ఆడియో: వరదలో కొట్టుకుపోతూ కాపాడాలంటూ ఫోన్‌లో వెంకటేష్ చివరి మాటలు

భారీ వర్షాలకు ఇబ్రహీంపట్నం వద్ద కారులో కొట్టుకుపోయిన వెంకటేష్ గౌడ్, రాఘవేందర్‌ల మృతదేహాలు లభించాయి. వెంకటేష్ మృతదేహం బుధవారం లభించగా.. రాఘవేందర్ మృతదేహం గురువారం లభించింది. వీరి మృతదేహాలు చెట్ల పొదల్లో చిక్కుకొని నిలిచిపోయాయి. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో రాఘవేందర్ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో అక్కడికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కందుకూరుకు చెందిన వీరిద్దరూ చెర్వుగట్టు రామలింగేశ్వర స్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. వరద నీటికి కొత్తగూడెం వద్ద నేషనల్ హైవే బ్లాక్ కావడంతో వీరు ఇబ్రహీంపట్నం మీదుగా కందుకూరు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే లష్కర్ గూడ వద్దకు రాగానే స్థానిక వాగు పొంగి.. కారు కొట్టుకుపోయింది. దాంతో వారు కారుతో సహా గల్లంతయ్యారు. బుధవారం వెంకటేష్ గౌడ్ మృతదేహం లభించగా.. రాఘవేందర్ మృతదేహం గురువారం లభించింది.

కాగా.. వీరు ప్రమాదంలో చిక్కుకున్న తర్వాత కాపాడాలంటూ తమకు తెలిసిన వారికి ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. అయితే వాగు వద్దకు వచ్చిన కొంతమంది.. కారులో చిక్కుకున్న వారికి సాయం చేయాలని ప్రయత్నించారు. కానీ, వాగు ఉధృతి ఎక్కువగా ఉండటంతో సాయం చేయలేకపోయారు. వెంకటేష్ గౌడ్ ప్రమాదానికి ముందు ఒడ్డున ఉన్నవారికి ఫోన్ చేసి పరిస్థితి వివరించాడు.

ప్రమాదంలో చిక్కుకున్న వెంకటేష్ చివరి మాటలు ఇవే..

వెంకటేష్:‘అన్నా నేను వెంకటేష్ గౌడ్ అన్నా..
స్థానికుడు: అన్నా మీరు సేఫ్‌లో ఉన్నారా..

వెంకటేష్: సేఫ్ ఎక్కడిది అన్నా.. కారు ఇప్పడిదాకా బాగుంది. ఇప్పుడే రెండు పైయ్యలు రైటుకు లేచినయి.
స్థానికుడు: ఇప్పుడు మీరు కారులోనే ఉన్నరా..

వెంకటేష్: కారులోనే ఉన్నం, కారు మొత్తం నిండిందన్నా.. జర ఎవరన్నా ఉంటే పంపన్నా.. ఏ రకంగానన్న..
స్థానికుడు: మేం ఇవతల ఉన్నం అన్నా.. రాలేక పోతున్నం.. మేం చాలా సేపయింది ఇక్కడికొచ్చి..

వెంకటేష్: అదే అదే లైట్లు కొడుతుండ్రు కానీ ఎవరో తెలుస్తలేదు..
స్థానికుడు: ఒక్క నిమిషం అన్నా.. నీకు అక్కడ కాంపౌండ్ వాల్ కనబడుతుందా..

వెంకటేష్: హా.. కాంపౌండ్ వాలే అడ్డం ఉంది.
స్థానికుడు: మీరు అందులోకి పోలేకపోతున్నారా..

వెంకటేష్: కాదన్న మేం దిగితే మాతోటి కాదిక.. దిగితే నదిలోకే..
స్థానికుడు: అంటే మీరు కారు దిగితే వాటర్‌లో కొట్టుకుపోతరా..

వెంకటేష్: అంతే ఇగ..
స్థానికుడు: మేం ఇవతలే ఉన్నం గానీ రాలేకపోతున్నం..

వెంకటేష్: కార్ల నీళ్ళలో వెనుకకు వెనుకకు వెళ్లిపోతుంది..
స్థానికుడు: మీరు ధైర్యంగా ఉండండి బ్రదర్..

వెంకటేష్: ధైర్యం ఏం లేదిగ.. కారు పోతుంది..
స్థానికుడు: ఏంకాదు బ్రదర్.. ధైర్యంగా కొద్దిసేపు ఆగురి..

వెంకటేష్: కొద్దిగ కాదు అన్న.. ఇంతసేపు చెట్టు ఉండే.. చెట్టు వెళ్లిపోయింది.. చెట్టు వెనకాలే కారు కూడా పోతుంది..
స్థానికుడు: మీకు చెట్లు కూడా ఏం దొరుకతలేవా చేతికి పట్టుకోవడానికి..

వెంకటేష్: ఇగ సూడిరి.. కారు పోతుంది..

ఆ తర్వాత వెంకటేష్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

For More News..

తెలంగాణలో కొత్తగా 1,432 కరోనా కేసులు

పండక్కి ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. మరి నో కాస్ట్ ఈఎంఐ బెటరా? బై నౌ పే లేటర్ బెటరా?

గొంతునొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఈ డ్రింక్స్ ఓసారి ట్రై చేయండి

Latest Updates