణ వచ్చినా మళ్ల అదే లొల్లి..ఎవరెలా మారినా వాస్తవం మారదు

మన దక్షిణ తెలంగాణకు దాహం తీర్చి, పచ్చని పంటలకు నీళ్లివ్వాల్సిన కృష్ణమ్మకు కొత్త సమస్య వచ్చిపడింది. మనకు రావాల్సిన నీళ్లనే మనం సరిగ్గా వాడుకోలేని దుస్థితి ఉంటే.. ఇంకో దిక్కు కొత్తగా నీళ్లు మళ్లించే ప్రయత్నాలు మన రైతుల్ని ఆవేదనకు గురిచేస్తున్నాయి. దీని గురించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో కృష్ణా నదిపై ఏపీ సర్కారు కొత్తగా నీళ్లను లిఫ్ట్ చేయాలనుకుంటున్న ప్రదేశంపై V6 గ్రౌండ్ రిపోర్ట్ కోసం వెళ్లాను. నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల గ్రామం చేరుకున్నాను. ఈ గ్రామం శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తీరంలో ఉంది. తీరానికి బాగా ఎత్తులో ఊరుంటే ఎండాకాలం కావడం వల్ల కృష్ణలో ప్రవాహం తక్కువగా ఉంది. పూర్తి ప్రవాహం వచ్చినప్పుడు కృష్ణమ్మ గుర్తులు ఇక్కడి గుట్టలపై స్పష్టంగా కనిపిస్తాయి.

కృష్ణా నీళ్లే పెద్ద దిక్కు..

కాలం కలిసొచ్చినప్పుడు ఇంతెత్తున ఉప్పొంగి ప్రవహించే కృష్ణా నది నీళ్లే మన పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతులకు పెద్ద దిక్కు. దశాబ్దాలుగా మన నీళ్లు మనకు దక్కకపోవడమే మన పాలమూరును కరువుకు మారుపేరుగా మార్చింది. వలసలకు పుట్టిల్లుగా నిలబెట్టింది. ఈ నీళ్లు అందకే మన నల్గొండ బిడ్డలు ఫ్లోరైడ్ బాధితులుగా మారారు. దీని కోసమే మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఆరేండ్లు అయ్యింది. రెండేళ్లకుపైగా కృష్ణమ్మకు పెద్ద స్థాయిలో వరదలొచ్చాయి. అయినా మనకు న్యాయంగా రావాల్సిన నీళ్లను ఇప్పటికీ వాడుకోలేకపోతున్నాం. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకోలేకపోయాం. ఈ కష్టానికి తోడు ఇప్పుడు ఏపీ సర్కారు కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. శ్రీశైలం ప్రాజెక్టు వెనుక నుంచి రాయలసీమకు నీళ్లిచ్చే పోతిరెడ్డిపాడు డైవర్షన్ కెనాల్ కెపాసిటీని భారీగా పెంచుతోంది. హక్కు లేకున్నా తక్కువ ఎత్తు నుంచి నీళ్లు మలుపుకునే ప్రయత్నం వల్ల మన తెలంగాణ నీళ్లకు భారీగా గండి పడుతుంది. ఇలా లోతు నుంచి నీళ్లు లాక్కోవడానికి ఏపీ సర్కారు సంగమేశ్వరం దగ్గర కొత్త ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రతిపాదించింది. సోమశిల గ్రామం నుంచి కాస్త దూరంలో నది మధ్యలో గుట్టపై ఉంటుంది సంగమేశ్వరుడి ఆలయం. దీనికి దగ్గరలోనే ఏపీ సర్కారు ప్రాజెక్టు కట్టాలనుకుంటోంది. కృష్ణమ్మ ప్రవాహం పెరిగినప్పుడు నీళ్లలో మునిగిపోయి ఉండే సంగమేశ్వర ఆలయం ఎండాకాలంలో రెండుమూడు నెలలే కనిపిస్తుంది. ఈ టైంలోనే భక్తులు దర్శించుకుంటారు.

దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం

నేను సోమశిల నుంచి బోటులో సంగమేశ్వరానికి చేరుకున్నాను. పూర్తి ప్రవాహం ఉన్నప్పుడు గుట్టలు మునిగిపోతాయి కాబట్టి వాటి కింది భాగంలో చెట్లు పెరగలేవు. గుట్టల పైభాగంలో పెరిగిన చెట్లు ప్రవాహం ఎత్తుకు గుర్తులుగా కనిపిస్తాయి. ఇన్ని నీళ్లను మోసుకొచ్చే కృష్ణమ్మ మన నేలను ఇప్పటికీ పూర్తిగా తడపలేకపోతోంది. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు, సంగమేశ్వర లిఫ్ట్ లను ఏపీ సర్కారు అనుకున్నట్లు చేస్తే.. దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని మన ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. ఒక రకంగా శ్రీశైలం రిజర్వాయర్ కు గర్భం లాంటిది సంగమేశ్వరం. ఇక్కడ లిఫ్ట్ పెట్టి తోడేస్తే ముందున్న శ్రీశైలానికి చుక్కనీరు పోదు. పైనుంచి నీళ్లు పడుతుంటే బిందె అడుగున పొక్కకొట్టి, నీళ్లు లాగడం లాంటిదే ఇది. బాగా లోతు నుంచి ఏపీ సర్కారు నీళ్లను తోడుకోవడం వల్ల మనకు వచ్చే నీళ్లూ తగ్గుతాయంటున్నారు. శ్రీశైలం నీళ్లను ముందే మలుపుకుంటే నాగార్జున సాగర్‌‌‌‌కూ ప్రవాహం తగ్గే అవకాశం ఉంది.

మన నీళ్లు మనకే వస్తాయనుకున్నా..

జలదోపిడీ మీద తెలంగాణ ఉద్యమం టైమ్‌‌‌‌లో V6 న్యూస్ లో ఎన్నో డిబేట్ లు చేసిన. లీడర్ల మధ్య నీళ్ల చర్చలో ఎన్నో విషయాలు బయటపడేవి. కృష్ణాలో వాటాలు అటుంచితే మిగులు జలాల పేరుతో ఆంధ్ర లీడర్లు శ్రీశైలం బ్యాక్ వాటర్ లో లిఫ్టులు పెట్టి ఒకవైపు, పోతిరెడ్డిపాడు ద్వారా మరోవైపు చేసిన జల దోపిడిపై వాడివేడి చర్చ జరిగేది. రాష్ట్రం వచ్చాక ఇక ఇలాంటి డిబేట్ల అవసరం తీరిపోయిందని అనుకున్న. మన నీళ్లు మనకే వస్తాయని, మన సర్కారు కాపాడుతుందని భావించాను. కానీ మళ్ల అదే లొల్లి. అందుకే సంగమేశ్వరాన్ని చూడగానే గతమంతా గుర్తొచ్చి నా పానం కలుక్కుమంది.

అన్యాయానికి సాక్ష్యం

పోతిరెడ్డిపాడు గురించి విన్నది, చదివింది, తెలుసుకుంది ఒకెత్తయితే అక్కడికి పోయి చూసింది మరో ఎత్తు. మనకు జరిగిన, జరుగుతున్న అన్యాయానికి సాక్ష్యంగా కనిపిస్తుందీ ప్రాజెక్టు. దీన్నే ఆయుధంగా వాడి రాష్ట్రం సాధించుకున్నాం. ఆదే ఆయుధంతో అధికారంలోకి వచ్చిన వాళ్లు  ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. మేమిప్పుడు మాట్లాడం అని సూటిగానే చెబుతున్నారు. అప్పు డు ఆంధ్ర లీడర్లపై పెడబొబ్బలు పెట్టినవాళ్లు ఇప్పుడు తెలంగాణ మేధావులు, ప్రతిపక్షాలపైనే గరమవుతున్నారు. ఎవరెలా మారినా వాస్తవం మారదు. సమస్య తీరదు. తెలంగాణ జనం వాయి స్ గా ఉద్యమంలో V6 తనదైన పాత్ర పోషించింది. ఇప్పటికీ ఆ అవసరం తీరిపోలేదని సంగమేశ్వరాన్ని చూశాక నాకు అనిపించింది.

– సంగప్ప, ఇన్​పుట్​ ఎడిటర్, V6 న్యూస్

800 అడుగుల లెవెల్ నుంచి కృష్ణ నీళ్లు తోడుకుంటం

Latest Updates