సౌండ్ బాక్స్‌లో మ‌ద్యం సీసాలు.. ప‌క్క రాష్ట్రానికి అక్ర‌మ ర‌వాణా

న‌లుగురు అరెస్ట్.. 5 ఆటోలు సీజ్

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా నుండి ఆంధ్రప్రదేశ్ ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామానికి అక్రమంగా తరలిస్తున్న 1085 మద్యం సీసాలను వీరులపాడు పోలీసులు ప‌ట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ నందు నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నందిగామ డి ఎస్ పి, జి.వి రమణ మూర్తి మాట్లాడుతూ… ఖమ్మంలో బెల్టుషాపులు నిర్వహిస్తున్న గంపా జమలయ్య అనే వ్యక్తి కొండపల్లి గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తికి అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నార‌ని తెలిపారు. ఈ క్రమంలో వీరులపాడు మండలం సరిహద్దు చెక్ పోస్టుల వద్ద ప్రయాణికులతో వస్తున్న ఆటోలను ఆపి తనిఖీ చేయగా మూడు ఆటోల నందు 1085 మద్యం సీసాలు లభించాయన్నారు. ఆటోలో వెనక భాగంలో ఉన్న సౌండ్ బాక్స్  నందు మద్యం సీసాలను దాచి తీసుకువస్తున్నట్లు గుర్తించామన్నారు.

మద్యం అక్రమ రవాణా చేసేందుకు సదరు వ్యాపారులు కొత్త దారులు వెతుకుతున్నారన్న డీఎస్‌పీ.. అక్రమ మద్యం సరఫరా పై బలమైన చట్టాలు అమలు లో ఉన్నాయని ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష తో పాటు 50 వేలు జరిమానా తో కూడిన కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కేసులో 5 ఆటోలు సీజ్ చేసి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. ఖమ్మం కు చెందిన గంపా జమలయ్య తో పాటు మరొక ఆటో సీజ్ చేయాల్సి ఉందని డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.

Latest Updates