వాహనదారులకు బ్యాడ్‌న్యూస్.. పెరిగిన ఇన్సూరెన్స్‌‌ ధర

    ముసాయిదాను విడుదల చేసిన ఐఆర్‌‌డీఏఐ

    వాహనాల సీసీ కెపాసిటీని బట్టి థర్డ్‌‌ పార్టీ ప్రీమియం పెంపు

    కరెంట్‌‌ బండ్లకు మాత్రం 15 శాతం తగ్గింపు

     వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్త రేట్లు అమల్లోకి..

హైదరాబాద్‌‌, వెలుగు: వచ్చే నెల నుంచి వాహనాల థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ ప్రీమియం రేట్లు పెరగనున్నాయి. వాహనం, మోడల్‌‌, ఇంజన్​ కెపాసిటీని రూ.150 వరకు భారం పెరగనుంది. ఈ మేరకు ఇన్సూరెన్స్‌‌ రెగ్యులేటరీ అండ్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ అథారిటీ ఆఫ్‌‌ ఇండియా (ఐఆర్‌‌డీఏఐ) ముసాయిదాను విడుదల చేసింది. కొత్త రేట్లు ఏప్రిల్‌‌ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఎలక్ట్రిక్‌‌ వాహనదారులకు మాత్రం ఊరట కలిగించారు. వాటి ప్రీమియంపై 15శాతం దాకా డిస్కౌంట్‌‌ ప్రకటించారు. ఇప్పటికే పెట్రోల్‌‌, డీజిల్‌‌ ధరలు పెరగడంతో నానా పాట్లు పడుతున్నామని, మళ్లీ ఇన్సూరెన్స్‌‌ ప్రీమియం పెంపు ఏమిటని జనంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

థర్డ్​ పార్టీ రేట్లు పెంపు..

ప్రతి మోటార్‌‌ ఇన్సూరెన్స్‌‌ పాలసీ ద్వారా 2 రకాల ప్రయోజనాలు లభిస్తాయి. ఓన్‌‌ డ్యామేజ్‌‌ ఇన్సూరెన్స్‌‌ ఒకటి. రెండోది థర్ట్‌‌ పార్టీ (టీపీ) ఇన్సూరెన్స్‌‌ కవరేజీ. ప్రమాదం వల్ల మన వాహనానికి ఏదైనా నష్టం జరిగితే ఓన్‌‌ డ్యామేజ్‌‌ కవరేజీ కింద బీమా కంపెనీ నుంచి నష్టపరిహారం పొందవచ్చు. మీ వాహనంతో ఇతరులకు, వారి వాహనాలు, ఆస్తులకు జరిగే నష్టాలకు టీపీ కింద రక్షణ పొందవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరం టీపీ ఇన్సూరెన్స్‌‌ రేట్లు పెరుగుతాయి. ఇందులో భాగంగానే కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.

టూవీలర్లకు ఎంతంటే?

75 సీసీ కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న టూవీలర్స్‌‌కు థర్డ్​ పార్టీ ప్రీమియం ప్రస్తుతం రూ. 482 గా ఉండగా.. కొత్త రేటు ప్రకారం రూ. 506కి పెరగనుంది. 75 సీసీ నుంచి 150 సీసీ కెపాసిటీకి ప్రస్తుతమున్న రూ.752 నుంచి రూ.769కి చేరనుంది. 150-–350 సీసీ కెపాసిటీ ఉన్న వాటిపై రూ.1,193 నుంచి రూ.1,301 వరకు పెంచనున్నారు. 350 సీసీకి మించిన బైక్‌‌ల ప్రీమియం రేట్లు ఈసారి పెరగనున్నాయి. ప్రస్తుతమున్న రూ. 2,323 నుంచి రూ.2,571కి చేరుతాయి.

కార్లకు ఇట్లా..

పెరిగే ధరల ప్రకారం వెయ్యి సీసీల్లోపు కెపాసిటీ కార్లకు రూ. 2,182 ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ ధర రూ.2,072గా ఉంది. వెయ్యి నుంచి 1500 సీసీ మధ్య ఉన్న కార్లకు రూ. 3,383 ప్రీమియంగా నిర్ణయించారు. ఇదిప్పుడు రూ.3,221గా ఉంది. 1,500 సీసీ కంటే అధిక కెపాసిటీ  ఉండే విలాసవంతమైన కార్లకు మాత్రం ప్రీమియం పెంపు నుంచి మినహాయింపు ఇవ్వడం గమనార్హం. వాటిపై ప్రస్తుతమున్న రూ.7,890 ప్రీమియం రేటే కొనసాగుతుంది. పబ్లిక్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ వాహనాలతో పాటు ప్రైవేట్ గూడ్స్ వాహనాలు, స్కూల్ బస్సులపైనా ఐఆర్‌‌డీఏఐ బీమా ప్రీమియం పెంచింది. స్కూల్‌‌ బస్సులకు రూ.13,874 నుంచి రూ. 14,338కి పెంచాలని ప్రతిపాదించింది. ఇతర బస్సులకు రూ. 14,494 నుంచి రూ. 14,978కు పెంచింది.

ప్రీమియం పెంపుపై అసంతృప్తి

ఇన్సూరెన్స్‌‌ ప్రీమియం రేట్లు పెంచడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెట్రోల్‌‌, డీజిల్‌‌ రేట్లు అడ్డగోలుగా పెరిగి సతమతం అవుతున్నామని వెహికల్స్​ ఓనర్లు అంటున్నారు. ఇన్సూరెన్స్‌‌  ప్రీమియం పెంచుతున్నా క్లెయిమ్‌‌ మొత్తాన్ని మాత్రం పెంచడం లేదని చెప్తున్నారు.

Latest Updates