వాస్తు ఉంటేనే ఇల్లు కొంటం: హైదరాబాద్‌‌లో 80 % ఇదే మాట

  • ఇతర సిటీల కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ ఇంపార్టెన్స్
  • ఐటీ ఉద్యోగులే  వాస్తు రిలేటెడ్ అంశాలకు ప్రాధాన్యత

హైదరాబాద్, వెలుగు: సొంతింటి నిర్మాణంలో కస్టమర్లు తమ అభిరుచికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇంటి ఆర్కిటెక్చర్ నుంచి మొదలుకుంటే రంగుల వరకు ఏరికోరి ఎంపిక చేస్తారు. మరీ ముఖ్యంగా నిర్మాణం వాస్తు ప్రకారం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. శాశ్వత నిర్మాణం కాబట్టి ఈ విషయంలో ఏమాత్రం రాజీ పడటం లేదని ఇటీవల మహీంద్ర లైఫ్ స్పేస్ నిర్మాణ రంగ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం హైదరాబాద్ లో రియల్ మార్కెట్ దూసుకుపోతున్న క్రమంలో… సిటీలో క్రయవిక్రయాలు చేసేవారిలో 80 శాతం మంది వాస్తు ప్రకారం నిర్మించిన ఫ్లాట్లు, అపార్ట్​మెంట్లు, ఇళ్లను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. బాగా చదువుకున్నవారు, ఐటీ ఉద్యోగులే  వాస్తు రిలేటెడ్ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని సర్వేలో తేలింది.

వాస్తుంటే సేల్ గ్యారంటీ

సొంతింటి విషయంలో కస్టమర్లు రాజీపడటం లేదు. రేటు ఎలా ఉన్నా… అంతకంటే ముందు నిర్మాణశైలి, వాడిన మెటీరియల్, సౌకర్యాలు, వెంటిలేషన్, ఎయిర్ ఫ్లో వంటి విషయాలు సర్వసాధారణంగా అడిగి తెలుసుకునే విషయాలే కాగా, అంతకంటే ఎక్కువగా వాస్తు శైలి ఆధారంగానే ఇంటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ సిటీలో వందల సంఖ్యలో అపార్ట్​మెంట్లు, బిల్డింగులు నిర్మాణం అవుతుంటే, ఇందులో వాస్తు ప్రకారం ఉన్న స్థిరాస్తి హాట్  కేకుల్లా అమ్ముడవుతున్నట్లు సర్వేలో తేలింది. రీసేల్ ప్రాపర్టీ అయినా వాస్తు ప్రకారం ఉంటేనే కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఏమాత్రం లోపం ఉన్నా… ప్రాజెక్టుల్లోని ప్లాట్లను అమ్మడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు.

పెద్దవారికంటే యువతకే ఆసక్తి

ఇల్లు కట్టాలన్నా, ఇంటిని కొనుగోలు చేయాలన్నా.. ఇంట్లో పెద్దవారే ముందుండి అన్ని విషయాలను ఆరా తీసి ముందడుగు వేస్తుంటారు. ఇందులో వాస్తు నిపుణులతో సంప్రదింపులు చేసేవారు కొందరైతే, వాస్తు గురించి తెలిసిన వారిని వెంటబెట్టుకుని మరీ వాస్తు విషయాలను దృష్టిలో పెట్టుకుని స్థిరాస్తిని కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇందులో పెద్దవారికంటే ఎక్కువగా 25 నుంచి 35 ఏళ్ల లోపు ఉన్నవారే వాస్తు అంశాలను గుచ్చిగుచ్చి అడిగి తెలుసుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది. ఫ్లాట్ నిర్మాణ శైలి, ఓపెన్ స్పేస్, కార్పెట్ ఏరియా, బిల్డప్ ఏరియాల కంటే ఎక్కువగా వాస్తు ప్రకారం పూజ గది, బెడ్రూం, హాల్, వెంటిలేషన్ ఉన్నాయో లేదోననీ ఒకటికి రెండుసార్లు కన్ఫర్మ్  చేసుకుంటున్నారు.

ఇతర నగరాల్లో తక్కువే..

ఇతర నగరాలతో పోల్చితే వాస్తు పట్ల శ్రద్ధ పెట్టేవారిలో హైదరాబాద్ వాసులే ముందున్నట్లు సర్వేలో తేలింది. ఇతర నగరాలకు చెందినవారు ఎక్కువగా మార్కెట్ డిమాండ్, నిర్మాణ శైలి, ఏరియా వంటి ప్రాధాన్యతనిస్తుండగా, మన సిటీలో వాస్తు ప్రకారం ఉన్న ఫ్లాట్లను మాత్రమే చూపమనీ అడుగుతున్నారనీ కూకట్ పల్లిలోని రియల్ ఎస్టేట్ వ్యాపారి సుదర్శన మూర్తి ‘వెలుగు’తో చెప్పారు. మహీంద్ర లైఫ్ స్పేస్ సర్వేలోనూ ఇదే విషయం వెల్లడి కాగా, హైదరాబాద్ లో స్థిరాస్తి కొనుగోలు చేసేవారిలో 80 శాతం మంది ప్రభావితం అవుతున్నారని, చెన్నైలో 40 శాతం, బెంగళూరు లో 42, ముంబైలో11 శాతం మందే వాస్తు అంశాలను దృష్టిలో పెట్టుకుని సొంతింటిని కొనుగోలు చేస్తున్నారని సర్వే చెబుతోంది.

Latest Updates