కరోనాపై పలు సినిమా టైటిల్స్ రిజిష్టర్

కాదేదీ కవితకు అనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. కాదేది టైటిల్‌కి అనర్హం అంటారు మన ఫిల్మ్ మేకర్స్. ఇప్పటికే రకరకాల వింత టైటిల్స్ వాడేసిన వీరి కలం నుండి, కెమెరా చూపు నుండి ‘కరోనా’ వైరస్ కూడా తప్పించుకోలేకపోతోంది. ప్రస్తుతం ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్‌గా హాట్ టాపి‌క్ ‘కరోనా’నే కనుక ఆ క్రేజ్ క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం టైటిల్స్​లో ‘కరోనా’ని జొప్పించడంతో పాటు ఈ కంత్రి వైరస్ చుట్టూ కథలల్లేస్తున్నారు. అరుదైన వ్యాధుల చుట్టూ కథలు అల్లడం దక్షిణాది సినిమాలకు కొత్తేమి కాదు. కానీ ‘కరోనా’పై కాన్సన్‌ట్రేట్ చేసిన క్రెడిట్ మాత్రం బాలీవుడ్‌కే ఇచ్చి తీరాలి. ‘కరోనా ప్యార్ హై’ అంటూ ఇటీవల బాలీవుడ్ ఓ టైటిల్ రిజిస్టర్ అయింది. వినడానికి హృతిక్ సినిమా ‘కహోనా ప్యార్ హై’ని గుర్తు చేస్తున్న ఈ టైటిల్‌ని రిజిస్టర్ చేసింది ఈరోస్ ఇంటర్నేషనల్ లాంటి ప్రముఖ చిత్రనిర్మాణ సంస్థ కావడం విశేషం. పైగా ఇదో గుండెను పిండేసే ప్రేమకథా చిత్రమని, స్క్రిప్ట్ ట్యూనింగ్ పూర్తవగానే సెట్స్​కే అని నిర్మాతలు చెప్పడం కొసమెరుపు. అలాగని ఇదేదో రాబోయే ఏప్రిల్ ఫస్ట్​కి ఇప్పటి నుండే ఆడియన్స్​ని పూల్స్ చేయడానికేసిన కామెడీ ప్లాన్ అనుకోడానికి లేదు. టైటిల్ రిజిస్టర్ వ్యవహారం నిజమేనని ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కన్ ఫర్మ్ చేసింది.

మరోవైపు ‘డెడ్ లీ కరోనా’ అనే టైటిల్‌తో సహా ‘కరోనా’ పేరు కలిసొచ్చేలా రకరకాల టైటిల్స్ తమ వద్ద రిజిస్టర్ అవుతున్నట్టు ‘ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్’ కూడా తెలిపింది. ఓ వైపు బాలీవుడ్ ‘సూర్య వంశీ’ లాంటి చిత్రాలు కరోనా దెబ్బకు వాయిదా పడుతుంటే.. అక్కడి ఫిల్మ్ మేకర్స్ మాత్రం ఇలా సినిమాల రూపంలో కరోనాపై కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఏదో సరదాగా సోషల్ మీడియాలో నవ్వుకుంటారని సినిమా టైటిల్స్​తో ‘కరోనా’పై మీమ్స్ చేస్తున్నవాళ్లంతా ఈ నిజమైన టైటిల్స్ చూసి అవాక్కవుతున్నారు. మన సౌత్‌లోనూ ఎవరైనా ఇలాంటి ‘కరోనా’ కహానీలు, టైటిల్స్ రెడీ చేస్తున్నారేమో చూడాలి!

For More News..

మహేశ్ కాదన్న సినిమా.. పవన్ చేస్తున్నాడా?

ఏప్రిల్‌ ఒకటి తర్వాత ఆ బండ్లన్నీ స్క్రాపే

కరోనాపై ఇండియన్ డాక్టర్ల ముందడుగు

Latest Updates