దోస్తీతోనే పట్టం : మరాఠాగడ్డపై కాషాయ రాజకీయం

  • బీజేపీ, శివసేన పొత్తు చుట్టే మహారాష్ట్ర ఎన్నికల మూడ్

  • కలిసుంటే ఓకే, వేరుపడితేనే తక్లిబ్

  • ఇప్పటికే కాంగ్రెస్ , ఎన్సీపీ జట్టు

  • ఎన్డీయేకు దూరమైన స్వాభిమాన్ సంఘటన్

2014 లోక్ సభ ఎలక్షన్లలో ఎన్డీయేకు గట్టిగా సపోర్టు ఇచ్చిన రాష్ట్రం మహారాష్ట్ర. ఇక్కడి 48 లోక్ సభ సీట్లలో 41 సీట్లు ఆ కూటమికే వచ్చినయి. రాష్ట్రంలో ఎన్నికల సీన్ మొత్తం​బీజేపీ, శివసేన పొత్తు మీదే ఆధారపడి ఉంటది. ఈ రెండూ జిగ్రీ దోస్తులు. కలిసుంటూనే కలబడుతున్నయి. ఇప్పటికీ విమర్శలు చేసుకుంటనే ఉన్నయి. పొత్తు కుదురుతదా, లేదా అన్న అనుమానం రేపుతున్నాయి. ఇంకోదిక్కు అవకాశమొస్తె అందిపుచ్చుకోవడానికి కాంగ్రెస్​, ఎన్సీపీ ఇప్పటికే జట్టు కట్టినయి. రైతుల్లో ఎఫెక్ట్ చూపించగల ‘స్వాభిమాన్​ సంఘటన్​’ఎన్డీయేకు దూరమైంది. మరి ఈసారి ఎలా ఉంటుందన్నది ఉత్కంఠ రేపుతోంది. దేశంలోని కీలక రాష్ట్రాల్లో ఒకటైన మహారాష్ట్రలో పొలిటికల్​ సీన్​పై ‘వెలుగు’ప్రత్యేక కథనం.

లోక్ సభ ఫలితాలను ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధికంగా ప్రభావితం చేసే రాష్ట్రాల్లో ముఖ్యమైనది మహారాష్ట్ర. ఇక్కడ ఉన్న 48 సీట్లలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు రాబట్టుకుంటే అంత మైలేజీ. 2004 నుంచి బీజేపీ, శివసేనల ఎన్డీయే కూటమి ఓవైపు, కాంగ్రెస్, ఎన్సీపీల జట్టు మరోవైపు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. అలాంటిది 2014 ఎన్నికల్లో ఎన్డీయే గట్టి దెబ్బకొట్టి 90 శాతం లోక్ సభ సీట్లు సాధించింది. కానీ ఈసారి దేశవ్యాప్తంగా రాజకీయాలు మారుతుండటంతో మహారాష్ట్రలో పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఉత్కంఠగా ఉంది.

పెద్దన్న పాత్ర కోసమే..

2014 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్ని కల్లో బీజేపీ 122 సీట్లు, శివసేన 63 సీట్లు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ 42, ఎన్సీపీ 41 సీట్లకు పరిమితమయ్యాయి. ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లకు 20 స్థానాలు వచ్చాయి. బీజేపీకి ఎక్కువ సంఖ్యలో సీట్లు రావడంతో శివసేన అసంతృప్తిలో కూరుకుపోయింది.  అప్పటి నుంచి ఈ రెండు పార్టీల మధ్య కోల్డ్‌‌‌‌‌‌‌‌వార్ నడుస్తోంది. బీజేపీ ప్రభుత్వంలో శివసేన భాగస్వామిగా ఉన్నా తరచూ వివాదాలతోనే కాలం గడిచింది. కొంతకాలంగా ప్రధాని మోడీ తీసుకున్న పలు నిర్ణయాలతో విభేదించిన శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే.. బీజేపీపై నేరుగా విమర్శలు చేశారు. కేంద్రంలో ఎన్డీయే సర్కారు నుంచి శివసేన బయటికి వచ్చింది కూడా. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతోంది. మహారాష్ట్ర సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ . వీలైనంత వరకు శివసేనతో సున్నింతగా వ్యవహరిస్తూ వచ్చారు. అయినా ఇరు పార్టీల మధ్య దూరం పెరుగుతూనే పోయింది. అందుకే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు డిమాండ్ చేయాలని శివసేన ఆలోచనలో ఉంది. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన సమాన సంఖ్యలో పోటీ చేస్తాయన్నది ఉత్త ప్రచారమేనని తమ పార్టీయే పెద్దన్న పాత్ర పోషిస్తుందని ఇటీవలే శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ కూడా అన్నారు.

బీజేపీ అలర్ట్

ఎన్డీయే నుంచి పాత మిత్రులు బయటకు వెళ్లిపోతుండటం.. కొత్త మిత్రుల రాకలేకపోవడం బీజేపీ కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తమతో కలిసి వచ్చే కొద్దిమంది మిత్రులను దూరం చేసుకోవద్దన్న భావనతో ఉంది. దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు మారిపోవడం, ఎన్డీయేకు సీట్లు తగ్గు తాయన్న అంచనాల నేపథ్యంలో శివసేనను మచ్చిక చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం అమిత్ షా సహా అందరూ రంగంలోకి దిగారు. ఆర్ఎస్ఎస్ పెద్దలూ చర్చలు జరుపుతున్నారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే జయంతి నేపథ్యంలో ఆయన మెమోరియల్ కోసం రూ.100 కోట్లు కేటాయిస్తూ గత నెలలో ఫడ్నవీస్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తాజాగా రాజకీయ వ్యూహకర్త, జేడీయూ నాయకుడు ప్రశాంత్ కిశోర్‌‌‌‌‌‌‌‌ను బీజేపీ రంగంలోకి దింపింది. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేతో ప్రశాంత్ కిశోర్ గంటకు పైగా సమావేశమయ్యారు. దీనికి రాజకీయ ప్రాధాన్యత లేదని శివసేన పేర్కొంది. కానీ ఎన్డీయే భాగస్వామి అయిన జేడీయూ నేతగా ఉన్న ప్రశాంత్ కిశోర్… బీజేపీ, శివసేన మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది.

స్వాభిమాని సంఘటన్ ’ఎటు?

మహారాష్ట్ర చెరుకు రైతుల సమస్యలే ప్రధాన ఎజెండాగా ఏర్పాటైన ‘స్వాభిమాని షెట్కారీ సంఘటన’ 2017లో ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసింది. ఆ పార్టీ ఒంటరిగా గెలిచే పరిస్థితి లేనప్పటికీ పశ్చిమ మహారాష్ట్ర, మరాఠ్వాడ, విదర్భ ప్రాంతాల్లోని అనేక సెగ్మెంట్లలో గెలుపోటములను నిర్ణయించగల సత్తా ఉన్న పార్టీ. 2014 లోక్ సభ ఎన్ని కల్లో ఈ పార్టీ ఒక లోక్ సభ సీటును గెలుచుకోగలిగింది. ఈసారి ఆ పార్టీ ఎవరికి మద్దతిస్తుంది, ఎవరి ఓట్లను చీలుస్తుందని అన్నది మహారాష్ట్రలో ఫలితాలపై ప్రభావం పడుతుంది.

Latest Updates