కువైట్‌ నుంచి విజ‌య‌వాడ‌ చేరుకున్న 145 మంది మ‌హిళ‌లు

క‌రోనా నేప‌థ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెన‌క్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రెండో దశ ‘వందే భారత్‌ మిషన్‌’లో భాగంగా కువైట్ నుంచి బయలుదేరిన విమానం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుంది. మొత్తం 145 మంది మహిళలు గురువారం సాయంత్రం గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి చేరుకుఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీరంతా ఉపాధి కోసం కువైట్ కు వెళ్లిన‌ట్లు అధికారులు చెప్పారు. వీరిలో కడప, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాలకు చెందిన మహిళలు ఎక్కుగా ఉన్నారు. వీరందరికీ థర్మల్ పరీక్షలు చేసి.. నూజివీడులో ఏర్పాటు చేసిన క్వారెంటైన్ కేంద్రానికి తరలించాలని అధికారులు నిర్ణయించారు.

శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కువైట్ నుంచి మరో విమానం రానుందని ఏపీ ఎన్ఆర్‌టీ ప్రెసిడెంట్‌ మేడపాటి వెంకట్‌ తెలిపారు. వారి వసతి కోసం ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఉపాధి కోసం కువైట్‌ వెళ్లి లాక్‌డౌన్‌ కారణంగా ఆ దేశంలో చిక్కుకున్న ఏపీ వాసులను స్వరాష్ట్రానికి తీసురావడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించార‌న్నారు. ఈ విషయంపై కేంద్ర విదేశాంగశాఖకు సీఎం లేఖ రాశారని, ఏపీ వాసులను తరలించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరార‌ని చెప్పారు. సీఎం జగన్‌ లేఖపై స్పందించిన కేంద్ర విదేశాంగ శాఖ వెంటనే ఏపీ వాసులను తరలించేందుకు ఏర్పాట్లు చేసింద‌న్నారు.

Latest Updates