మేనల్లుడి కోసం : అప్పుడు ప్రేమమ్..ఇప్పుడు మజిలీ

హైదరాబాద్‌: నాగచైతన్య, శ్రుతిహాసన్ జంటగా నటించిన ప్రేమమ్ సినిమాలో గెస్ట్ గా కనిపించి, మేనల్లుడు నాగచైతన్య కోరిక తీర్చిన విక్టరీ వెంకటేష్..మరోసారి గెస్ట్ గా రానున్నాడు. అయితే ఈ సారి గెస్ట్ గా కనిపించేది సినిమాలో కాదు..ప్రీ రిలీజ్ వేడుకకు.  చైతు, సమంత నటిస్తున్న లేటెస్ట్ మూవీ మజిలీ. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 30న జరగనుంది. ఈ కార్యక్రమానికి వెంకీ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నాడు. వెంకటేష్, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో ‘వెంకీ మామ’ అనే సినిమా తెరకెక్కబోతోంది. సో.. ఈ రెండు సినిమాలకూ ప్రచారం చేసినట్లుగా ఉంటుందని  మజిలీ వేడుకకు హాజరయ్యేందుకు ఒప్పుకొన్నారట వెంకీ. ఇంతకుముందు చైతు నటించిన ప్రేమమ్ లో గెస్ట్ గా కనిపించి అలరించాడు వెంకటేష్. ఇప్పుడు ఈ మజిలీ కోసం చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడన్నమాట.

‘మజిలీ’ లో దివ్యాంశా కౌశిక్‌ మరో హీరోయిన్ గా నటించింది. ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన భార్యభర్తల అనుబంధం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇప్పటికే నాగచైతన్య, సమంత కలిసి సినిమా కోసం బాగా ప్రచారం చేస్తున్నారు. గోపీ సుందర్‌ ఈ సినిమాకు మ్యూజిక్.  పెళ్లయ్యాక చై, సామ్‌ జంటగా నటించిన తొలి సినిమా కావడంతో ‘మజిలీ’పై ప్రేక్షకుల్లో బాగా అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్‌ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Latest Updates