కూరగాయలు పిరం: పది రోజుల్లో ధరలు రెండింతలు

    కిలోకు రూ. 50 నుంచి రూ.80 వరకు రేట్లు

    ఆర్టీసీ సమ్మెతో రవాణాకు ఇబ్బంది

    ప్రైవేటు వెహికల్స్‌‌లో తరలిస్తున్న రైతులు

     ట్రాన్స్‌‌పోర్టు చార్జీలు పెరిగి కొండెక్కిన ధరలు

కూరగాయల ధరలు కొండెక్కాయి. ఏది కొనాలన్నా రేట్లు మండిపోతున్నాయి. ఇప్పటికే వానలకు పంటలు దెబ్బతిని తక్కువ కూరగాయలే మార్కెట్‌‌కు వస్తుంటే.. ఇప్పుడు ఆర్టీసీ సమ్మెతో వస్తున్న ఆ కాస్త వెజిటబుల్స్‌‌ కూడా పిరమయ్యాయి. పది రోజుల్లోనే ధరలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం టమాట, ఉల్లి, పచ్చి మిర్చి కిలో రూ.40 నుంచి రూ.50 వరకు.. ఆలు, వంకాయ, బెండ, బీర, కాకర రూ.50 నుంచి రూ.60 వరకు ధర పలుకుతున్నాయి. క్యారెట్ రూ.60, క్యాప్సికమ్ రూ.65కు వస్తుండగా.. బీన్స్‌‌, చిక్కుడుకాయలైతే రూ.80కి చేరాయి. ఇంకో నెల రోజులు దిగుబడి పరిస్థితి ఇట్లే ఉండొచ్చని రైతులు చెబుతున్నారు.

‘ప్రైవేటు’లో ట్రాన్స్‌‌పోర్టు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో సెప్టెంబర్‌‌ నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ వానలకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ఫలితంగా పంటల దిగుబడి భారీగా తగ్గింది. దీంతో ఇప్పటికే కన్నీరు పెట్టిస్తున్న ఉల్లికి తోడు మిగతా కూరగాయల ధరలకూ రెక్కలొచ్చాయి. దీనికితోడు కొన్ని రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెతో రోజూ బస్సుల్లో వెజిటబుల్స్‌‌ను పట్టణాలకు తరలించే రైతులు ఇబ్బంది పడుతున్నారు. వేరే దారిలేక ప్రైవేట్‌‌ వెహికల్స్‌‌ను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటోళ్లు సాధారణం కన్నా రెండు, మూడు రెట్లు ఎక్కువ చార్జీలు వసూలు చేస్తుండటంతో కూరగాయల ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది.

దిగిరాని ఉల్లి

ఆగస్టు ఫస్ట్‌‌ వీక్‌‌ వరకు కిలో రూ.15 నుంచి రూ.20 పలికిన ఉల్లి.. తర్వాత క్రమంగా రూ.60 వరకు పెరిగింది. ఉల్లి ఎగుమతులను కేంద్రం నిలిపేయడంతో ధరలు కాస్త తగ్గినా ఇంకా రూ.40 దగ్గరే ఉన్నాయి.

సప్లై లేదంటున్నరు

నేను హైదరాబాద్‌‌ విద్యానగర్‌‌లో ఉంటా. పండుగకు ముందున్న ధరలతో పోలిస్తే కూరగాయల రేట్లు ఇప్పుడు బాగా పెరిగినయ్‌‌. ఇంట్లోకి వెజిటబుల్స్‌‌ ఖర్చే రోజుకు రూ. 60 నుంచి రూ. 70 అవుతోంది. పై నుంచే సప్లై సరిగా లేదని అమ్మేటోళ్లు అంటున్నరు.

– కుంభం ఆంజనేయులు, విద్యానగర్‌‌, హైదరాబాద్‌‌

బస్సుల్లేక ఇబ్బందైతంది

మాది హసన్‌‌పర్తి. నేను కూరగాయలు పండించి రోజూ హన్మకొండ రైతుబజార్‌‌లో అమ్ముకొని వస్తుంటా. ఇప్పుడు బస్సుల్లేక ఆటో మాట్లాడుకుని పోవాల్సి వస్తోంది. బస్సుకు రోజుకు రానుబోను రూ.60 ఖర్చయితే ఆటోలకు రూ.200 అవుతోంది. వర్షాల వల్ల ఆకుకూరల దిగుబడి తగ్గింది. – గంటా రమేశ్‌‌, రైతు, హసన్‌‌పర్తి, వరంగల్‌‌ అర్బన్‌‌

కొనేటట్లు లేవు కూరగాయల రేట్లు మండిపోతున్నయి. ఏది కొనాలన్నా పిరమే. ఐదుగురం ఉండే మా ఇంట్లో రోజుకు రూ.100 వరకు కూరగాయలకే ఖర్చవుతోంది. – వి.లక్ష్మి, గృహిణి, రాం నగర్‌ , హైదరాబాద్‌‌

Latest Updates