ఇది వెరైటీ.. హెల్మెట్ కే ఆర్సీ, లైసెన్స్ అంటించాడు

కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజల్లో చైతన్యం వచ్చింది. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతూ.. సేఫ్ జర్నీ చేస్తున్నారు. అంతేకాదు ఈ చట్టం వల్ల జనం వినూత్నంగా ఆలోచిస్తూ కొత్త ఆలోచనలకు తెరతీస్తున్నారు.

గత కొద్ది రోజులుగా, కొత్త చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్న సందర్భాలు అనేకం. ఈ జరిమానాల నుండి తనను తాను రక్షించుకోవడానికి, వడోదరకు చెందిన ఒక వ్యక్తి కాస్త తెలివిగా వ్యవహరించాడు. అతను చేసిన పని ట్రాఫిక్ పోలీసులకు కూడా బాగా నచ్చింది.

రామ్ షా అనే ఇన్సూరెన్స్ ఏజెంట్ తన విధుల నిమిత్తం ప్రతీరోజూ ఒకచోట నుంచి మరో చోటుకి వెళ్లాల్సి ఉంటుంది. తన ప్రయాణంలో ఎక్కడైనా పోలీసులు ఆపి తన లైసెన్స్ వివరాలు తెలపాలంటే ప్రతీ సారి వాటి చూపించలేక ఓ పరిష్కారం కనుగొన్నాడు. తన డ్రైవింగ్ లైసెన్స్‌, బైక్ యొక్క ఆర్‌సి, ఇన్సూరెన్స్ స్లిప్ మరియు పియుసి సర్టిఫికెట్‌లను తన హెల్మెట్‌పై అతికించాడు.ఇలా చేయడం వల్ల  ఎవరైనా ట్రాఫిక్ పోలీసు అధికారి దారిలో ఆపినా.. ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదని చెబుతున్నాడు రామ్ షా.  పత్రాలన్నీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం వల్ల ఎలాంటి జరిమానా కూడా చెల్లించాల్సిన అవసరం లేదని అంటున్నాడు.

మరికొన్ని రోజుల్లో, గుజరాత్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో కొత్త ట్రాఫిక్ నిబంధనలు విధించనుంది. ఈ నిబంధనల ప్రకారం, వాహనాలను నడుపుతున్న వ్యక్తులు నిబంధనలను ఉల్లంఘిస్తే వారికి భారీ జరిమానా విధించబడుతుంది.

కొత్త ట్రాఫిక్ నిబంధనలపై విజయ్ రూపానీ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం సమావేశం ఏర్పాటు చేసింది. అయితే, కేంద్రం కేటాయించిన జరిమానాలు అలాగే ఉంటాయా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

Latest Updates