ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

  • రాజకీయాలనుంచే తప్పుకుంటున్నానని ప్రకటన
  • టీడీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా
  • కారణాలు వివరిస్తూ చంద్రబాబుకు లేఖ

అమరావతి: టీడీపీ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. నిన్నటి వరకు ఆయన టీడీపీకి రాజీనామా చేసి.. వైసీపీ లేదా బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆ ప్రచారానికి భిన్నంగా ఆయన ఇవాళ నిర్ణయం తీసుకున్నారు.  యువనేతగా ఉండగానే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి, శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుకు తన రాజీనామా లేఖను పంపారు వంశీ. తాను రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో ఆ లేఖలో వివరించారు.

అనుచరుల కోసమే వైదొలుగుతున్నా

ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు రెండుసార్లు అవకాశమిచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు వంశీ. ప్రజలకు ఇచ్చిన హామీలను టీడీపీ హయాంలో చాలా వరకు నేరవేర్చానని, నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేశానని తన లేఖలో తెలిపారు. 2019 ఎన్నికల్లో అతికష్టం మీద గెలవాల్సి వచ్చిందన్నారు. స్థానిక వైసీపీ నేతలు, కొందరు ఉద్యోగులు తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నారని, అయినా విజయం సాధించారని చెప్పారాయన. ఎన్నికల తర్వాత అనేక సమస్యలు చుట్టుముట్టాయని, రాజకీయంగా వేధింపులు పెరిగాయని, అనుచరులపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనుచరులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే తాను రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని వల్లభనేని వంశీ లేఖలో వివరించారు.

కొద్ది రోజుల క్రితం అటు బీజేపీ నేత సుజనా చౌదరితోనూ, ఇటూ వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డితోనూ భేటీ అయిన వల్లభనేని వంశీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎవరూ ఊహించలేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కృష్ణా జిల్లాలో బలమైన యువనేత అయిన వంశీ పార్టీ నుంచి తప్పుకోవడం టీడీపీకి షాక్ లాంటిదే అయినా.. ప్రస్తుతానికి వేరే పార్టీలో చేరకపోవడం కొంత రిలీఫ్ అంటున్నారు.

 

Latest Updates