బిందెడు నీళ్లకోసం అర్ధరాత్రి పడిగాపులు:గుజరాత్ లో మహిళల కష్టాలు

ఈ ఊరు .. ఆ జిల్లా .. వేరే రాష్ట్రం అన్నట్టు కాదు. దాదాపు దేశమంతటా ఎండాకాలం నీళ్ల కరువు జనాన్ని తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. గుజరాత్ రాష్ట్రం వల్సాద్ జిల్లాలో బిందెడు నీళ్లకోసం అర్ధరాత్రి పడిగాపులు పడుతున్నారు అక్కడి మహిళలు.

ధర్మాపూర్ తెహ్సీల్ .. కొర్వాడ్ గ్రామం అది. మహిళలు అర్ధరాత్రి నీళ్లకోసం బయల్దేరారు. ఒక్కొక్కరు ఒక్కో బిందె నెత్తిన పెట్టుకుని.. వెళ్లారు. నల్లాలున్నా అక్కడ నీళ్లు రావు. అందుకే అందరూ ఊరి చివర ఉన్న ఓ బోరింగ్ పంప్ దగ్గరకు క్యూ కట్టారు. కొట్టుడు కొట్టుకుంటూ పోతే అదొక్కదాంట్లోనుంచే నీళ్లొస్తాయక్కడ. అందరూ అక్కడికే పోతే.. అక్కడ సీన్ ఊహించుకోండి.

20, 30 మంది .. పిల్లా జెల్లా.. అందరూ బిందెలు పట్టుకుని అక్కడ క్యూలైన్ లో నిలబడతారు. ఒక్కొక్కరు బోరింగ్ సహాయంతో బిందెల్లో నీళ్లు నింపుకుని.. వెళ్తుంటారు. అలా.. ఒక్కొక్కరు కనీసం 2 గంటల పాటు నీళ్ల కోసం అర్ధరాత్రి అష్ట కష్టాలు పడుతున్నారు. దొరికిన ఒకట్రెండు బిందెడు నీళ్లతోనే రోజు గడుపుకుంటున్నారు.

ఆ గ్రామంలో జనం అవస్థలు తెల్సుకున్న మీడియా వారిని పలకరించింది. రాత్రిపూట ఎందుకు వెళ్తున్నారని అడిగారు. పగలైతే.. నీళ్లు ఎక్కువగా రావు అని వారిలో కొందరు చెప్పారు. తమ ప్రాంతంలో నీళ్ల కరువు బాగా ఉందన్నారు. పగటిపూట కూలిపనికి వెళ్తాం… రాత్రిపూట నీళ్ల కోసం ఇక్కడకు వస్తాం అని మరికొందరు చెప్పారు.

పగలు పొట్టకూటి కోసం అష్ట కష్టాలు.. రాత్రి దూప(దాహం) తీర్చుకునేందుకు పడిగాపులు పడుతున్నామన్నారు. ఏళ్లుగా తమ పరిస్థితి ఇంతేనని అక్కడి మహిళలు బాధపడుతూ చెప్పారు.
దేశమంతటా ఇదే పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో పేదల బతుకులు, నీళ్ల కోసం పడే కష్టాలు పట్టించుకునే వాడే కరువయ్యాడని జనం సీరియస్ అవుతున్నారు.

Latest Updates