పరిహారం పైసలు అప్పులకే.. గౌరవెల్లి, గండిపల్లి నిర్వాసితుల గోడు

  • పాత అప్పులు దీర్చినరు
  •  కొందరేమో వేరే ఊళ్లో ఇళ్లు, పొలాలు కొన్నరు
  • బిడ్డల పెండ్లి చేసినోళ్లు ఇంకొందరు
  • ఇల్లు కొనలేక, కట్టుకోలేక కొందరి తిప్పలు
  •  రెండు చోట్ల నిర్వాసితులైనవారున్నరు
  •  భూమి, ఇల్లు పోతే.. ఒక్కదానికే పరిహారం
  • గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ల నిర్వాసితుల వెతలు
  • ముంపు గ్రామాల ప్రజల స్థితిగతులపై‘V6, వెలుగు’ పరిశీలన

రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు పరుగులుపెడుతున్నాయి . ప్రాజెక్టులకు రీ డిజైన్లు. రీ ఇంజనీరింగ్ లు అవుతున్నాయి . ఊళ్లూ మునుగుతున్నాయి . ఇల్లు. భూమి.గొడ్డు . గోదా. ఇలా సర్వం కోల్పోయి న వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం పరిహారం అందిస్తోంది.అయితే సర్కారిస్తున్న పరిహారాన్ని నిర్వాసితులు ఎట్లా వినియోగించుకుంటున్నారు? వారి జీవితాలకు అవి అట్లా ఉపయోగపడుతున్నాయి ?.. ఇట్లాంటి వివరాలు తెలుసుకునేందుకు ‘V6, వెలుగు బృందం’సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం లోని గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ల ముంపు గ్రామాల ప్రజలతో మాట్లాడింది.

ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. గత ప్రభుత్వాలతో పోలిస్తే మెరుగైన పరిహారాన్ని అందిస్తోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్మిస్తున్న గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ల ముంపు గ్రామాల ప్రజలకు ఇటీవల పరిహారం అందించింది. ప్రభుత్వం ఇచ్చిన పరిహారంతో బిడ్డలవివాహాలకే ఎక్కువ మంది ఖర్చు చేసినట్లు తెలిసింది.రిజర్వాయర్ కు చుట్టు పక్కన ఉన్న గ్రామాల్లో కొందరు అప్పులు చేసి భూములు కొన్నారు. మరి కొందరు పక్కగ్రామాల్లో ఇండ్లు నిర్మించుకున్నారు. దీనికి అప్పు చేసుకున్నారు. చాలా తక్కువ మంది బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకున్నారు. భూములు కొందామంటే సరిపడాడబ్బులు లేని వారు, ఓ మోస్తరు ఇల్లు నిర్మిం చుకోలేని వారు బ్యాంకుల్లో పెట్టు కున్నట్లు వీ6 వెలుగు బృందందృష్టికి వచ్చింది.

ఇచ్చిన బయానా పోయింది

ప్రభుత్వం రీడిజైన్ పరిహారాన్ని ఎకరాకు రూ.6 లక్షలకుపైగా పెంచింది. ఆర్ అండ్ ఆర్ పాలసీ కూడా అమలు చేస్తామని చెప్పింది. అయితే ప్రభుత్వ పరిహారం చాలక ఇచ్చిన బయానాలు కూడా పోయాయని గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితుడు నూనె మల్లేశం చెప్పాడు.తమకు ఎకరాకు ఆరు లక్షల వరకు వచ్చాయని,కానీ బయట ఎకరాకు పది లక్షల వరకు చెప్తున్నారని అన్నారు. సకాలంలో అప్పు దొరక్క, ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి పరిహారం (ఆర్ అండ్ ఆర్‌ పాలసీ) అమలుకాక తాను రూ.ఐదు లక్షల బయానా నష్టపోయా-నని చెప్పారు. ‘‘రెండు ఎకరాల భూమికి బయానా ఇచ్చిన. బయట అప్పు దొరకలే. ప్రభుత్వం నుండిపూర్తి స్థాయిలో పరిహారం అందలే. దీంతో బయానాపోయింది” అని సొమాజి తండాకు చెందిన భంగా భూక్యా ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు సార్లు నిర్వాసితులు

గండిపల్లి, గౌరవెల్లి రిజర్వాయర్ల కింద చాలా చోట్ల ప్రజలు రెండు సార్లు నిర్వాసితులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓ సారి, తెలంగాణ వచ్చిన తర్వాత చేసిన రీ డిజైన్ తో మరోసారి భూములు, ఇండ్లు కోల్పోయారు.

గౌరవెల్లి రిజర్వాయర్ కింద గుడాటిపల్లి, తెనుగుపల్లి, మద్దెలపల్లి, కొట్టిపల్లి గ్రామాలు పూర్తిగా ముంపుకు గురవుతున్నాయి. గౌరవెల్లి, గండిపల్లి,జనగామం, రేగొండ, నందారం గ్రామాలు పాక్షికంగా ముంపుకు గురవుతున్నాయి. ఆరు తండాలు పూర్తిగా మునిగిపోతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో గౌరవెల్లి రిజర్వాయర్ కోసం 2,030 ఎకరాలు సేకరించారు. రీడిజైన్ చేసి తర్వాత పాతది కలుపుకుని మొత్తం3,845 ఎకరాలు సేకరించారు. దీని కింద 799 నివాస సముదాయాలు మునిగిపోతున్నాయి.

గండిపల్లి రిజర్వాయర్ కింద మొదట 150 మంది రైతులవద్ద నుండి 300 ఎకరాలు మాత్రమే సేకరిం చారు. రీ డిజైన్ తర్వా త మరో వెయ్యి ఎకరాలు సేకరించారు. గండిపల్లి ఊరు మిగిలింది. పొలాలు మునిగిపోయాయి. 17 తండాలు పూర్తిగా ముంపుకు గురవుతున్నాయి.

కరీంనగర్ కు కూలికి

‘‘ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం రిజర్వా యర్లనిర్మాణం కోసం భూ సేకరణ చేసి ఎకరాకు రెండున్నరలక్షల చొప్పున ఇచ్చింది. ఈ పరిహారాన్ని అన్నదమ్ములం పంచుకున్నాం. వాటితో పాత అప్పులు తీర్చుకున్నాం ” అని గండిపల్లి గ్రామానికి చెందిన బందారం రాజయ్య చెప్పారు. ‘‘గండిపల్లి రిజర్వాయర్ కింద భూములు పోయాయి. వచ్చిన డబ్బులతో అప్పులకు పోగా మిగిలిన దాంతో జీవనం సాగిస్తున్నం . ఇప్పుడు అవి కూడా అయిపోయాయి’’ శ్రీనివాస్ చెప్పారు. గ్రామస్తులు రోజూ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్ కు కూలీ కోసం వెళ్తున్నారని చెప్పారు. అందరికీ పరిహారం ఇవ్వా లని, ఆర్ అండ్ ఆర్ పాలసీని పక్కాగా అమలు చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు.

భూమికిస్తే ఇంటికి లేదు… ఇంటికిస్తే భూమికి లేదు

‘‘ప్రభుత్వ పరిహారం భూమికి ఇస్తే ఇంటికి ఇవ్వలేదు.. ఒకవేళ ఇంటికి ఇస్తే భూమికి ఇవ్వలేదు’’ అని గౌరవెల్లి రిజర్వా యర్ నిర్వాసిత గ్రామాలు,తండాల్లో చాలా మంది చెప్తున్నారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో భూ సేకరణ చేసినప్పుడు పాక్షిక నిర్వాసితులం. అప్పట్లో గౌరవెల్లి రిజర్వాయర్ కు పై భాగంలో భూములు కొన్నాం . ఇండ్లు కట్టుకున్నాం . అయితే రీ డిజైన్ చేసిన తర్వాత అవీ కోల్పోయాం ”అని గుడాటిపల్లి గ్రామ సర్పంచ్ రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం కోసం ప్రభుత్వం జీవో నంబర్ 23, జీవో నంబర్ 68 తీసుకొచ్చిందని, వాటి ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. పద్దెనిమిదేండ్లు నిండిన వారందరికి ఆర్ అండ్ ఆర్ అమలు చేస్తే కొంతైనా అప్పులబారిన పడకుండా అవుతామని చాలా మంది నిర్వాసితులు చెప్పారు.

 

 

Latest Updates