జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్‌ని వాడుకుని వదిలేయలేదా?

  • సెల్‌ఫోన్ కనిపెట్టారుగా.. ఆ టెక్నాలజీ కూడా కనిపెట్టండి
  • వరదల్లో ఇసుక తీసే సాంకేతిక పరిజ్ఞానం కనిపెట్టండి
  • ఆ శక్తి మీకు దేవుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా
  • టీడీపీ అధినేత చంద్రబాబుపై పార్టీ మాజీ నేత వంశీ సెటైర్లు

విజయవాడ: ఇటీవల తెలుగు దేశంపార్టీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి దూరంగా ఉంటానని ప్రకటించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లోఉన్న చంద్రబాబు కనీసం ఆరు నెలలు కూడా అధికారం లేకుండా ఉండలేకపోతున్నారని ఆరోపించారు. అపార అనుభవం ఉన్న ఆయన ప్రతిపక్ష నేత పాత్ర సమర్థంగా పోషించలేకపోతున్నారన్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన రైతు రుణమాఫీ హామీ అమలు మన చేతిలోనే ఉన్నా ఎంత ఘోరంగా ఫెయిల్ అయ్యామనేది బుద్ధీ జ్ఞానం ఉన్న అందరికీ తెలుసని అన్నారు. మరి మన చేతిలో లేని, ప్రకృతి మీద ఆధారపడ్డ ఇసుక లభ్యత, కొరతని రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు వంశీ. అకాల వర్షాలు, అతివృష్టి, వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కూడా నదులు, కాలువల్లో ఇసుకను వెలికితీసే సాంకేతిక పరిజ్ఞానాన్ని కనిపెట్టండన్నారు. సెల్‌ఫోన్, కంప్యూటర్‌లను కనిపెట్టినట్లుగానే ఈ టెక్నాలజీని కూడా కనిపెట్టే శక్తి మీకు ఆ భగవంతుడు ప్రసాదించాలని తాను ప్రార్థిస్తానంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.

ఇంగ్లిషు మీడియం పేదల పిల్లలకొద్దా?

‘‘మీ పిల్లలు, నా పిల్లలు, డబ్బున్నవారందరి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటున్నాం. మరి పేదవారి పిల్లలు మాత్రం తెలుగు మీడియంలోనే చదవాలా? ప్రభుత్వం ఉచితంగా చదివిస్తానంటే మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోం అని చెబుతున్నారా? లేక తల్లిదండ్రులు వారి పిల్లలకు ఇంగ్లీష్ అవసరం లేదని మీకు చెబుతున్నారా? తెలుగును కాపాడే ధర్మం, బాధ్యత మనమీద లేదా? పేదవాళ్లు ఒక్కరిమీదే ఉందా? నీతులు చెప్పడానికేనా? ఆచరించడానికి కాదా? మన పిల్లలకు ఒక న్యాయం, పేదపిల్లలకు మరో న్యాయమా?’’ అంటూ చంద్రబాబును ప్రశ్నించారు.

అది ఓటుకు నోటు కేసు భయమేనా?

‘‘తెలంగాణాలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల ఉద్యమంలో మీరు, మీ కుమారుడు ఎందుకు పాల్గొనడంలేదు? కారణం ఓటుకు నోటు కేసు కాదా? ఆంధ్రప్రదేశ్ లో ఇసుక గురించి ఇంత దీక్ష అవసరమా? ఈ ప్రభుత్వానికి పురిటివాసన అయినా పోయిందా? ఆ రాష్ట్రంలో ఒక ధర్మం, ఈ రాష్ట్రంలో మరో ధర్మమా?’’ అని నిలదీశారు వంశీ. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకుని ప్రభుత్వం చేసే మంచి పనులను గుడ్డిగా వ్యతిరేకించకుండా మద్దతు పలుకుదామని హితవు చెప్పారు. ‘లేకుంటే మీరు, మీ పుత్రరత్నం, మీ సలహాదారులు ముంచేసే ఈ టీడీపీ పడవను సాక్షాత్తు ధర్మాడి సత్యం కూడా వెలికితీయలేరు’ అని అన్నారు. ఇసుక దీక్షల్ని దొంగ దీక్షలంటూ కామెంట్స్ చేశారాయన.

జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్‌ని వాడుకుని వదిలేయలేదా?

సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి మద్ధతిస్తే తనకు వ్యక్తిగతంగా ఎటువంటి లాభం లేదని, పేద ప్రజలకు మాత్రం మంచి జరుగుతుందని అన్నారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. పేదవాడికి, నియోజకవర్గ అభివృద్ధికి సాయం చేయడానికి తన ఎమ్మెల్యే పదవే అడ్డు అనుకుంటే రాజీనామా చేసైనా సేవకుడిగా మిగులుతానని అన్నారు. పార్టీలో మంచి చెప్పేవాళ్లను చంద్రబాబు పట్టించుకోకుండా బయటకు పంపేస్తున్నారని, మాయమాటలు చెప్పినవారు చెవిలో జోరీగల్లా హల్‌ఛల్ చేస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు ఒకలా, తర్వాత ఒకలా వ్యవహరిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు వంశీ. 2009 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేసిన జూనియర్‌ ఎన్టీఆర్, 2014 ఎన్నికల్లో మద్దతు పలికిన పవన్‌కల్యాణ్ ఆ ఎన్నికల తర్వాత ఏమయ్యారని, ఇది వాడుకుని వదిలేయడం కాదా అని ప్రశ్నించారు. బీజేపీ విషయంలోనూ ఇలాగే వ్యవహరించారని అన్నారు.

Latest Updates